తనను మనస్ఫూర్తిగా ప్రేమ వాడు దొరికితే, ఆ మనిషి తనకు నచ్చితే మళ్లీ పెళ్లి చేసుకునేందుకు రెడీ అని టీవీ9 యాంకర్, బిగ్‌బాస్ సీజన్ -4 కంటెస్టెంట్ దేవి నాగవల్లి తన మనసులో మాటను వెల్లడించారు. బిగ్‌బాస్ నుంచి ఎలిమినేషన్ తర్వాత ఆమె వరుసగా సోషల్ మీడియాకు, ఇతరత్రా మాధ్యమాలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ సందర్భంగా ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భవిష్యత్ జీవితం, పెళ్లి గురించి మాట్లాడారు.
పెళ్లి, విడాకులు, కుటుంబం గురించి అడిగిన ఓ ప్రశ్నకు దేవి సమాధానమిస్తూ … బిగ్‌బాస్ షోకు వెళ్లే ముందు ఏదైనా వీడియో రికార్డు చేసివ్వాలని, హౌస్‌లోకి వెళ్లిన తర్వాత రిలీజ్ చేస్తామని స్నేహితులు అడిగారన్నారు. దీంతో ఏం చెప్పాలని అని ఆలోచిస్తే … తన గురించి తెలియంది పర్సనల్ లైఫ్ మాత్రమే అని ఆలోచించి వీడియో చేశానన్నారు. అయితే తన జీవితం బాధాకరమైం దేమీ కాదన్నారు. తనది పెద్దలు కుదిర్చిన పెళ్లి అని చెప్పారు. తాను ఒక వైపు ఉద్యోగం చేస్తుండగా, ఉన్నట్టుండి ఒకరోజు యూఎస్ఏ వెళ్లాలని చెప్పారన్నారు.
అయితే అమెరికా వెళ్లడం తనకే మాత్రం ఇష్టం లేదన్నారు. కానీ అందరూ “వెళ్లు వెళ్లు” అని చెప్పడంతో కాదనలేక వెళ్లిపోయా నన్నారు. కానీ అక్కడ ఉండలేకపోయినట్టు దేవి చెప్పుకొచ్చారు. అమెరికాలో యాక్ట్ చేయలేకపోయానన్నారు. ఆ విషయాన్ని వాళ్లతో చెప్పానన్నారు. ఇక అక్కడ ఉండడం తన వల్ల కాలేదని తెలిపారామె. అలాగని వాళ్లను ఇక్కడికి రమ్మని చెప్పలేన న్నారు. ఎందుకంటే వాళ్లు అక్కడ సెటిల్ అయ్యారని, మంచి జీతం, మంచి ఉద్యోగం అని మాజీ భర్త గురించి దేవి తెలిపారు.
తనకు కొన్ని డ్రీమ్స్ , కొన్ని గోల్ప్ ఉన్నాయని ఆమె వెల్లడించారు. దీంతో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుని వచ్చి నట్టు దేవి నాగవల్లి తెలిపారు. ఆ మాత్రం దానికి విడాకులు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందనే యాంకర్ ప్రశ్నకు… వాళ్లు అక్కడ సెటిల్ అయ్యారని మరోసారి స్పష్టం చేశారు. తనకు జీవితం సెట్ కాలేదని తెలిపారు. తన ఆరేళ్ల బాబు కార్తికేయను చూసుకుంటున్నట్టు దేవి చెప్పారు.
అంతేతప్ప తన జీవితం కన్నీళ్లు పెట్టుకునేంత ఏమీ లేదన్నారు. తనకు ఎక్కడా కన్నీళ్లు పెట్టాల్సిన అవసరం కూడా రాలేద న్నారు. తాను సంతోషంగా ఉన్నానని, అక్కడ వాళ్లు కూడా సంతోషంగా ఉన్నారని ఆమె చెప్పుకొచ్చారు. మళ్లీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కలగలేదా? అనే ప్రశ్నకు దేవి ఒక రకమైన ఎగ్జైట్‌మెంట్‌కు గురైనట్టు … ఆమె నవ్వులో కనిపించింది.
ఇప్పటి వరకు ఆ ఆలోచన లేదన్నారు. కానీ భవిష్యత్ గురించి ఇప్పుడు చెప్పలేనన్నారు. మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఇష్టపడే వారెవరైనా వస్తే అనే ప్రశ్నకు … చూస్తానని నవ్వుతూ సమాధానం ఇచ్చారామె. ఇంకా ఆలోచించలేదని, కానీ మనిషి నచ్చాలని కండీషన్ పెట్టారామె. అంటే మళ్లీ పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశాన్ని బయటపెట్టారు.
పెళ్లి విషయాలు మాట్లాడుతు న్నంత సేపూ ఆమె మొహంలో కాంతి కనిపించింది. మళ్లీ కొత్త జీవితాన్ని చిగురింపు చేసుకోవాలనే ఆలోచనలు ఆమె మాటల్లో ప్రతిబింబించాయి. అయితే తన ఆలోచనలు, ఆశయాలకు తగిన తోడు దొరికితే మాత్రం కలిసి జీవన ప్రయాణం సాగించేందుకు సిద్ధంగా ఉన్నట్టు దేవి అంతరంగం తేల్చి చెబుతోంది.