ఉత్తరాంధ్ర- శిరీష్- పూర్వీ వీర్రాజు.. ఢీ.. ఢీ

థియేటర్లు మోనోపలీ చేసి, లోకల్ డిస్ట్రిబ్యూటర్లను తొక్కేయాలని దిల్ రాజు/శిరీష్ చూస్తున్నారు

ఉత్తరాంధ్రలో థియేటర్ల వ్యవహారం మరోసారి రచ్చకెక్కెలా వుంది. ఈ దీపావళికి విడుదలైన మూడు సినిమాలు.. క, అమరన్, లక్కీ భాస్కర్ ఏవీ కూడా ఎగ్జిబిటర్ శిరీష్ (దిల్ రాజు సోదరుడు)కు చెందిన థియేటర్లలో ప్రదర్శించలేదు. ఈ మూడు సినిమాలు ఉత్తరాంధ్ర ఏరియాకు పంపిణీ చేసింది వీర్రాజు అనే పంపిణీదారు.

ఉత్తరాంధ్రలో దిల్ రాజు- శిరీష్ లతో సమానంగా పోటీ పడుతూ సినిమాలు పంపిణీ చేస్తూ వస్తున్నారు పూర్వీ పిక్చర్స్ వీర్రాజు. సితార సంస్థ వైజాగ్ ఏరియాకు పంపిణీదారు వీర్రాజునే. అ విధంగా లక్కీ భాస్కర్ అయనే పంపిణీ చేసారు. క సినిమాను అయనే తీసుకున్నారు. అమరన్ సినిమాను కూడా అయనే తీసుకున్నారు. దీంతో దీపావళికి విడుదలైన మూడు సినిమాలు అయన అఫీస్ కే వచ్చాయి.

ఈ సినిమాలు వేయడం కోసం శిరీష్ కు చెందిన థియేటర్ల నుంచి కోటీ పది లక్షలు అడ్వాన్స్ గా అడిగారు వీర్రాజు. సినిమాల కెపాసిటీని బట్టి, క్రేజ్‌ను బట్టి, డిమాండ్ ను బట్టి అడ్వాన్స్ లు ఇవ్వడం అన్నది కామన్. విడుదల ముందు సినేరియా ప్రకారం క, అమరన్ సినిమాలకు అంత క్రేజ్‌ లేదు. లక్కీ భాస్కర్ కు మాత్రమే క్రేజ్‌ వుంది. అందుకని 40 లక్షలు అడ్వాన్స్ ఇస్తానని శిరీష్ కబురు చేసారు. చాలదని కనీసం 80 లక్షలు ఇవ్వాలని కోరారు వీర్రాజు. అంత ఇవ్వలేనని అనడంతో, సినిమాలు ఇవ్వలేదు.

దీంతో దీపావళి సీజ‌న్ లో శిరీష్ తన చాలా థియేటర్లు మూత పెట్టాల్సి వచ్చింది. సరే, సీజ‌న్ అయిపోయాక ఈ విషయం ఛాంబర్ కు చేరింది. ఇరు వర్గాలను ఛాంబర్ అధ్యక్షుడు భరత్ పిలిపించి కూర్చో పెట్టారు. అక్కడ ఇరు వర్గాలు కాస్త గట్టిగానే అరుచుకున్నట్లు తెలుస్తోంది. తన థియేటర్లు తన ఇష్టం, నష్టం తనకే కానీ వీర్రాజుకు కాదు కదా అన్నది శిరీష్ వాదన. ట్రేడ్ మోనోపలీ చేయడం అన్నది నిబంధనలకు విరుద్దం అని, దానిపై చర్యలు తీసుకోవాలన్నది శిరీష్ వాదన.

ఇదిలా వుంటే అసలు వీర్రాజు కోటి పది లక్షలు లేదా 80 లక్షలు అడ్వాన్స్ అడగడం వెనుక వేరే రీజ‌న్ కూడా వుందని తెలుస్తోంది. శిరీష్ సంస్థ ఇప్పటికే వీర్రాజు కంపెనీకి 50 లక్షలు బకాయి వున్నట్లు బోగట్టా.

ఈ మొత్తం వ్యవహారం మీద పూర్వీ పిక్చర్స్ వీర్రాజుతో మాట్లాడగా.. థియేటర్లు మోనోపలీ చేసి, లోకల్ డిస్ట్రిబ్యూటర్లను తొక్కేయాలని దిల్ రాజు/శిరీష్ చూస్తున్నారని, ఎందుకు ఊరుకుంటామని అన్నారు. 80 లక్షల అడ్వాన్స్ కు నలభై లక్షలు ఇస్తామనడం కేవలం థియేటర్లు ఇవ్వడం ఇష్టం లేకనే తప్ప వేరు కాదన్నారు. ఈ గుత్తాధిపత్యాన్ని ఇకపై సహించమని, లోకల్ ప్లేయర్ లు అంటే అలుసు అంటే సహించమని అన్నారు.

ఇదే విషయమై శిరీష్ ను ప్రశ్నించగా, సినిమాల వాల్యూ ప్రకారం అడ్వాన్స్ లు ఇస్తాం కానీ ఎంత అడిగితే అంతా ఇవ్వలేం కదా, గతంలో అడ్వాన్స్ లు పూర్వీ పిక్చర్స్ కు ఇవ్వలేదా? దేవర సినిమాకు ఇవ్వలేదా? ఇప్పుడు మాత్రమే ఎందుకు పట్టుపడుతున్నారు. మూడు సినిమాలు తమ దగ్గరే వున్నాయనే కదా అని ప్రశ్నించారు. తాము ఎవరికీ బాకీ లేమని జిఎస్టీ సెటిల్ మెంట్ లు చేస్తే కదా పేమెంట్ చేసేది అని అడిగారు.

దీపావళి సీజన్ లో సినిమా లేక నష్టపోయింది తాము అని, తామే గొడవ చేయాలి, ఛాంబర్ కు ఎక్కాలి, అంతే అవతలి వాళ్లు కాదన్నారు. సరైన సినిమాలు లేక థియేటర్లు రన్ కావడం లేదని, అలాంటపుడు కోట్లకు కోట్లు అడ్వాన్స్ ఎక్కడ నుంచి తెస్తామన్నారు.

మొత్తానికి దీపావళి సినిమాల వ్యవహారం సంక్రాంతికి ఎలా మారుతుందో చూడాలి. సంక్రాంతికి గేమ్ ఛేంజ‌ర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు శిరీష్ కంపెనీ విడుదల చేస్తోంది. అందువల్ల వాళ్ల థియేటర్లు అన్నీ అవే వుంటాయి. వేరే థియేటర్లకు కూడా అగ్రిమెంట్ చేయాలని చూస్తాయి. బాలయ్య సినిమా పూర్వీ వీర్రాజు దగ్గర వుంటుంది. బాలకృష్ణ, ప్రభుత్వం అధికారంలో వుంది కనుక థియేటర్లకు సమస్య రాకపోవచ్చు.

4 Replies to “ఉత్తరాంధ్ర- శిరీష్- పూర్వీ వీర్రాజు.. ఢీ.. ఢీ”

Comments are closed.