సినిమా ఎలా వుంటుందో తరువాత సంగతి. కానీ ముందు సినిమాకు చేసే హడావుడి మాత్రం ఓ రేంజ్ లో వుంటుంది. సినిమా కంటెంట్ ఇష్టపడే వారు, ద్వేషించేవారు కూడా దాని కోసం ఎదురు చూసేలా వుంటుంది.
ఇదంతా చెప్పుకునేది ఆర్జీవీ గురించే. సినిమాలో విషయం కన్నా సినిమా మీద విషయం ఎక్కువ వుంటుంది. అలా ఇప్పుడు ఆర్జీవీ టేకప్ చేసిన సినిమా 'కమ్మ రాజ్యంలో కడపరెడ్లు'. ఈ సినిమా ట్రయిలర్ ను దీపావళి బాంబులా పేల్చారు ఆర్జీవీ.
''..వైఎస్ జగన్ సిఎమ్ కావడంతో రాష్ట్రంలో హింసా కాండ పెరిగిపోతుందని, కడప రెడ్లు చెలరేగిపోతారనే తప్పుడు ప్రచారానికి తెర తీస్తారు, ఆ విధంగా ముందుకు వెళ్తారు చంద్రబాబు…'' అన్నది కాన్సెప్ట్ గా కనిపిస్తోంది విడుదలయిన ట్రయిలర్ చూస్తుంటే.
ట్రయిలర్ ఆద్యంతం సీరియస్ గా సాగింది. కత్తి మహేష్ నుంచి ఆలీ మీదుగా బ్రహ్మానందం వరకు చాలా మంది నటులు కనిపించారు. జగన్, చంద్రబాబు క్యారెక్టర్లకు సరైన నటుల్ని తీసుకున్నారు. పవన్ కళ్యాణ్, లోకేష్ లను కూడా చూపించేసారు.
ట్రయిలర్ చూస్తుంటే సినిమా మొత్తం యాక్షన్ సీన్లతో నింపేసినట్లు కనిపిస్తోంది. సినిమా ఎలా వుంటుంది అన్నది అనవసరం. ఎందుకంటే ఆర్జీవీ వ్యవహారాలు ఇప్పటికి ఒకటికి పదిసార్లు జనాలకు తెలిసిపోయినవే.
అందువల్ల ట్రయిలర్ వరకు చూస్తే మాత్రం, ఆర్జీవీ తక్కువోడు కాడు, ఆర్నెల్ల పాటు దేశం అనుకూల పత్రికలు వండివార్చిన అవాస్తవ కథనాలు అన్నింటిని ఒక్క ట్రయిలర్ తో పక్కకు తుడిచేయగలడు అనిపించేసాడు.