రమ్య రఘుపతి ఎవరో నాకు తెలియదు

నరేష్ నిజజీవితంలో జరిగిన ఘటనలతో తెరకెక్కింది 'మళ్లీ పెళ్లి' సినిమా. రియల్ లైఫ్ లో నరేష్-పవిత్ర మధ్య ఉన్న బంధానికి తెరరూపమే ఈ సినిమా. ఇందులో నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి పాత్ర…

నరేష్ నిజజీవితంలో జరిగిన ఘటనలతో తెరకెక్కింది 'మళ్లీ పెళ్లి' సినిమా. రియల్ లైఫ్ లో నరేష్-పవిత్ర మధ్య ఉన్న బంధానికి తెరరూపమే ఈ సినిమా. ఇందులో నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి పాత్ర కూడా ఉంది. ఆ పాత్రను వనిత విజయ్ కుమార్ పోషించింది.

మరి ఈ రియల్ లైఫ్ పాత్ర కోసం వనిత విజయ్ కుమార్ ఏం చేసింది? ప్రత్యేకంగా ఏమైనా హోం వర్క్ చేసిందా? రమ్య రఘుపతి గురించి ఆమెకు తెలుసా? వీటిపై సూటిగా స్పందించింది వనిత విజయ్ కుమార్. తనకు రమ్య రఘుపతి ఎవరో తెలియదంటోంది. తను కేవలం సౌమ్య సేతుపతి పాత్రను మాత్రమే పోషించానంటోంది.

“రమ్య రఘుపతి ఎవరో నాకు నిజంగా తెలీదు. అందరూ ఆమె గురించి ఏవేవో చెబుతున్నారు. అంత వరకు మాత్రమే నాకు తెలుసు. మంచి స్క్రిప్ట్ ఉందని డైరక్టర్ రాజుగారు చెప్పారు. అందులో ఓ పవర్ ఫుల్ క్యారెక్టర్ ఉందని కూడా చెప్పారు. ఆయనపై నమ్మకంతో సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. ప్రతి సీన్, పొద్దున్నే ఇంగ్లిష్ లో నాకు వస్తుంది, నేను తెలుగు చదవలేను. అది ప్రిపేర్ అయి చేశాను. అంతకుమించి నాకు ఎలాంటి రిఫరెన్సులు ఇవ్వలేదు.”

ఈ సినిమా స్టోరీ మొత్తం ఎమ్మెస్ రాజు తనకు వివరించారన్న వనిత.. రమ్య రఘుపతి గురించి మాత్రం చెప్పలేదని అంటోంది. తనకు ఎలాంటి రిఫరెన్సులు ఇవ్వలేదని, ఏం చేయకూడదో చెప్పారని అన్నారు.

“రమ్య రఘుపతి గురించి నాకు ఏం చెప్పలేదు. మేకప్ వద్దని చెప్పారు, ఎక్కువగా ఏడవద్దని చెప్పారు, ఓవరాక్షన్ చేయొద్దని చెప్పారు, నేచురల్ గా ఉండాలన్నారు. ఇలాంటి సలహాలు ఇచ్చారు తప్ప రమ్య రఘుపతి గురించి నాకేం చెప్పలేదు. ఎమ్మెస్ రాజు ఏం చెప్పారో, నేను అలా చేశానంతే.”

మళ్లీ పెళ్లి సినిమాలో వనిత పోషించిన సౌమ్య సేతుపతి పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాలో ఆమె కొన్నిచోట్ల నెగెటివ్ షేడ్స్ లో కూడా కనిపించింది. అయితే అవి నెగెటివ్ షేడ్స్ కావంటోంది వనిత. అవన్నీ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్సులు అని చెబుతోంది.