డబ్బు విషయంలో అందరికీ సొంత అభిప్రాయాలుంటాయి, సొంత అనుభవాలుంటాయి. హీరో వరుణ్ తేజ్ కు కూడా అలాంటి అనుభవాలున్నాయి. పుట్టింది గోల్డెన్ స్పూన్ తోనే అయినప్పటికీ, తనకు చిన్నప్పుడు లగ్జరీ లేదని చెప్పుకొచ్చాడు వరుణ్. డబ్బు విషయంలో తన ఫిలాసఫీ ఎలా ఉంటుందో వివరించాడు.
“డబ్బు విషయంలో నాకు చాలా అనుభవాలున్నాయి. కొన్ని వృత్తుల్లో డబ్బు ఈజీగా వస్తుంది అనిపిస్తుంది. కానీ ఈజీగా వచ్చింది అంతే ఈజీగా పోతుంది. ఈ విషయం ప్రతి ఒక్కరికీ ఏదో ఒక టైమ్ లో బోధపడుతుంది. కష్టపడితే వచ్చిన డబ్బు తక్కువగానే ఉన్నప్పటికీ చాన్నాళ్లు మనతోనే ఉంటుంది. అందుకే డబ్బును ఎప్పుడూ తేలిగ్గా తీసుకోకూడదు. ఇప్పుడుంది కదా అని ఠపీమని ఖర్చుపెట్టకూడదు. డబ్బుంది కదా అని ఎగరకూడదు. జాగ్రత్తగా దాచుకోవాలి, కొంచెం ఖర్చుపెట్టుకోవాలి. నా సొంత అనుభవాల నుంచి నేను నేర్చుకున్న డబ్బు జ్ఞానం ఇది.”
చిన్నప్పట్నుంచి తండ్రి నాగబాబు పెంచిన విధానం వల్లనే డబ్బు విషయంలో తన ఆలోచన ధోరణి మారిందని చెప్పుకొచ్చాడు వరుణ్ తేజ్. ఈ సందర్భంగా తన చిన్ననాటి జ్ఞాపకాన్ని గుర్తుచేసుకున్నాడు.
“స్కూల్ డేస్ లో మా నాన్న 50 రూపాయలు ఇచ్చేవారు. పదో తరగతి చదువుకునే రోజుల్లో నాకు ఇచ్చిన డబ్బు అది. దాంతో సినిమాకి వెళ్లాలి. ఆ డబ్బుతోనే బస్సు ఎక్కాలి. ఆ డబ్బుతోనే టికెట్ కొనుక్కోవాలి. ఆ డబ్బుతోనే తినాలి. ఇలా ఎడ్జెస్ట్ అవ్వడం నేర్చుకున్నాను. చాలా సార్లు నాకు నా ఫ్రెండ్స్ డబ్బులు పెట్టేవారు. నేను కొన్నిసార్లు వాళ్లకు డబ్బులు పెట్టేవాడ్ని. అలా సినిమాలు చూసేవాళ్లం.”
ఎఫ్3 రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు వరుణ్ తేజ్. ఈ సినిమాలో పనీపాట లేని నత్తి ఉన్న కుర్రాడి పాత్రలో వరుణ్ తేజ్ కనిపించబోతున్నాడు. అనీల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకుడు.