సినీ నటుడు నందమూరి బాలకృష్ణ భార్య వసుంధర సంతకాన్ని ఫోర్జరీ చేశాడట ఒక ఘనుడు. మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ కోసం ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేసిన వైనం బ్యాంకు అధికారులు గుర్తించారు. బాలకృష్ణ కుటుంబానికి బ్యాంకింగ్ వ్యవహారాల్లో అకౌంటెంట్ గా ఉండే శివ అనే వ్యక్తి ఈ ఫోర్జరీ చేసినట్టుగా బయట పడిందట.
అసలు సంగతేమిటంటే.. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని హెచ్డీఎఫ్సీ బ్రాంచ్ లో నందమూరి వసుంధరకు అకౌంట్ ఉందట. అక్కడ మొబైల్ బ్యాంకింగ్- అప్లికేషన్ కోసం ఆమె పేరిట ఒక ధరఖాస్తు వచ్చినట్టుగా సమాచారం. ఇప్పుడంతా బ్యాంకింగ్ అప్లికేషన్లను విరివిగా వాడుతూ ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె నుంచి కూడా దరఖాస్తు వచ్చిందని బ్యాంక్ అధికారులు ఆ పని పూర్తి చేసి ఉంటే కథ ఎలా ఉండేదే మరి. అయితే క్రాస్ చెక్ కోసం వారు వసుంధర సహాయకుడికి ఫోన్ చేశారట. దీంతో అసలు కథ బయటపడింది.
బ్యాంకింగ్ స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ కోసం ఆమె నుంచి ఎలాంటి దరఖాస్తూ వెళ్లలేదని అధికారులు గుర్తించారు. ఆమె సంతకంతో కూడుకున్న అప్లికేషన్ ఫేక్ అని పట్టేశారు. ఆమె సంతకాన్ని ఎవరో ఫోర్జరీ చేశారనే విషయం బయటపడింది. తాము ఎలాంటి దరఖాస్తూ చేయలేదని వసుంధర స్పష్టం చేయడంతో, ఆ దరఖాస్తు ఇచ్చింది ఎవరనే అంశం గురించి వాకబు చేయగా అకౌంటెంట్ శివ పేరు బయటపడిందని తెలుస్తోంది. వసుంధర సంతకాన్ని తనే ఫోర్జరీ చేసి అప్లికేషన్ పెట్టినట్టుగా అతడు ఒప్పుకున్నాడట.