రానానాయుడు వెబ్ సిరీస్ రిలీజైన తర్వాత వెంకటేష్ పై విమర్శల వాన కురిసింది. ఆ తర్వాత సీజన్-2 వస్తుందనే మేటర్ బయటకొచ్చిన తర్వాత వెంకీపై మరోసారి ట్రోలింగ్ నడిచింది. తాజాగా సల్మాన్ సినిమాలో వెంకటేష్ పోషించిన రోల్ చూసి, ఏకంగా దగ్గుబాటి అభిమానులే ముఖం చాటేశారు.
ఇలా వరుస వివాదాలు, ట్రోలింగ్స్ తో ఈమధ్య టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు వెంకటేశ్. అయితే ఇంత ట్రోలింగ్, ఇన్ని వివాదాల మధ్య కూడా ఆయన అనుకున్నది సాధించారు. అదేంటంటే, పాన్ ఇండియా అప్పీల్.
అవును.. వెంకీకి ఇప్పుడు పాన్ ఇండియా అప్పీల్ వచ్చింది. సల్మాన్ సినిమాతో పాటు, రానా నాయుడు సిరీస్ తో అతడికి దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. సల్మాన్ సినిమా ఫ్లాప్ అయింది, రానానాయుడుపై విమర్శలు పడ్డాయి. అయినప్పటికీ, జాతీయ స్థాయిలో అందరూ గుర్తుపట్టే స్థాయికి వెంకీ ఎదిగాడు. అతడు కోరుకున్నది కూడా అదే. ప్రస్తుతం 2 పెద్ద మల్టీ నేషనల్ కంపెనీలు వెంకీని బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకోవడానికి రెడీ అవుతున్నాయి.
ఓవైపు ఇలా బ్రాండ్ వాల్యూను పెంచుకోవడంతో పాటు, మరోవైపు తన సినిమాలకు పాన్ ఇండియా అప్పీల్ వచ్చేలా చేసుకోగలిగాడు వెంకీ. ఇన్నాళ్లూ ఈ సీనియర్ హీరో నటించిన సినిమాలు తెలుగులో మాత్రమే రిలీజ్ అయ్యాయి. ఇంకాస్త గట్టి రిలీజ్ అనుకుంటే తమిళ్ లో విడుదల. అంతవరకు మాత్రమే. కానీ వెంకటేష్ తాజా చిత్రం సైంధవ్ ను పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయబోతున్నారు. దీనికి కారణం అతడికి వచ్చిన తాజా పాన్ ఇండియా అప్పీల్.
ఇప్పటివరకు టాలీవుడ్ హీరోలంతా తమ క్రేజ్, సినిమాల హిట్స్ తో మాత్రమే పాన్ ఇండియా అప్పీల్ తెచ్చుకున్నారు. వెంకటేష్ ఒక్కడే ట్రోలింగ్ తో, వివాదాలతో పాన్ ఇండియా నటుడిగా మారాడు. మార్గం ఏదైనా తను అనుకున్న గమ్యాన్ని చేరుకున్నాడు.