తమిళ స్టార్ హీరో విజయ్ కోవిడ్ -19 రిలీఫ్ ప్యాకేజ్ లకు తన వంతు విరాళం ప్రకటించాడు. మొత్తం కోటీ ముప్పై లక్షల రూపాయల మొత్తాన్ని విజయ్ విరాళంగా అనౌన్స్ చేశాడు.
అందులో 25 లక్షల రూపాయలను ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కు ఇస్తున్నాడట విజయ్. ఇక తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్ కు 50 లక్షల రూపాయల మొత్తాన్ని విజయ్ విరాళంగా ప్రకటించాడు. మరో 25 లక్షల రూపాయల మొత్తాన్ని ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ కు విరాళమిచ్చాడు. 10 లక్షల రూపాయల మొత్తాన్ని కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు తలా ఐదు లక్షల రూపాయల చొప్పున, మరో ఐదు లక్షల రూపాయల మొత్తాన్ని పాండిచ్చేరి సీఎం రిలీఫ్ ఫండ్ కు జమ చేస్తున్నట్టుగా విజయ్ నుంచి ప్రకటన వచ్చింది.
ఇలా 1.30 కోట్ల రూపాయల మొత్తాన్ని సౌతిండియాలోని అన్ని రాష్ట్రాలకూ, పనిలో పనిగా పీఎం కేర్ కు కూడా జమ చేశాడు ఈ హీరో. తన సినిమాలకు ఏ ప్రాంతం నుంచి ఏ స్థాయి కలెక్షన్లు వస్తాయనే దాన్ని బట్టి ఈ హీరో విరాళాన్ని సర్ధినట్టుగా ఉన్నాడు. కోటీ ముప్పై లక్షల రూపాయలు అంటే మంచి స్థాయిలోని విరాళమే. అయితే విజయ్ సినిమాల కలెక్షన్ల నంబర్ తో పోలిస్తే మాత్రం ఇది చాలా చాలా తక్కువే!
విజయ్ హీరోగా నటించే ఫ్లాప్ సినిమాలు కూడా తెలుగు నాటే ఐదారు కోట్ల రూపాయల వసూళ్లను సాధించినట్టుగా వార్తలు వస్తూ ఉంటాయి. ఇతడి సినిమాలు ఏవీ వంద కోట్ల రూపాయల స్థాయికి తగ్గవసలు. ప్రస్తుతం సౌత్ లో విజయ్ కెరీర్ కొన్నేళ్లుగా పీక్స్ లో ఉంది. కాబట్టి ఇంకాస్త వితరణతో వ్యవహరించే శక్తి ఉన్నాడో అనుకోవాలి!