బాలీవుడ్ లో సత్తా చాటుదామని ప్రయత్నించిన ప్రతిసారి చిరంజీవికి ఎదురుదెబ్బ తగులుతూనే ఉంది. చివరికి సల్మాన్ ఖాన్ ను వెంటబెట్టుకొని దండయాత్ర చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఓవైపు ఇలాంటి ఎన్నో అనుభవాలు ఉన్నప్పటికీ, ఇప్పుడు మరోసారి నార్త్ పై ఫోకస్ పెట్టారు చిరు.
చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం వాల్తేరు వీరయ్య. ఈ సినిమాను హిందీలో కూడా విడుదల చేయబోతున్నారు. చిరంజీవి, రవితేజ కలిసి నిల్చున్న పోస్టర్లు రెడీ చేస్తున్నారు. ఇవాళ్టి నుంచి హిందీ డబ్బింగ్ కూడా షురూ చేశారు. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటే, తెలుగు వెర్షన్ తో పాటే హిందీ డబ్బింగ్ వెర్షన్ ను కూడా విడుదల చేయబోతున్నారు.
నిజానికి చిరంజీవి ట్రాక్ రికార్డ్ ను దృష్టిలో పెట్టుకొని చూస్తే, ఉత్తరాదిన ఆయన సినిమాను ఇంత హడావుడిగా రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు. గాడ్ ఫాదర్, సైరా లాంటి సినిమాలు హిందీలో ఆడలేదు. ఇటు రవితేజకు కూడా హిందీ థియేట్రికల్ మార్కెట్లో చెప్పుకోదగ్గ ట్రాక్ రికార్డ్ లేదు.
ఆ టైమ్ కు ఉత్తరాదిన థియేటర్లలో రష్ తక్కువగా ఉంది. థియేటర్లు దొరుకుతున్నాయి. బహుశా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేసినట్టున్నారు. మరి చిరంజీవి, రవితేజ కలిసి హిందీ బాక్సాఫీస్ పై ఎలాంటి ప్రభావం చూపిస్తారో చూడాలి.