తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించకపోయినా చెప్పుకుంటున్నారు. తెలంగాణాలో తెలుగుదేశం ఉనికి పోరాటం చేస్తోంది. ఆశలేవో ఏపీ మీదనే ఉన్నాయి. ఆ పార్టీకి జాతీయ అధ్యక్షుడుగా చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ ఉన్నారు.
ఒక పార్టీలో కీలక పదవులలో తండ్రీ కొడుకులు ఇద్దరూ ఉండడం చాలా అరుదు. తెలుగుదేశం అందుకే కుటుంబ పార్టీ అని బీజేపీ విమర్శిస్తూ వస్తోంది. ఇపుడు సొంత పార్టీ వారూ అదే మాట అనుకోవాల్సి వస్తోందా అన్న సందేహాలు వస్తున్నాయి. లోకేష్ పాదయాత్ర మొదలెట్టి జనాల్లో ఉన్నారు.
చంద్రబాబు తూర్పు గోదావరి తో మొదలెట్టి మళ్లీ జిల్లా టూర్లకు శ్రీకారం చుట్టారు. ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ కింజరాపు అచ్చెన్నాయుడు మాత్రం ఏమీ కాకుండా మిగిలిపోయారు అని అంటున్నారు. పద్ధతిగా చూస్తే ఏపీకి సంబంధించి ఏమి చేయాలన్నా ఆయనే చేయాలి.
తనది జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్న చంద్రబాబు కాంగ్రెస్ తరహాలోనో బీజేపీ తరహాలోనో అసలైన అధికారాలు అచ్చెన్నాయుడు అప్పగిస్తున్నారా అన్నదే ఇక్కడ చూడాలి. తెలంగాణాలో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నారు. ఏపీలో అలా జనంలోకి వెళ్లాలంటే అచ్చెన్నాయుడే వెళ్లాలి. కానీ ఆయన శ్రీకాకుళం జిల్లాకే పరిమితం అయిపోయారు.
దాంతో అచ్చెన్నాయుడు మీద ప్రత్యర్ధి పార్టీలు సెటైర్లు వేస్తున్నాయి. లోకేష్ పాదయాత్ర చూసి అచ్చెన్న సహా సీనియర్లు తలలు పట్టుకుంటున్నారు అని మంత్రి ధర్మాన ప్రసాదరావు అంటున్నారు. యాత్రలైన మరోటి అయినా లోకేష్ కంటే అచ్చెన్న చేస్తే మరో నలుగురు ఎక్కువ వస్తారు అని సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ అంటున్నారు.
అచ్చెన్నకు అలా మూలన ఉంచారా అన్నదే ఇపుడు పాయింట్. అచ్చెన్నాయుడు బీసీ నేత అని పార్టీలో పదవి ఇచ్చామని చెబుతున్న తెలుగుదేశం పెద్దలు ఆయన చేత బీసీ యాత్ర చేయిస్తామని చెప్పినట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. అచ్చెన్నాయుడుకు కూడా బస్సు యాత్రలో మరోటో బాధ్యతలు అప్పగిస్తే తెలుగుదేశం త్రిమూర్తులు అలా ప్రజలతోనే ఉంటారని అంటున్నారు. లేకపోతే పార్టీ అంటే బొత్తిగా తండ్రీ కొడుకులదే అనుకునే ప్రమాదం ఉంది. ప్రత్యర్ధులు కూడా విమర్శలు మామూలుగా చేయవనే అంటున్నారు.