మెగా బ్రదర్ నాగబాబు తనయ నిహారిక, ఆమె భర్త జొన్నలగడ్డ చైతన్య ప్రేమికుల రోజు మీడియాకు విశిష్ట అతిథులయ్యారు. అయితే వాళ్లిద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకోలేదు. కానీ వాళ్లిద్దరి అనుబంధం అంతకు మించిందే. అందువల్లే ప్రేమపై వాళ్ల అభిప్రాయాలు ఎంతో ప్రత్యేకం.
పెళ్లయ్యాక వచ్చిన మొదటి ప్రేమికుల రోజును ఎలా సెలబ్రేట్ చేస్తున్నారనే ప్రశ్నకు నిహారిక స్పందిస్తూ …ప్రేమను సెలబ్రేట్ చేయడానికి ఒకే ఒక రోజు కేటాయించడం తనకెందుకో నచ్చదన్నారు. ప్రతి ఒక్కరికీ ఎదుటి వ్యక్తి మీద ప్రేమ ఉంటుందన్నారు. అది ఎవరైనా కావచ్చన్నారు. మనసులో నిండిన ప్రేమను వ్యక్తపరచడానికి ఒక రోజు సరిపోతుందా? అని ప్రశ్నించారు.
మనకిష్టమైన వ్యక్తిని, చేయి పట్టుకుని నడిపించే వ్యక్తిని ప్రతి రోజూ ప్రేమించాలని, అతనికి ప్రేమను పంచడంతో పాటు తన నుంచి ప్రేమను పొందాలని నిహారిక చెప్పుకొచ్చారు. ఇది నిరంతరం కొనసాగాలన్నారు. అంతే తప్ప ఒక రోజు పండగ చేసుకోవడం తనకు ఎంత మాత్రం నచ్చదని నిహారిక స్పష్టంగా చెప్పారు. తన భర్త చైతూ ఆలోచన కూడా ఇలాగే ఉంటుందన్నారు. అందుకే వాలెంటైన్స్ డే కోసం కొత్తగా ఏమీ ప్లాన్ చేసుకోలేదన్నారు.
చైతన్యతో తనకు ముందు నుంచి పరిచయం లేదన్నారు. పెద్దవాళ్లు మాట్లాడుకున్నాకే నేను ఆయన్ని కలిసినట్టు తెలిపారు. తమ మధ్య కేవలం ఏడాది పరిచయం మాత్రమే ఉందన్నారు. చైతన్యతో పెళ్లి ప్రతిపాదనపై మీ పెదనాన్న చిరంజీవి ఏమన్నారనే ప్రశ్నకు స్పందిస్తూ … మేం చెప్పామని కాదు, నిజాయతీగా మీరు పరస్పరం ఇష్టపడి ఉంటే పెళ్లి చేసుకోవాలని పెదనాన్న చెప్పారన్నారు.
తాను, చైతూ భార్య, భర్త అని కాకుండా స్నేహితుల్లా ఉంటామన్నారు. చైతూ కనబరిచే ప్రేమ వల్ల తనకు బాగా తెలిసిన వ్యక్తిని, ఓ స్నేహితుణ్ణి పెళ్లి చేసుకున్న భావన కలుగుతోందని చెప్పుకొచ్చారు. భర్తగా, ప్రేమికుడిగా, స్నేహితుడిగా చైతన్యకు పదికి పది మార్కులు వేస్తానన్నారు.
నిజ జీవితంలో తనకిష్టమైన హీరో తన తండ్రి నాగాబాబు అని తెలిపారు. ఆన్ స్క్రీన్‌లో మాత్రం పెదనాన్న చిరంజీవి తనకు ఇష్టమైన హీరోగా నిహారిక చెప్పారు.