26/11 ఘటనతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్. అలాంటి వ్యక్తి జీవితాన్ని తెరపైకి తీసుకొచ్చేందుకు చాలామంది మేకర్స్ ప్రయత్నించి ఉంటారు. మరీ ముఖ్యంగా ఇలాంటి బయోపిక్స్ ను బాలీవుడ్ జనాలు అస్సలు వదలుకోరు. మరి వీళ్లందర్నీ కాదని సందీప్ బయోపిక్ తీసే ఛాన్స్ అడివి శేష్ కు అలా వరించింది. ఈ ప్రశ్నకు చక్కటి సమాధానం ఇచ్చాడు శేష్.
“బాలీవుడ్‌లో తీయడానికి ప్రయత్నించారు. కానీ, సందీప్ తల్లిదండ్రులకు వారు నచ్చలేదు. ఆ తర్వాత మలయాళం మేకర్స్ కొందరు వచ్చారు. కానీ మళ్లీ ఒప్పుకోలేదు. ఎందుకంటే.. ఆ హీరోలు తమ కొడుకులా లేరని సున్నితంగా సందీప్ తల్లి తిరస్కరించారు. నన్ను చూడగానే చాలా హ్యాపీగా ఫీలయ్యారు. నాలో సందీప్ ను చూసుకున్నారు. నేను ఆమెను అమ్మా అని పిలుస్తుంటాను.”
ఇలా సందీప్ బయోపిక్ తీసే అవకాశం తమకు దక్కినట్టు వెల్లడించాడు శేష్. మేజర్ సినిమాలో సందీప్ జీవితం మొత్తం కనిపించదంటున్నాడు శేష్. కొన్ని ఆసక్తికరమైన అంశాల్ని మాత్రమే తీసుకున్నామని చెబుతున్నాడు.
“అన్నీ తీయాలంటే సమయం సరిపోదు. స్కూల్ డేస్, కశ్మీర్, తాజ్ సంఘటనతో పాటు చిన్నతనంలో అమ్మతో కూర్చుని పాయసం తినడం, స్కూల్ ఎగ్గొట్టి సినిమాలు చూడడం, ఐస్ క్రీమ్‌లు తినడం, నాన్నగారితో టైప్ రైటింగ్ గురించి మాట్లాడడం. ఇవన్నీ ఆయన లైఫ్‌లో తీసుకున్న పెద్ద నిర్ణయాలే. గొప్ప మనుషులు గొప్ప మాటలతో పుట్టరు. వారు చేసే పని వల్ల గొప్ప మనిషి అవుతారు.”
3వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది మేజర్ సినిమా. ఈ సినిమాను అందరికీ చేరువ చేసే ఉద్దేశంతో తెలుగు రాష్ట్రాల్లో భారీగా టికెట్ రేట్లు తగ్గించారు.