మొన్నటివరకు స్త్రీ జాతి ఆణిముత్యం. మహిళాలోక శిఖామణి, కొంతమంది ఫెమినిస్టుల పాలిట సెలబ్రిటీ. మీడియాలోనే ఉన్న కొంతమంది ఫెమినిస్టులు రేణును ఆకాశానికెత్తేశారు. పిల్లలను చూసుకుంటూ చక్కగా ఇంటిపట్టున ఉండే ఆమెను సామాజిక కార్యకర్తగా, సంఘసంస్కర్తగా మార్చే ప్రయత్నం చేశారు. ఇవన్నీ పక్కనపెడితే.. పవన్ కల్యాణ్ నుంచి విడిపోయిన తర్వాత ఆమెపై ఎనలేని సింపతీ చూపించారు. మరి ఇప్పుడేం చేస్తారు?
రేణుదేశాయ్ మారిపోయింది. ఆమె తనకుతానుగా మారిందా? ఎవరైనా బలవంతంగా మార్చారా? లేక విదేశాలకు వెళ్లొచ్చిన తర్వాత జ్ఞానోదయమైందా? ఈ చర్చ ఇక్కడ అనవసరం. ఆమె మారిపోయిందంతే. ఏకంగా 3 నిమిషాల వీడియో పెట్టి మరీ పవన్ కు వత్తాసు పలికేసింది. పవన్ తనను వదిలేశాడని చెబుతూనే, తను పవన్ కు మద్దతిస్తానంటోంది. ఇంతకీ ఏం జరిగింది?
ఓ వ్యక్తి ఉన్నఫలంగా ఎందుకు మారతాడు? అతడిలో అకస్మాత్తుగా పరివర్తన వస్తుందా? కచ్చితంగా రాదు. ఏ మానసిక నిపుణుడ్ని అడిగినా ఈ మాట చెబుతాడు. మరి రేణుదేశాయ్ అకస్మాత్తుగా మారడం వెనక కారణం ఏంటి? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్.
మెగా దౌత్యం ఫలించిందా..?
ఇన్నాళ్లూ పవన్ పై విమర్శలు చేస్తూ వచ్చింది, ఇకపై కూడా అదే పంథా కొనసాగించొచ్చు. మరీ ముఖ్యంగా ఎన్నికల వేళ పవన్ పై రేణుదేశాయ్ ఎన్ని విమర్శలు చేస్తే అంత మైలేజీ రావడం ఖాయం. పూనమ్ కౌర్ పరోక్షంగా చేస్తున్నది కూడా ఇదే. కాకపోతే రేణు అలా చేయలేదు. టీవీ ఛానెల్ మార్చినట్టు ఠపీమని మారిపోయింది.
ఈమె మార్పు వెనక మెగాదౌత్యం ఉండొచ్చనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ, చాన్నాళ్లుగా ఇబ్బంది పెడుతున్న కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి పవన్ బయటపడే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. 3 పెళ్లిళ్లను ఆయన ఎలాగూ మార్చలేదు. కనీసం రేణుదేశాయ్ నైనా తమ దారిలోకి తెచ్చుకుంటే, ఉన్నంతలో బెటర్ అనే భావనకు వచ్చినట్టు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే మెగా కాంపౌండ్ లో కీలకమైన సభ్యులు కొంతమంది రేణుదేశాయ్ మనసు మారేలా చేశారనేది ఓ వాదన.
కొడుకు-కూతురు భవిష్యత్తు..
ఎక్కువమంది వాదన మాత్రం మరోలా ఉంది. పవన్ కల్యాణ్ ద్వారా తనకు జన్మించిన ఇద్దరు పిల్లల భవిష్యత్తును రేణు దేశాయే చూసుకుంటోంది. రేణుతో పాటు పిల్లలకు పవన్ ఆర్థికంగా అండగా నిలబడొచ్చు కానీ ఓ తండ్రిగా మాత్రం అందుబాటులో ఉండడం లేదు. ఈ నేపథ్యంలో పిల్లల బాగోగుల్ని రేణు చూసుకుంటోంది.
కొడుకు పెద్దోడయ్యాడు, చేతికి అందొచ్చాడు. అతడి లైఫ్ సెట్ చేయాలి. అకిరాను హీరోను చేస్తానని గతంలోనే రేణు ప్రకటించారు. మరి అలా చేయాలంటే, మెగా ఆశీస్సులు కావాలి. మరీ ముఖ్యంగా పవన్ కల్యాణ్ అభిమానుల అండ కావాలి. కాబట్టి కొడుకు ఫ్యూచర్ కోసం రేణు, ఇలా అకస్మాత్తుగా యూ-టర్న్ తీసుకుందని అంటున్నారు చాలామంది.
ప్యాకేజీ కింద సబ్-ప్యాకేజీ..
పవన్ కల్యాణ్ ను పాలిటిక్స్ లో 'ప్యాకేజీ' పేరిట విమర్శిస్తుంటారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు కొంతమంది రేణుదేశాయ్ కు 'సబ్-ప్యాకేజీ' అనే పేరు పెట్టారు. ఇలా ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా, రేణు దేశాయ్ మాత్రం అన్నీ క్లియర్ చేసేసింది. రాజకీయాల్లోకి తన పిల్లల్ని లాగొద్దంటూ వీడియో స్టార్ట్ చేసిన ఈమె, చివరికి వచ్చేసరికి, పవన్ కు అంతా మద్దతివ్వాలని, ఓ అవకాశం ఇవ్వాలని కోరింది. ఈ ఒక్క వీడియోతో ఆమె పవన్ కల్యాణ్ అభిమానులకు దగ్గరవ్వొచ్చేమో కానీ తన వ్యక్తిత్వాన్ని మాత్రం ఆమె కొంచెం తగ్గించుకుందనే చెప్పాలి.