చంద్రబాబు అరెస్ట్ అయ్యారు.. కేసు నడుస్తోంది. ప్రస్తుతం ఆయన సెంట్రల్ జైలులో రెస్ట్ తీసుకుంటున్నారు. చంద్రబాబు అరెస్ట్ పై ఆయన అభిమానులు, పార్టీ నేతలు, కుటుంబ సభ్యులు కొంతమంది స్పందిస్తున్నారు. మరి ఈ లిస్ట్ లో ఎన్టీఆర్ ఎందుకు లేడు? ఆయన ఎందుకు స్పందించడం లేదు? చంద్రబాబును జైళ్లో పెడితే ఎన్టీఆర్ స్పందించాల్సిన అవసరం లేదా?
ఇలా 2 రోజులుగా రచ్చ మామూలుగా జరగడం లేదు. చంద్రబాబు అరెస్ట్ తో సమానంగా ఎన్టీఆర్ ఎందుకు స్పందించడం లేదనే అంశం హాట్ టాపిక్ గా మారింది. ఈ మొత్తం చర్చకు ఎన్టీఆర్ అభిమానుల నుంచి వస్తున్న ఎదురుప్రశ్న ఒకే ఒక్కటి. అసలు ఎన్టీఆర్ ఎందుకు స్పందించాలి?
నిజమే.. ఎన్టీఆర్ ఎందుకు స్పందించాలి? చంద్రబాబు ఎప్పుడైనా ఎన్టీఆర్ కు విలువ ఇచ్చాడా? రాజకీయంగా ప్రాధాన్యత కల్పించాడా? ఇవన్నీ పక్కనపెడదాం. కనీసం ఓ హీరోగా, కుటుంబలో సభ్యుడిగా అతడికి గౌరవం ఇచ్చాడా? ఇటు చంద్రబాబైనా, అటు బాలకృష్ణ అయినా.. ఎప్పుడూ ఎన్టీఆర్ ను చిన్నచూపు చూడ్డంతోనే సరిపోయింది. అలాంటప్పుడు తారక్ ఎందుకు స్పందించాలి?
రాజకీయంగా ఎన్టీఆర్ ను వాడుకున్నన్ని రోజులు వాడుకున్నారు. ఎప్పుడైతే లోకేష్ సీన్ లోకి వచ్చారో, ఆ వెంటనే ఎన్టీఆర్ ను కట్ చేశారు. అటు చంద్రబాబు, ఇటు లోకేష్, ఎన్టీఆర్ పై చేసిన కామెంట్స్ ఇప్పటికీ అభిమానులకు గుర్తే. ఓ కార్యకర్తగా ఎన్టీఆర్ సేవల్ని వినియోగించుకుంటామంటూ చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు లోకేష్ చేసిన కామెంట్ ను ఫ్యాన్స్ మరిచిపోలేదు.
చివరికి ఏపీ అసెంబ్లీలో భువనేశ్వరి పేరు ప్రస్తావించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సందర్భంలో కూడా ఎన్టీఆర్ స్పందించినప్పుడు టీడీపీ నాయకులు, నందమూరి కుటుంబ సభ్యులు పెదవి విరిచారు. ఇక తాజాగా జరిగిన ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల సందర్భంలో కూడా ఎన్టీఆర్ కు మొండిచేయి చూపించారు. ఆమధ్య అక్క సుహాసిని ఇంట్లో జరిగిన పెళ్లికి ఎన్టీఆర్ వెళ్తే, అతడికి జరిగిన అవమానం కెమెరా సాక్షిగా బయటపడిన సంగతి మరిచిపోయారా?
ఓవైపు ఇంత చేసి, మరోవైపు చంద్రబాబు అరెస్ట్ పై స్పందించమంటే ఎలా? ఎన్టీఆర్ స్పందిస్తే చంద్రబాబును జైలు నుంచి విడుదల చేస్తారా? ఆ మాటకొస్తే, టీడీపీ నేతలే సగం మంది ఈ వ్యవహారానికి దూరంగా ఉన్నారు. అలాంటిది రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్న ఎన్టీఆర్ ఎందుకు స్పందించాలి? చివరికి రామ్ గోపాల్ వర్మ లాంటి దర్శకుడు కూడా ఎన్టీఆర్ ను ఈ వివాదం లోకి లాగే ప్రయత్నం చేయడం బాధాకరం.