అల్లరి నరేష్ కామెడీ చేయలేడా?

కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అల్లరి నరేష్. అతడికి గుర్తింపు తెచ్చిన సినిమాలే కామెడీ. అలాంటి హీరోను పట్టుకొని నువ్వు కామెడీ చేయలేవు అంటే ఎలా ఉంటుంది? అల్లరోడికి అలాంటి అనుభవమే జరిగింది. స్వయంగా…

కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అల్లరి నరేష్. అతడికి గుర్తింపు తెచ్చిన సినిమాలే కామెడీ. అలాంటి హీరోను పట్టుకొని నువ్వు కామెడీ చేయలేవు అంటే ఎలా ఉంటుంది? అల్లరోడికి అలాంటి అనుభవమే జరిగింది. స్వయంగా అతడి భార్య, అల్లరినరేష్ ను కామెడీ చేయలేవ్ అంటోంది.

“సీరియస్ సినిమాలు బాగానే చేస్తున్నావు కానీ, కామెడీ సినిమాలే ఎక్కువ చేయమని అంటుంది అమ్మ. కానీ నా భార్యకు మాత్రం నేను సీరియస్ సినిమాలు చేస్తేనే ఇష్టం. 

నేను, గమ్యం లాంటి సినిమాలు తనకు ఇష్టం. సీరియస్ పాత్రలు చేసినప్పుడు మాత్రమే మంచి నటుడిగా కనిపిస్తావు, కామెడీ అంత బాగా చేయలేవు అంటుంది. సీరియస్ పాత్రలు చేసేంత సామర్థ్యం నాకు ఉందని మా ఆవిడ నమ్మకం.”

బంగారు బుల్లోడు రిలీజ్ సందర్భంగా గ్రేట్ ఆంధ్రతో మాట్లాడిన అల్లరినరేష్.. కామెడీ, సీరియస్ పాత్రలపై స్పందించాడు. మరీ ముఖ్యంగా బంగారుబుల్లోడు లాంటి కామెడీ సినిమా తర్వాత.. నాంది లాంటి సీరియస్ సినిమా రావడంపై తన అభిప్రాయం చెప్పాడు.

“బంగారు బుల్లోడు సినిమా తర్వాత నాంది వస్తోంది. ఈ సినిమా ప్రభావం నాందిపై పడదు. మహర్షిలో నా పాత్ర పెద్దగా కామెడీ చేయదు. ఇప్పుడు బంగారు బుల్లోడు లాంటి కామెడీ సినిమా వస్తోంది. గతంలో కూడా శంభోశివశంభో, విశాఖ ఎక్స్ ప్రెస్, గమ్యం సినిమాల్లో నా పాత్రలు కాస్త సీరియస్ గానే ఉన్నాయి. 

ఆ తర్వాత కామెడీ సినిమాలు కూడా వచ్చాయి. నా అభిమానుల్లో 80శాతం మంది నా కామెడీ ఇష్టపడితే, 20 శాతం మంది నా పెర్ఫార్మెన్స్ ను ఇష్టపడతారు. కాబట్టి నేను రెండూ చేస్తాను.”

ఓ నటుడిగా అన్నీ చేయాలంటున్న అల్లరినరేష్.. కామెడీ మాత్రమే చేస్తాడనే బ్రాండ్ తనపై పడకుండా జాగ్రత్తపడతానంటున్నాడు. అదే సమయంలో… కామెడీ జానర్ ను విడిచిపెట్టే ప్రసక్తి లేదంటున్నాడు. చేసిన 3 సినిమాల్లో కచ్చితంగా 2 సినిమాలు కామెడీ జానర్ లోనే ఉంటాయని హామీ ఇస్తున్నాడు.