కొరివితో తల గోక్కోవడం అంటే ఏంటో తెలుసా? 'అంటే సుందరానికి' ఈవెంట్ కు పవన్ కల్యాణ్ ను పిలవడం అని చెప్పొచ్చు. ఈ సినిమా ఫంక్షన్ కు పవన్ ను చీఫ్ గెస్ట్ గా పిలిచి ఏరికోరి వివాదాలు తెచ్చుకుంటోంది ఆ సినిమా యూనిట్.
మరీ ముఖ్యంగా పొలిటికల్ గా పవన్ ఇప్పుడు అన్ని పార్టీలకు శత్రువు అయ్యారు. ఇలాంటి టైమ్ లో అతడ్ని పిలవడం సినిమా భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకోవడమే.
ఇంతకీ పవన్ వస్తే ఏంటి నష్టం..?
గతంలో రిపబ్లిక్ సినిమా ఈవెంట్ కు వచ్చారు పవన్ కల్యాణ్. ఆ సినిమా గురించి తప్ప మిగతా విషయాలన్నీ మాట్లాడారు. సినీ వేదికపై రాజకీయాలు మాట్లాడ్డంతో పాటు, అప్పట్లో ఉన్న టికెట్ల ఇష్యూపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో సినిమాపై ప్రచారం కంటే, పవన్ వ్యాఖ్యలపై ప్రచారం ఎక్కువగా జరిగింది.
అది ఏ స్థాయిలో జరిగిందంటే, చివరికి రిపబ్లిక్ విడుదలైన విషయాన్ని కూడా ఎవ్వరూ పట్టించుకోలేదు. అలా పవన్ వ్యాఖ్యల ప్రభావం రిపబ్లిక్ సినిమాపై గట్టిగా పడింది. సినిమా బాగున్నప్పటికీ ఫ్లాప్ అయింది. ఆ తర్వాత ఓటీటీలోకి సినిమా వచ్చింది. ఓటీటీలోకి వచ్చిన తర్వాత కూడా పవన్ వ్యాఖ్యల్ని సోషల్ మీడియాలో హైలెట్ చేస్తూ, ఓటీటీ రిజల్ట్ ను కూడా దెబ్బకొట్టారు.
మళ్లీ ఇప్పుడు నాని కోసం..?
ఆ వివాదం నిన్నమొన్నటివరకు నడిచింది. ప్రస్తుతం టికెట్ రేట్ల ఇష్యూ అనేది ఎక్కడా లేదు. ఇంకా చెప్పాలంటే, ప్రభుత్వం విధించిన టికెట్ రేట్ల కంటే తక్కువకే సినిమాల్ని ప్రదర్శించే పరిస్థితి వచ్చేసింది. ఇలాంటి టైమ్ లో పవన్ మరోసారి మైక్ అందుకోబోతున్నారు. అంటే సుందరానికి సినిమా ఫంక్షన్ లో ఆయన మాట్లాడబోతున్నారు. అదే ఇప్పుడు చాలామందికి గుబులు రేపుతోంది.
గతంలో పవన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టైమ్ లో అతడికి ఇండస్ట్రీ నుంచి ఎలాంటి మద్దతు లభించలేదు. చివరికి ఇండస్ట్రీ అంతా ఏకమై, పవన్ వ్యాఖ్యలతో తమకు సంబందం లేదని కూడా ప్రకటించాల్సి వచ్చింది. ఆ టైమ్ లో నాని మాత్రమే కూసింత పవన్ కు మద్దతుగా మాట్లాడారు. ఇప్పుడు నాని-పవన్ కలుస్తున్నారు. ఎలాంటి వివాదాలు రేగుతాయో చూడాలి.
అప్పటి పరిస్థితి వేరు.. ఇప్పటి పరిస్థితి వేరు..
అప్పుడు కనీసం పవన్ కు టీడీపీ మద్దతైనా ఉండేది. ఇప్పుడు టీడీపీ కూడా పవన్ ను వ్యతిరేకిస్తోంది. ఇలాంటి టైమ్ లో టీడీపీ-వైసీపీ కలిసి నాని సినిమాపై పగబడితే మొదటికే మోసం వస్తుంది. శ్యామ్ సింగరాయ్ తో కాస్ట్ ఫెయిల్యూర్ చూశాడు నాని. ఇప్పుడు అంటే సుందరానికి సినిమా కూడా ఫెయిలైతే అతడి కెరీర్ పై అది ప్రభావం చూపిస్తుంది.
ఇలాంటి కీలకమైన టైమ్ లో పవన్ ను చీఫ్ గెస్ట్ గా పిలిచి నాని తప్పు చేశాడనే వాదన బలంగా వినిపిస్తోంది. అయితే మరో సైడ్ నుంచి చూసుకుంటే.. ఈసారి పవన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయకపోవచ్చని, ఇండస్ట్రీకి సంబంధించి 2-3 అంశాలు టచ్ చేసి వదిలేస్తారని అంటున్నారు మరికొందరు. ఇలా కాకుండా మరోలా జరిగితే మాత్రం అప్పుడు సాయితేజ్ కు పట్టిన గతే, నానికి కూడా పట్టడం ఖాయం.