నిర్మాతల ‘పవర్’ తీసేసిన పవన్ కల్యాణ్!

“దసరా నుంచి రోడ్లపైనే ఉంటా, ప్రజా సమస్యలపై ఊరూరా తిరుగుతా. వైసీపీ నాయకులు నన్ను ఎన్ని అంటారో అనుకోండి. నేను అన్నీ వింటా. దసరా తర్వాత నేను మొదలుపెడతాను.” Advertisement పవన్ పేల్చిన ఈ…

“దసరా నుంచి రోడ్లపైనే ఉంటా, ప్రజా సమస్యలపై ఊరూరా తిరుగుతా. వైసీపీ నాయకులు నన్ను ఎన్ని అంటారో అనుకోండి. నేను అన్నీ వింటా. దసరా తర్వాత నేను మొదలుపెడతాను.”

పవన్ పేల్చిన ఈ బాంబ్, వైసీపీ నేతల గుండెల్లో పేలుతుందని అంతా అనుకున్నారు. కానీ ఆ పవర్ బాంబ్ నేరుగా వచ్చి ఆయనతో సినిమాలు తీస్తున్న నిర్మాతల గుండెల్లో పేలింది. అవును.. దసరా తర్వాత పవన్ సినిమాలు ఆపేస్తే, ఆయనతో సినిమాలు నిర్మిస్తున్న నిర్మాతల పరిస్థితేంటి? దసరా తర్వాత రోడ్లపైనే ఉంటానంటూ ప్రకటించి నిర్మాతలను టెన్షన్ పెట్టారు పవన్. నిజంగానే దసరా నుంచి పవన్ రోడ్లపైకి వస్తే, అతడు చేయాల్సిన సినిమాలు ఆగిపోయినట్టేనా?

రత్నం ఒడ్డున పడతాడా?

చాలా ఏళ్ల కిందట మొదలైంది హరిహర వీరమల్లు సినిమా. ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమా దసరా లోపు కొలిక్కి వస్తుందా? దర్శకుడు క్రిష్ పూర్తిగా ప్రిపేర్ అయి ఉన్నప్పటికీ, పవన్ కల్యాణ్ కాల్షీట్ దక్కుతుందా? ఇప్పటికే రత్నం చాలా ఆర్థిక కష్టాల్లో ఉన్నారు. ఈ సినిమా కోసం బయట నుంచి చాలా అప్పులు తెచ్చారు. దసరా లోపు రత్నంను పవన్ కల్యాణ్ ఒడ్డున పడేయకపోతే, రత్నం కొంప కొల్లేరవుతుంది.

హరీశ్ శంకర్, సురేందర్ రెడ్డి సంగతేంటి?

హరీశ్ శంకర్ తో సినిమా ప్రకటించి చాలా రోజులైంది. అటు సురేందర్ రెడ్డి మూవీ ప్రకటన కూడా వచ్చి చాన్నాళ్లవుతుంది. ఈ రెండు సినిమాలకు సంబంధించి పవన్ కు అడ్వాన్సులు కూడా అందాయి. మైత్రీ మూవీ మేకర్స్ అడ్వాన్స్ పవన్ దగ్గర దాదాపు ఆరేళ్లుగా ఉంది. ఈమధ్య రామ్ తళ్లూరి (ఎస్ఆర్టీ ఎంటర్ టైన్ మెంట్స్) కూడా సురేందర్ రెడ్డి సినిమా కోసం అడ్వాన్స్ ఇచ్చి కూర్చున్నారు. మరి ఈ రెండు సినిమాల సంగతేంటి?

దసరా నాటికి తన సినిమా సెట్స్ పైకి వస్తుందని హరీశ్ శంకర్, తన సన్నిహితుల దగ్గర చెప్పుకుంటున్నాడు. అటు మైత్రీ నిర్మాతలు కూడా ఈ ప్రాజెక్టు కోసం డబ్బులు రెడీ చేసుకుంటున్నారు. ఇలాంటి టైమ్ లో పవన్ కల్యాణ్ 'దసరా' బాంబ్ పేల్చారు. దసరా తర్వాత ఆయన అట్నుంచి అటే రాజకీయాలకు వెళ్లిపోతే.. హరీశ్, సురేందర్ రెడ్డి కెరీర్లు గాల్లో దీపాలే.

పీపుల్ మీడియా అడ్వాన్స్ సంగతేంటి?

పించ్ హిట్టర్ లా మధ్యలో దూరారు పీపుల్ మీడియా నిర్మాతలు. త్రివిక్రమ్ లాబీయింగ్ తో, జీ స్టుడియోస్ పెట్టుబడితో చకచకా పావులు కదిపారు. అదే వినోదాయ శితం రీమేక్. ఇదిగో ఓపెనింగ్, అదిగో రెగ్యులర్ షూటింగ్ అంటూ తెగ ఊరిస్తూ వచ్చారు. 

ఇప్పుడీ సినిమాపై కూడా బండ వేశారు పవన్ కల్యాణ్. మరో 3 నెలల్లో ఈ సినిమాను పవన్ కల్యాణ్ కొలిక్కి తేవాల్సి ఉంది. అలా జరక్కపోతే మాత్రం రామ్ తళ్లూరి, నవీన్ యేర్నేని పక్కన టీజీ విశ్వప్రసాద్ కూడా ఓ కుర్చీ వేసుకొని వెయిటింగ్ లిస్ట్ లో కూర్చోవాల్సిందే.

ఇంతకీ మాట మీద నిలబడతాడా?

దసరా నుంచి పవన్ అట్నుంచి అటే వెళ్లిపోతే ఈ సినిమాల పరిస్థితి మొత్తం అగమ్యగోచరంగా మారుతుందనేది వాస్తవం. అయితే పవన్ గురించి బాగా తెలిసినోళ్లు మాత్రం ఈ వ్యాఖ్యల్ని లైట్ తీసుకుంటున్నారు. ఆయన మాట మీద నిలబడరని, పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. 

పవన్ చెప్పింది ఎప్పుడూ చేయరని, కాబట్టి ఈ వ్యాఖ్యలతో కంగారు పడాల్సిన అవసరం లేదని ముక్తాయిస్తున్నారు. నిజమే.. పవన్ ఎప్పుడూ మాట మీద నిలబడలేదు. నిన్న ఆవేశంగా ఆయన 'దసరా టార్గెట్' ప్రకటించి ఉండొచ్చు. ఆయనకు సినిమాల తర్వాతే రాజకీయాలు.