Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఈరోజు సినిమా షూటింగ్స్ జరుగుతాయా?

ఈరోజు సినిమా షూటింగ్స్ జరుగుతాయా?

టాలీవుడ్ లో మరో ఉత్కంఠభరిత పరిస్థితి. ఈరోజు షూటింగ్స్ జరుగుతాయా.. జరగవా? సినీ కార్మికులు పనికి వెళ్తారా వెళ్లరా? ప్రస్తుతం టాలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. నిన్నట్లానే ఈరోజు ఉదయం కూడా కృష్ణానగర్ కు వచ్చిన బస్సుల్ని వెనక్కి పంపించారు సినీ కార్మికులు. అయితే నిన్న ఫెడరేషన్ దగ్గర కనిపించినంత హడావుడి ఈరోజు ఉండకపోవచ్చని కార్మికులే చెబుతున్నారు. దాదాపు సగం మంది సంఖ్యాబలం తగ్గొచ్చని చెబుతున్నారు. 

కొంతమంది ఈరోజు తమ షూటింగ్స్ కు వస్తున్నారని నిర్మాతలు చెబుతుంటే, ఫెడరేషన్ సభ్యులు మాత్రం చాలామంది తమ ఇళ్లకు వెళ్తున్నారని చెబుతున్నారు. నిజం ఏంటనేది సాయంత్రానికి తేలుతుంది.

30 శాతం కాదు.. 45 శాతం కావాలి..!

నిన్న మధ్యాహ్నం వరకు వేతనాల్లో 30శాతం పెంపు కావాలని డిమాండ్ చేసిన కార్మికులు, సాయంత్రానికి మాట మార్చారు. తమ వేతనాల్లో 45శాతం పెంపు కావాల్సిందేనంటూ పట్టుబడ్డారు. నిన్న ఒక్క రోజే 25 సినిమాల షూటింగ్స్ నిలిచిపోయాయని, వెంటనే తమకు పెంచిన వేతనాలు అమలు చేసి, సినిమా షూటింగ్స్ సజావుగా జరిగేలా చూడాలని ఫిలిం ఫెడరేషన్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

ససేమిరా అంటున్న నిర్మాతలు

అటు నిర్మాతలు మాత్రం కార్మికుల డిమాండ్స్ కు తలొగ్గడం లేదు. ఈరోజు పనిలోకి వస్తేనే, రేపట్నుంచి చర్చలు ప్రారంభిస్తామంటున్నారు. అక్కడితో ఆగకుండా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి నిర్మాతలందరికీ ఓ అల్టిమేటం కూడా ఇచ్చారు. షూటింగ్స్ ఆగిపోతున్నాయని, ఏ నిర్మాత ఎక్కువ వేతనానికి కార్మికుల్ని పనిలోకి తీసుకోవద్దని సూచించారు. 

ఎవరికి వారు వ్యక్తిగత స్థాయిలో నిర్ణయం తీసుకోవద్దని, నిర్మాతల మండలి నిర్ణయాలకు అనుగుణంగా వెళ్లాలని కోరారు. ఇవాళ్టి నుంచి 2 వారాల పాటు పాత పద్ధతిలోనే పేమెంట్స్ ఇవ్వాలని, కార్మికులు అంగీకరించకపోతే షూటింగ్స్ ఆపేయాలని సూచిస్తున్నారు.

ఆ నిర్మాతలు, ఆ హీరోలు ఎక్కడ?

టికెట్ రేట్ల ఇష్యూ తెరపైకి వచ్చినప్పుడు రంగంలోకి దిగిన పెద్ద ప్రొడ్యూసర్లు, పెద్ద హీరోలు ఇప్పుడెందుకు ముందుకు రావడం లేదని సినీ కార్మికులు ప్రశ్నిస్తున్నారు. సెట్స్ లో పని మొత్తం చేసే కార్మికులకు కష్టాలు వచ్చినప్పుడు పెద్ద హీరోలు స్పందించాల్సిన అవసరం ఉందంటున్నారు. పెద్ద ప్రొడ్యూసర్లు, హీరోలు సీన్ లోకి వచ్చినప్పుడు మాత్రమే తమ సమస్యలకు సత్వర పరిష్కారం దొరుకుతుందని దిల్ రాజు, చిరంజీవి లాంటి వ్యక్తుల్ని ప్రశ్నిస్తున్నారు. 

ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉండనని, సినీ కళామతల్లి ముద్దుబిడ్డగా ఉంటానని, ఎవరికి ఏ కష్టమొచ్చినా తనవంతు సహాయం అందిస్తానంటూ గతంలో ప్రకటించిన చిరంజీవి, సినీకార్మికుల వేతనాల సమస్యలు పరిష్కారమయ్యేలా చొరవ చూపాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.

సందట్లో సడేమియా.. చిన్న సినిమాల షూటింగ్స్

ఓవైపు ఇంత జరుగుతుంటే, మరోవైపు సందట్లో సడేమియా అన్నట్టు నిన్న 2-3 చిన్న సినిమాల షూటింగ్స్ జరిగాయి. వ్యక్తిగత స్థాయిలో తమకున్న పరిచయాలు వాడుకొని నిన్న ఒక్కరోజు షూటింగ్ జరిగేలా కొంతమంది నిర్మాతలు పావులు కదిపారు. అయితే ఇవాళ్టి నుంచి అవి కూడా కొనసాగే పరిస్థితి కనిపించడం లేదు.

ఈరోజు కార్మికులు షూటింగ్ కు రాకపోతే 24 క్రాఫ్టుల్లో జరుగుతున్న బండారాన్ని, నిర్మాతలకు జరుగుతున్న నష్టాల్ని బయటపెడతానని నిన్న నిర్మాత సి.కల్యాణ్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈరోజు షూటింగ్స్ లేకపోతే, రేపు ఆయన ప్రెస్ మీట్ పెట్టి పలు సంఘాల్లో జరుగుతున్న లొసుగుల్ని బయటపెట్టే అవకాశం ఉంది. 

నిన్న జరిగిన ప్రెస్ మీట్ లోనే ఆయన ఇలాంటి కొన్ని వివరాల్ని బయటపెట్టారు. కార్మికులు షూటింగ్స్ కు రాకపోతే మరిన్ని తెరవెనక కథల్ని, లేఖల్ని సి.కల్యాణ్ బయటపెట్టబోతున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?