టాలీవుడ్ లో ఉప్పెనలా దూసుకొచ్చింది శ్రీలీల. పెళ్లిసందడి సినిమా ఫ్లాప్ అయినప్పటికీ, ఆమె డాన్సింగ్ టాలెంట్ కు టాలీవుడ్ ఫిదా అయింది. హీరోయిన్స్ లో చాలా అరుదుగా కనిపించే క్వాలిటీ అది. ఆ తర్వాత ఆమెకు ధమాకా రూపంలో పెద్ద హిట్ వచ్చింది. ఇక మళ్లీ వెనుతిరిగి చూడలేదు ఈ ముద్దుగుమ్మ.
తనకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని అందుకుంది. వరుస పెట్టి సినిమాలకు సైన్ చేసింది. ఈ క్రమంలో ఆమె బ్యానర్, హీరో మాత్రమే చూసింది తప్ప… కథలు, అందులో పాత్రల గురించి పెద్దగా పట్టించుకున్నట్టు లేదు. దీంతో ఆమెకు వరుసగా ఫ్లాపులొచ్చాయి. భగవంత్ కేసరి ఒక్కటి దీనికి మినహాయింపుగా చెప్పుకోవాలి.
ఇలా ఎన్ని ఫ్లాపులు వచ్చినప్పటికీ, శ్రీలీల ధైర్యంగా ఉందంటే దానికి ఏకైక కారణం గుంటూరుకారం. కెరీర్ లో తొలిసారి మహేష్ బాబు లాంటి పెద్ద హీరో సినిమాలో అవకాశం అందుకుంది. ఇక్కడ కూడా ఆమెకు అదృష్టం కలిసొచ్చింది.
గుంటూరుకారంలో ముందుగా ఆమెను సెకెండ్ లీడ్ గా తీసుకున్నారు. ఎప్పుడైతే పూజాహెగ్డే తప్పుకుందో, ఇక అప్పుడు మెయిన్ హీరోయిన్ అయిపోయింది శ్రీలీల.
అందుకే ఓవైపు ఆదికేశవ, ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్ లాంటి ఫ్లాపులొస్తున్నప్పటికీ.. గుంటూరుకారం తన కెరీర్ కు పిల్లర్ గా నిలబడుతుందని ఆశలు పెట్టుకుంది. కానీ ఇప్పుడు ఆశ తీరలేదు. గుంటూరుకారం ఫ్లాప్ అవ్వడంతో పాటు, అందులో శ్రీలీల పాత్రపై విమర్శలు ఓ రేంజ్ లో పడుతున్నాయి.
స్కంద సినిమా టైమ్ లో శ్రీలీల పాత్రపై ఎన్ని విమర్శలు పడ్డాయో, వాటికి ఏమాత్రం తీసిపోని విధంగా గుంటూరుకారం విషయంలో కూడా శ్రీలీల కార్నర్ అయింది. ఈ నేపథ్యంలో పూజాహెగ్డేతో పోలుస్తున్నారు చాలామంది.
పూజాహెగ్డే కూడా ఇంతే. దువ్వాడ జగన్నాధమ్ సినిమా తర్వాత వరుసపెట్టి అవకాశాలు అందుకుంది. కేవలం హీరోల్ని చూసి సినిమాలకు సంతకాలు చేసింది. ఎప్పుడైతే ఆచార్య, రాధేశ్యామ్ లాంటి సినిమాలు డిజాస్టర్లు అయ్యాయో, అప్పట్నుంచి పూజాకు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు శ్రీలీల కూడా అదే తప్పు రిపీట్ చేస్తోందంటున్నారు చాలామంది.