యాభై లక్షల ఫ్రాడ్!

సినిమా రంగంలో భలే చిత్రమైనది ఇక్కడ కోట్లకు కోట్ల వ్యాపారం జరుగుతుంది. చిన్న గిల్లుడు గిల్లితే లక్షలు ఎగిరిపోతాయి. అది కూడా తెలియకుండానే. ఎంత నమ్మకమైన వారిని పనిలో పెట్టుకున్నా, ఎక్కడో అక్కడ ఈ…

సినిమా రంగంలో భలే చిత్రమైనది ఇక్కడ కోట్లకు కోట్ల వ్యాపారం జరుగుతుంది. చిన్న గిల్లుడు గిల్లితే లక్షలు ఎగిరిపోతాయి. అది కూడా తెలియకుండానే. ఎంత నమ్మకమైన వారిని పనిలో పెట్టుకున్నా, ఎక్కడో అక్కడ ఈ గిల్లుడు కార్యక్రమాలు జరుగుతూనే వుంటాయి. తెలుసుకునే వరకు జరుగుతాయి. తెలిసాక చేసేదేమీ వుండదు. తీసేయడం తప్ప. మరీ ఒక్కోసారి తన్నో, కొట్టో కొంత వెనక్కు లాక్కుంటారు కొందరు.

టాలీవుడ్ లోని ఓ ప్రముఖ నిర్మాణ సంస్థలో ఇలాంటి వ్యవహారమే ఒకటి కొద్ది రోజుల క్రితం తొంగి చూసినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఏ నిర్మాణ సంస్థ అయినా సినిమా తీసినపుడు, విడుదల టైమ్ లో భారీగా టికెట్ లు తమ స్వంతానికి వుంచుకుంటాయి. నిర్మాత బంధువులు, స్నేహితులు, అలాగే వివిధ ప్రభుత్వ శాఖలు, తమ దగ్గర పని చేసే స్టాఫ్ ఇలా వందలాది టికెట్ లు అవసరం పడతాయి. 

భారీ సినిమాలు అయితే చెప్పనక్కరలేదు. దాదాపు మూడు నాలుగు రోజులు ఇలాంటి హడావుడి వుంటుంది. వరుసగా పెద్ద పెద్ద సినిమాలు తీసే నిర్మాణ సంస్థకు ఇలాంటి ఖర్చు ఎంత వుంటుంది. సినిమాకు లక్షల్లో వుంటుంది. సినిమాలకు అంటే కోట్లకు చేరుతుంది.

ఇక్కడే ఓ ఉద్యోగి గట్టిగా గిల్లుడు గిల్లారని టాక్ వినిపిస్తోంది. దాని వల్ల కంపెనీ సొమ్ము కొన్ని లక్షలు గల్లంతు అయినట్లు బోగట్టా. దీన్ని కంపెనీ యజమాని కాస్త ఆలస్యంగా గుర్తించారని తెలుస్తోంది. గుర్తించినా ఇంక ఏం చేయగలరు, సదరు ఉద్యోగిని పక్కన పెట్టడం తప్ప చేసేదేమీ వుండదు. ఇది జరిగి, ఉద్యోగి దొరికిన వైనం కాస్త ఆలస్యంగా ఇప్పుడు టాలీవుడ్ లో వినిపించడం ప్రారంభించింది.