మెగాస్టార్ కాకముందు చిరంజీవి ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాధ్ నవలల కధానాయకుడిగా ఎన్నో సినిమాలు వరసగా చేశారు. ఈ ఇద్దరు తొలి కాంబో అభిలాష అయితే అదే జోరులో చాలెంజ్, మరణ మృదంగం, రాక్షసుడు వంటి సినిమాలు ఎన్నో వచ్చాయి.
చిరంజీవి మెగాస్టార్ అయితే యండమూరి స్టార్ రైటర్ గా ఇమేజ్ సాధించారు. ఈ ఇద్దరు కలయిక అంటే సూపర్ హిట్ కాంబో అని స్థిరపడిపోయింది. యండమూరి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి స్టువర్టుపురం పోలీస్ స్టేషన్ సినిమా కూడా చేసారు.
ఆ తరువాతనే ఈ కాంబో మళ్లీ కుదరలేదు. ఇది దశాబ్దాల క్రితం నాటి మాట. యండమూరి నవలలు తగ్గించి యువత కోసం పనిచేస్తూ వస్తున్నారు. వారికి నవ సందేశం ఇస్తూ ఆయన తనలోని రెండవ కోణాన్ని ఆవిష్కరించారు.
చిరంజీవి సినిమాల్లో హీరోగా కొనసాగుతున్నారు. ఇలా ఇద్దరు దారులు వేరు అయి బిగ్ గ్యాప్ వచ్చేసింది. ఈ నేపధ్యంలో ఈ ఇద్దరికీ ఒక వేదిక మీదకు తెచ్చి జనాల ముందు పెడుతున్నారు మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్. ఆయన లోక్ నాయక్ ఫౌండేషన్ పేరిట సంస్థను ఏర్పాటు చేసి ప్రతీ ఏటా ప్రముఖ సాహిత్య వేత్తలకు నగదు పురస్కారాలతో సత్కరిస్తూంటారు.
అలా ఈ ఏడాదికి గానూ యండమూరికి సాహితీ పురస్కారం అందిస్తున్నారు. ఆ వేడుక ఈ నెల 20న విశాఖలో జరగనుంది. ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరంజీవి హాజరవుతున్నారు. ఇలా యండమూరి మెగాస్టార్ ఒకే చోట చేరే అపూర్వ సన్నివేశానికి విశాఖ వేదిక కానుంది. విశేషమేంటి అంటే ఈ ఇద్దరినీ సినిమాలలో కలిపింది కూడా విశాఖనే. అభిలాష, చాలెంజ్ వంటి సినిమాలు విశాఖలోనే షూటింగ్స్ జరుపుకున్న సంగతి అందరికీ తెలిసిందే.