cloudfront

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: అదిరింది

సినిమా రివ్యూ: అదిరింది

రివ్యూ: అదిరింది
రేటింగ్‌: 2.75/5
బ్యానర్‌: తెనండాల్‌ స్టూడియో లిమిటెడ్‌
తారాగణం: విజయ్‌, నిత్య మీనన్‌, ఎస్‌జె సూర్య, కాజల్‌ అగర్వాల్‌, సమంత, సత్యరాజ్‌, వడివేలు, కోవై సరళ తదితరులు
కథనం: అట్లీ, విజయేంద్రప్రసాద్‌, రమణగిరి వాసన్‌
కూర్పు: రూబెన్‌
సంగీతం: ఏ.ఆర్‌. రెహమాన్‌
ఛాయాగ్రహణం: జి.కె. విష్ణు
నిర్మాతలు: ఎన్‌. రామసామి, హేమా రుక్మణి
కథ, దర్శకత్వం: అట్లీ
విడుదల తేదీ: నవంబర్‌ 9, 2017

ఒక భాషలో ఆల్‌టైమ్‌ బ్లాక్‌బస్టర్స్‌లో ఒకటిగా నిలిచిన సినిమాని చూస్తున్నపుడు వీక్షకుల దృష్టి కోణం మారిపోతుంది. ఆల్రెడీ హిట్‌ సినిమా అనే దృష్టితో చూడడం వల్ల మైనస్‌లు మరుగున పడి పాజిటివ్‌లో హైలైట్‌ అయి కనిపిస్తాయి. తమిళంలో 'మెర్సల్‌' పేరిట రూపొందిన 'అదిరింది' అచ్చంగా విజయ్‌ ఇమేజ్‌ని, ఫాన్‌ బేస్‌ని, అతని పొలిటికల్‌ యాస్పిరేషన్స్‌ని దృష్టిలో పెట్టుకుని రాసిన ఒక పక్కా కమర్షియల్‌ కథ. సగటు సూపర్‌స్టార్‌ సినిమాలో ఎలాంటి ఎలిమెంట్స్‌ని ఫాన్స్‌ కోరుకుంటారో వాటితో అట్లీ నింపేసాడు. విజయ్‌ అభిమానులు ఈ చిత్రాన్ని ఎగబడి చూడడంలో వింత ఏమీ లేదు. అభిమానులు ఉర్రూతలూగేలా, విజయ్‌ ట్రేడ్‌మార్క్‌ మేనరిజమ్స్‌తో, స్టయిల్స్‌తో అలరించేలా అట్లీ తన హీరో(ల) పాత్ర(ల)ని డిజైన్‌ చేయడమే కాకుండా అవన్నీ సరైన టైమ్‌లో పడేలా, బాగా ఎలివేట్‌ అయ్యేలా చూసుకున్నాడు.

ఇది ఒక సగటు ప్రతీకార కథ అయినప్పటికీ వైద్య రంగంలో జరుగుతోన్న అక్రమాలు, అన్యాయాలని నిర్మొహమాటంగా నిలదీస్తూ అందరూ కనక్ట్‌ అయ్యే ఒక కామన్‌ పాయింట్‌ని బాగా జత చేసారు. మెడికల్‌ రంగంలో అత్యంత పెద్ద స్కామ్‌ ఏది అని అడిగితే 'మెడికల్‌ చెకప్‌' అంటూ దానికి హీరో ఇచ్చే వివరణ లాంటివి ఇన్‌స్టంట్‌గా రిలేట్‌ అయ్యేట్టు చేస్తాయి. ఈ మెడికల్‌ స్కామ్‌కి సంబంధించిన సన్నివేశాలని అట్లీ చాలా స్ట్రయికింగ్‌గా తెరకెక్కించాడు. 

ఒక పాపకి యాక్సిడెంట్‌ అయినపుడు, ఆమె తండ్రి ఆటోడ్రైవర్‌ అనే కనికరం లేకుండా అతడిని జలగలా పిండేసే కార్పొరేట్‌ వైద్యుల మనస్తత్వాన్ని చూపించిన తీరు కానీ, ముప్పయ్యేళ్ల నాటి బ్యాక్‌డ్రాప్‌లో కథ చెబుతున్నపుడు ముందు ముందు వైద్య రంగం ఎలా మారిపోతుందో వివరించిన వైనం ఆకట్టుకుంటుంది. పంతొమ్మిది వందల డెబ్బయ్యవ దశకంలో 'సిజేరియన్‌'ని వింతగా చూసిన వారే, ముప్పయ్యేళ్ల తర్వాత 'నార్మల్‌ డెలివరీ'ని వింతగా చెప్పుకుంటారని చెప్పడం లాంటివి అందరూ రిలేట్‌ అయ్యేలా వున్నాయి.

ప్రథమార్ధంలో అట్లీ ఈ చిత్రాన్ని పర్‌ఫెక్ట్‌ మసాలా ఎంటర్‌టైనర్‌లా తీర్చిదిద్దాడు. ఈ పార్ట్‌ని ఎంజాయ్‌ చేయడానికి విజయ్‌ అభిమాని కానక్కర్లేదు. రొటీన్‌ వ్యవహారాన్నే ఆసక్తికరమైన కథనంతో ముందుకి నడిపించారు. సమంత, విజయ్‌లు 'అక్కా, తమ్ముడూ' అని సంబోధించుకోవడం అట్లీ తీసిన 'రాజా రాణి' చిత్రాన్ని గుర్తుకి తెస్తుంది. ఫస్ట్‌ హాఫ్‌ వరకు కొత్తదనం లేకపోయినా కానీ అలరించేలానే సాగిన ఈ చిత్రం ఇంటర్వెల్‌ ట్విస్ట్‌తో మాస్‌కి కిక్‌ ఇస్తుంది. కాకపోతే ఇంటర్వెల్‌ తర్వాత డెబ్బయ్‌ల కాలంలోకి మారిన తర్వాత పూర్తిగా స్వరూపం మారిపోతుంది. అంతవరకు తమిళ నేటివిటీ ఏదీ కనిపించని ఈ చిత్రంలో ఒక్కసారిగా తమిళ వాసనలు గుప్పున కొడతాయి. దానికి తోడు ఆ సుదీర్ఘమైన ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌లో ఆకట్టుకునే అంశాలేమీ లేవు.

విజయ్‌ భవిష్యత్‌ రాజకీయ ప్రణాళికల కోసం ఈ ఫ్లాష్‌బ్యాక్‌ ఇలా మలిచారా అనే అనుమానం కూడా కలుగుతుంది. ఎస్‌.జె. సూర్య ఎంటర్‌ అయిన తర్వాతే ఆ ఫ్లాష్‌బ్యాక్‌లో చలనం వస్తుంది. పతాక సన్నివేశాలు మరీ రొటీన్‌గా వుండడంతో 'అదిరింది' టైటిల్‌కి పూర్తి న్యాయం జరగలేదనే చెప్పాలి. విజయ్‌ తన ట్రేడ్‌మార్క్‌ మేనరిజమ్స్‌తో ఫాన్స్‌ని ఆకట్టుకునేందుకే ఆసాంతం ప్రయత్నించాడు. ఈ చిత్రంపై నెలకొన్న ఆసక్తి అతడికి ఇక్కడ సూర్య మాదిరిగా స్టాండర్డ్‌ మార్కెట్‌ని ఇచ్చేదయితే కాదు. 

విజయ్‌లాంటి రొటీన్‌ మాస్‌ సినిమాలు చేయడానికి మన హీరోలే చాలా మంది వున్నారు కనుక మనకి కొత్తగా దిగుమతులు అవసరం లేదు. సమంత, కాజల్‌ గెస్ట్‌ అప్పీయరెన్స్‌ ఇచ్చారేమో అన్నట్టున్నారు. ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌ సుదీర్ఘంగా వుండడంతో నిత్యామీనన్‌కే కథానాయిక హోదా ఇవ్వవచ్చు. ఎస్‌జె సూర్య ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌లో స్పైడర్‌లో సైకో యాక్ట్‌ గుర్తు చేసాడు. అతని పాత్రని సరిగా తీర్చిదిద్దకపోవడం వల్ల పతాక సన్నివేశాలు తేలిపోయాయి. సత్యరాజ్‌, వడివేలు, కోవై సరళ సహాయ పాత్రల్లో కనిపించారు.

రహమాన్‌ సంగీతంలో ఒక్క పాట కూడా వినసొంపుగా లేదు. నేపథ్య సంగీతంతో మాత్రం తన ముద్ర వేసాడు. మాస్‌ సినిమాలకి వుండే లౌడ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కాకుండా కొత్తగా స్కోర్‌ చేసి ఆకట్టుకున్నాడు. టెక్నికల్‌గా చాలా తమిళ చిత్రాల్లానే ఉన్నతంగా వుంది. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్‌ డిజైన్‌, మేకింగ్‌ వేల్యూస్‌ అన్నీ టాప్‌ క్లాస్‌ అనిపిస్తాయి. దర్శకుడిగా అట్లీ తన మొదటి చిత్రం 'రాజా రాణి'లో చూపించిన సెన్సిబులిటీస్‌ని అటు పోలీసోడులో కానీ, ఇప్పుడు అదిరిందిలో కానీ చూపించలేదు. పూర్తిగా విజయ్‌ ఇమేజ్‌పై ప్లే చేస్తోన్న అట్లీ ఈసారి మురుగదాస్‌, శంకర్‌లని ఫాలో అవుతూ సోషల్‌ మెసేజ్‌కి కమర్షియల్‌ ప్లాట్‌ జత చేయాలని చూసాడు. 

ఈ ప్రయత్నంలో అతను పూర్తిగా సక్సెస్‌ కాకపోయినప్పటికీ కొన్ని సందర్భాల్లో మాత్రం స్ట్రయికింగ్‌ సీన్స్‌తో మాత్రం బాగా మెప్పించాడు. విపరీతమైన ప్రచారం పొందిన జిఎస్‌టికి వ్యతిరేకమైన సంభాషణలని పూర్తిగా మ్యూట్‌ చేసేసారు. విడుదలలో జాప్యం జరిగినా కానీ సినిమాపై వున్న ఆసక్తి సన్నగిల్లలేదసలు. విజయ్‌కి ఇక్కడ గ్యారెంటీ మార్కెట్‌ లేకపోయినప్పటికీ ఈ చిత్రానికి తెలుగు ప్రేక్షకుల నుంచి సాదర స్వాగతం లభించింది. కమర్షియల్‌ మీటర్‌ ఫాలో అవడం వల్ల 'అదిరింది' రొటీన్‌గా వున్నప్పటికీ మాస్‌ చిత్రాలని ఇష్టపడేవారి నుంచి ఆమోద ముద్ర పొందుతుంది.
బాటమ్‌ లైన్‌: తమిళ మసాలా!
- గణేష్‌ రావూరి