Advertisement

Advertisement


Home > Movies - Reviews

Animal Review: మూవీ రివ్యూ: యానిమల్

Animal Review: మూవీ రివ్యూ: యానిమల్

చిత్రం: యానిమల్
రేటింగ్: 2.5/5
తారాగణం:
రణ్ బీర్ కపూర్, రష్మిక, అనీల్ కపూర్, బాబీ డియోల్, తృప్తి డిమ్రి, చారు శంకర్, బబ్లూ పృథ్విరాజ్, శక్తి కపూర్, సిద్ధాంత్ కఋనిక్ తదితరులు
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్ తదితరులు
కెమెరా: అమిత్ రాయ్
నిర్మాతలు: భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగ
దర్శకత్వం: సందీప్ రెడ్డి వంగ 
విడుదల: 1 డిసెంబర్ 2023

ఈ మధ్యకాలంలో ఇంత ప్రచారం పొందిన సినిమా మరొకటి లేదు. దిగ్గజ దర్శకులు, హీరోలు సైతం దీని ప్రచారంలో భాగమయ్యారు. తెలుగువాడైన సందీప్ రెడ్డి వంగ హిందీలో తీసిన రెండవ చిత్రమిది. తొలి చిత్రం "కబీర్ సింగ్" పెద్ద హిట్. దాని మూల చిత్రం "అర్జున్ రెడ్డి" సంగతి తెలిసిందే. ఇలా రెండు వరుస విజయాలతో దూసుకెళ్తున్న సందీప్ వంగ ఈ చిత్రంతో హ్యాట్రిక్ కొడతాడా? 

2056 సంవత్సరంలో సీన్ ఓపెనవుతుంది. సుమారు 70 ఏళ్లు పైబడ్డ విజయ్ సింగ్ (రన్ బీర్ కపూర్) తన తండ్రి నూరవ జయంతి సందర్భంగా తన ఫ్లాష్ బ్యాక్ విప్పుతాడు. 

కట్ చేస్తే కథ 1996 కి వెళ్తుంది. బాల్యం నుంచి తన తండ్రి బల్బీర్ సింగ్ (అనీల్ కపూర్) పై తనకు గల ప్రేమ, తన అక్కలకి రక్షణగా ఉండే తన నైజం, ప్రేమైనా కోపమైనా ఎక్స్ట్రీం లెవెల్లో చూపించే మనస్తత్వం ఒక్కోటీ పరిచయమవుతుంటాయి తెరపై పాత్రలకి, తెర ముందున్న ప్రేక్షకులకి కూడా. 

ఈ నేపథ్యంలో తండ్రీ కొడుకుల మధ్య రిలేషన్ షిప్ సమస్యలు తలత్తెడం, విజయ్ ఇల్లు వదిలి దూరంగా బతకాల్సి రావడం, గీతాంజలి (రష్మిక) అనే తెలుగమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరుగుతాయి. కాలక్రమంలో బల్బీర్ సింగ్ పై హత్యా ప్రయత్నం జరుగుతుంది. అది చేసిందెవరో కనిపెట్టి వాళ్లని విజయ్ మట్టుబెట్టడమే మిగతా కథ. 

కథగా చూస్తే విషయముంది. కథనంలో కొత్తదనముంది. అయితే ఆ కొత్తదనాన్ని ఎంతమంది దిగమింగగలరనేదాన్ని బట్టి ఈ సినిమాకి విజయావకాశాలు నిర్ణయింపడతాయి.  ఇంతకీ ఆ కొత్తదనమేంటంటే తండ్రీ కొడుకుల మధ్యన ఎమోషనల్ రిలేషన్. దానికి తోడు హిందీ తెరపై ఇంతవరకూ చూడని మితిమీరిన హింస, ఒక సంపూర్ణ నగ్న సన్నివేశం, బూతులు,  జననాంగాల మీద డైలాగ్స్ మొదలైనవి. ఎంత "ఎ" సర్టిఫికేట్ సినిమా అయినా కొన్ని సన్నివేశాలు, మాటలు చూడ్డానికి ఇబ్బందిగానే ఉంటాయి. 

హీరో క్యారెక్టరైజేషన్ మీద ఫోకస్ ఎక్కువగా పెట్టి కనీసమైన లాజిక్కుల్ని కూడా పక్కన పెట్టేశాడు దర్శకుడు. సినిమా అనేది లాజిక్ తో కాదు మేజిక్ తో వర్కౌట్ అవుతుందని వాదించవచ్చు. కానీ ఆ మేజిక్ కొరవడినప్పుడే ప్రేక్షకుల దృష్టి లాజిక్ మీదకు వెళ్తుంది. 

- ఒక పెద్ద పారిశ్రామికవేత్త కూతుర్ని కాలేజిలో ర్యాగింగ్ చేస్తే అతని తమ్ముడు పనిగట్టుకుని వెళ్లి వార్ణింగివ్వాలా? పక్కన తగలడ్డ బాడీ గార్డ్స్ ఏం చేస్తున్నట్టు? పైగా అది సొంత కాలేజి కూడానట!! 

- హీరో గొంతు పిసికి ఒకడిని పబ్లిక్ గా చంపుతాడు. ఆ విషయం దాదాపు కథ కంచికి చేరే వరకు ఎవ్వరికీ తెలియకపోవడమేంటి? ఆ పబ్లిక్ లో ఎవ్వరూ ఎవ్వరికీ చెప్పలేదా?

- హీరో అరివీరభయంకరంగా కేజీఎఫ్ లెవెల్లో ఫైటింగ్ చేస్తుంటే అతని వెంటనున్న ఫైటర్లు ఫైటింగులో సాయం చేయకుండా హీరోకి ఎంకరేజ్మెంట్ ఇస్తూ పాట పాడుతుంటారు చీర్ బాయ్స్ లాగ!

- బాడీ డబుల్ సీనైతే చెప్పక్కర్లేదు. చాలా కామెడీగా, అతిగా ఉంది. 

ఇలా లాజిక్ మిస్సయ్యేవి కొన్ని, నాన్ సింక్ లో పడి కొట్టుకునే సీన్లు కొన్ని.. వెరసి స్క్రిప్టులో లోపాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. 

వీటికి తోడు కథకి అవసరంలేని సీన్లు బోలెడన్ని ఉన్నాయి. ముఖ్యంగా లాండ్రీలో అండర్వేర్ సీన్, సెక్సాలజిస్ట్ అడిగే సెక్స్ ప్రశ్నలు, ఎంతకీ ముగియని ప్రీ ఇంటర్వల్ ఫైట్.. ఇవన్నీ కోసి పారేసుంటే కనీసం పావుగంటైనా తగ్గేదేమో నిడివి. 3 గంటల 21 నిమిషాలు ఒక సినిమాని కదలకుండా చూడాలంటే స్క్రీన్ ప్లేలో ఎంత పట్టుండాలి! 

తొలి సగంలో మొదటి సగం గ్రిప్పింగ్ గా సాగితే ఆ తర్వాత నుంచి జీడిపాకంలా సాగింది. అప్పటి వరకు ఫ్యామిలీ డ్రామాగా జరిగిన కథలో ఒక వెపన్ డీలర్ ఎంట్రీతో సడెన్ గా వేరే సినిమా చూస్తున్నామా అనే ఫీలింగొస్తుంది.  

సెకండాఫైతే ఒక డైలీ సీరియల్ ని సినిమా హాల్లో చూస్తున్నట్టు ఉంటుంది. కథ అక్కడక్కడే ఉంటూ ముందుకి కదలనట్టు ఉంటుంది. సినిమా ఇంకో ముప్పావు గంటలో ముగుస్తుందనగా బాబీ డియోల్ పాత్ర రంగప్రవేశం. మళ్లీ అతని క్యారక్టర్ పరిచయం తర్వాత, అతని వయొలెంట్ సీన్లు కొన్ని దర్శనమిచ్చి చివరికి ఒక ఫైటుతో ముగుస్తుంది. 

హింసాత్మక సన్నివేశాలైతే తారాస్థాయిలో ఉన్నాయి. 18 ఏళ్ల వయసు దాటిన వాళ్లంతా ఏది చూపిస్తే అది చూసేయగలరని అనుకోనక్కర్లేదు. సెన్సార్ బోర్డ్ కూడా ఈ విషయంలో కాస్త మెదడు వాడలి. పచ్చి బూతులు, నగ్న సన్నివేశాలు, గొంతుని పరపరా కోసే సీన్లు అవసరమా? కట్ చేయొద్దూ! 

ఏమైనా అంటే దర్శకులు క్రియేటివ్ ఫ్రీడం అని గగ్గోలు పెడతారు. ఆ ఫ్రీడం పేరుతో ఈ చెత్తనంతా పోగేసి చూపించి నాలుగు కాసులొస్తే కాళాత్మక దిగ్గజ దర్శకులైపోరు.  

ఇందులో హీరో ఒక్కడే కాదు. హీరోయిన్ ప్రవర్తన కూడా అతిగానే ఉంటుంది. ఆమె క్యారెక్టర్ మైల్డో, వైల్డో అర్ధమవ్వదు. 

టెక్నికల్ గా సంగీతం, పాటలు బాగున్నాయి. కెమెరా వర్క్ రిచ్ గా ఉంది. 

రణ్ బీర్ కి నటన పరంగా పూర్తి మార్కులేయాలి. చాలా వైవిధ్యాలు చూపిస్తూ ఎక్కడా తేడా కొట్టకుండా నటించాడు. 

రష్మిక మందన్న కూడా నటన బాగా చేసింది. అయితే ఆమె పాత్ర రచన మరింత బలంగా ఉండుండాల్సింది.

తృప్తి డిమ్రి ఒక ప్రత్యేక పాత్రలో కనిపించింది. హీరోతో ఒక పూర్తి నగ్న సన్నివేశంలో కనపడింది. 

అనీల్ కపూర్ నటన పర్ఫెక్ట్. తాత పాత్రలో సురేష్ ఒబేరాయ్ కనిపించారు. అలనాటి పాపులర్ నటుడు ప్రేం చోప్రా కూడా ఒక పాత్రలో దర్శమిచ్చారు. పృథ్వి పాత్రకి పెద్ద నిడివి లేదు. 

బాబీ డియోల్ ఉన్నంతలో ఉనికి చాటుకున్నాడు. 

ఎలా చూసుకున్నా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకి మాత్రం కాదు. అడల్ట్స్ లో కూడా ఎవరికైతే పైన చెప్పుకున్న అంశాల పట్ల ఆసక్తి ఉంటుందో వాళ్లు ట్రై చేయొచ్చు. 

వైల్డ్ యానిమల్స్ ని జూలో చూస్తాం. అత్యంత తీవ్రమైన భావోద్వేగాలతో బతికే మనిషిని చూడాలంటే మాత్రం జూకెళ్లొచ్చినట్టు థియేటర్ కి వెళ్లి చూడాలి. 

బాటం లైన్: క్రూర జంతువు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?