రివ్యూ: అమీ తుమీ
రేటింగ్: 2.75/5
బ్యానర్: ఎ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్
తారాగణం: వెన్నెల కిషోర్, అడివి శేష్, అవసరాల శ్రీనివాస్, తనికెళ్ల భరణి, ఈష రెబ్బా, అదితి తదితరులు
కూర్పు: మార్తాండ్ కె. వెంకటేష్
సాహిత్యం: 'సిరివెన్నెల' సీతారాశాస్త్రి
సంగీతం: మణిశర్మ
ఛాయాగ్రహణం: పి.జి. విందా
నిర్మాత: కె.సి. నరసింహారావు
కథ, కథనం, మాటలు, దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి
విడుదల తేదీ: జూన్ 9, 2017
సీనియర్ మోస్ట్ నటుడు తనికెళ్ల భరణి నుంచి, సునిశిత హాస్యానికి పెట్టింది పేరయిన శ్రీనివాస్ అవసరాల వరకు అందరూ 'ఓవరాక్షన్' చేస్తున్నారంటే అది సలక్షణం కానే కాదు. దాదాపు మొదటి అరగంట సేపు అతికి పరాకాష్ట అన్నట్టనిపించిన సినిమాలోకి ఎంట్రీనిచ్చిన 'వెన్నెల' కిషోర్ ప్రశాంతమైన, ప్రశస్తమైన హాస్యాన్ని పండించి చూసే వాళ్లని సేద తీర్చడంతో పాటు, ఈ సినిమానీ 'సేఫ్' చేసాడు.
హ్యూమర్ అనేది చాలా టిపికల్ ఎలిమెంట్. ఒకరికి జోక్ చెప్తామంటేనే నవ్వొచ్చేస్తుంది. ఇంకొకరికి ఎంత మంచి జోక్ చెప్పినా నవ్వు రాదు. ఒకరికి అపాన వాయువుకి సంబంధించిన హాస్యముంటే పొట్ట చెక్కలైపోతుంది, ఇంకొకరికి మేథస్సు నిండిన హాస్యం వుంటే తప్ప పెదవి పెగలదు. ఎవరి సెన్సాఫ్ హ్యూమర్‌ని బట్టి ఆయా జోకులు పేలుతుంటాయి. మనకి జోక్ అనిపించినది ఎదుటి వారిని నవ్విస్తుందనే గ్యారెంటీ లేదు. నవ్విస్తుందో లేదోననే అనుమానం వున్నపుడు నటీనటులు ఒక పిసరంత ఎక్కువ ట్రై చేసేస్తారు. ఫలితంగా నటించడం మానేసి ఓవరాక్షన్ గీత దాటేస్తారు.
'అమీ తుమీ' మొదలైన దగ్గర్నుంచి హాస్యం కోసం ప్రయాస కనిపిస్తూనే వుంటుంది. ఫేక్ తెలంగాణా యాక్సెంట్‌తో పాటు పనిమనుషులు వేసే కుళ్లు జోకులు, హీరోయిన్లు చేసే ఓవరాక్షను, మామూలుగా మంచి నటులైన తనికెళ్ల, అవసరాల కూడా యాక్షన్ మీటర్‌లో తారాస్థాయిన తచ్చాడడాలు చూస్తే… 'నవ్వుతారా లేదా?' అంటూ మనతో 'అమీ తుమీ' తేల్చుకోవడానికి వచ్చారేమో అనిపిస్తుంది. అన్ని లౌడ్ క్యారెక్టర్ల మధ్యలోకి దిగిన వెన్నెల కిషోర్ తనదైన శైలిలో మంద్ర స్వరంతో మాట్లాడుతూ, తనకే చెల్లిన హావభావాలతో హాస్యం పండిస్తోంటే, మిగతా వారితో మాత్రం ఎందుకంత అతి చేయించారనిపిస్తుంది. ఎంత లౌడ్ సీన్‌లో అయినా కూడా నవ్వించడం కోసం అతిగా ప్రయాస పడకుండా టైమింగ్‌పై డిపెండ్ అయ్యే వెన్నెల కిషోర్ ఈ చిత్రానికి సిసలైన కథానాయకుడు.
శేష్, శ్రీనివాస్ కంటే కూడా కిషోర్‌కే స్క్రీన్ టైమ్ ఎక్కువ ఇచ్చారు. అతి పర్వతాన్ని అధిరోహించడానికి అత్యంత వేగంగా దూసుకుపోతున్న 'అమీతుమీ'కి అడ్డుకట్ట వేసి, కిషోర్ ఒక దారికి తెచ్చాడు. పనిమనిషితో పెళ్లి చూపుల సీన్‌లో అయితే తక్కువ డైలాగ్స్, ఎక్కువ ఎక్స్‌ప్రెషన్స్‌తో కడుపుబ్బా నవ్వించాడు. ఒకే ఒక్క సీన్‌తో అంతకుముందు వరకు పడ్డ యాతనని ఆల్‌మోస్ట్ మరిపించేసాడు. ఇంటర్వెల్ ముందు ఈ సీన్ బ్రహ్మాండంగా పండించేసి, ఫస్ట్ హాఫ్ ముగిసే సమయానికి సినిమాపై ఒక మంచి ఇంప్రెషన్ తెచ్చేసాడు.
ఫస్ట్ హాఫ్‌లో క్యారెక్టర్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ కారణంగా చాలా సమయం వృధా కాగా, ద్వితీయార్థం పూర్తిగా పతాక సన్నివేశం దిశగా సాగిపోయే తంతే వుంటుంది కనుక సాఫీగా సాగిపోతుంది. ఇక్కడికి వచ్చేసరికి మొదటి సగంలో యాతన పెట్టిన క్యారెక్టర్లకి కూడా మనం కాస్తో కూస్తో అలవాటు పడిపోవడం వల్ల ఒక విధమైన రిలీఫ్ వుంటుంది. కథగా చెప్పుకుంటే చాలా చిన్న పాయింట్. ప్రేమించుకున్న రెండు జంటలకి పెద్దల వల్ల సమస్య రావడం. అందులో ఒక అమ్మాయిని పెళ్లి చూపులు చూడ్డానికి వచ్చిన వాడిని బకరాని చేసి ఆ రెండు జంటలు ఒకటవడం. ఒక్క మాటలో చెప్పాలంటే 'వినోదం' సినిమాలో ప్రకాష్‌రాజ్ త్రెడ్‌ని డెవలప్ చేసి పూర్తి సినిమా చేస్తే అది 'అమీ తుమీ' అవుతుంది.
హాస్యం విషయంలో తనదైన శైలి వున్న మోహనకృష్ణ ఇంద్రగంటి ఈ చిత్రం వరకు తన హ్యూమర్ అంతా 'శ్రీ చిలిపి' క్యారెక్టర్ కోసమే వినియోగించినట్టు అనిపిస్తుంది. మిగతా పాత్రలని ఇంతే హాస్యభరితంగా తీర్చిదిద్దినట్టయితే ఫోర్స్‌డ్ హ్యూమర్‌కి, ఓవర్ ది బోర్డ్ వెళ్లిన సీన్లకీ ఆస్కారం వుండేది కాదు. మాటల గారడీతో పలుమార్లు తన రచనా చమత్కారాన్ని చూపించిన మోహనకృష్ణ ఇంద్రగంటి ఈ విషయంలోను ఒక మీటర్ మెయింటైన్ చేయలేదు. కొన్ని సన్నివేశాల్లో సంభాషణలు, వర్డ్ ప్లే అద్భుతంగా పేలితే కొన్ని సీన్లలో పూర్తిగా తేలిపోయి, నవ్వించడానికి అతిగా ప్రయాస పడుతున్నట్టు అనిపించాయి.
కథాపరంగా ఎక్కువ మేటర్ లేకపోవడంతో మొదట్లో సుదీర్ఘమైన సన్నివేశాలు, అనర్గళమైన సంభాషణలతో విసిగించారు. ఇంటర్వెల్ ముందు వెన్నెల కిషోర్, పని మనిషి మధ్య సన్నివేశంలో పండించిన హాస్యం చూస్తే అంతవరకు కనీసం ఇందులో పదో వంతు కామెడీ ఎందుకు చేయలేకపోయారనిపిస్తుంది. ద్వితీయార్థం మొత్తం క్లయిమాక్స్ సీన్ వైపు సాగే ప్రీ క్లయిమాక్స్ వ్యవహారంలానే వుంటుంది. హాస్యం పండించడానికి అవసరమైన సరంజామా అంతా సిద్ధం చేసుకుని కూడా దాని జోలికి పోకుండా పతాక సన్నివేశం కోసం ప్రిపరేషన్‌తోనే సరిపెట్టేయడం నిరాశ పరుస్తుంది. కాకపోతే వెన్నెల కిషోర్ క్యారెక్టర్ మీది నుంచి ఫోకస్ తీయకపోవడం, అతని క్యారెక్టర్‌తోనే స్టోరీని డ్రైవ్ చేయడం వల్ల బలహీనతలు చాలా వరకు కవర్ అయ్యాయి. ఫస్టాఫ్‌లో పెళ్లి చూపుల సీన్‌లానే, సెకండాఫ్‌లో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సీన్ ఒకటి బాగా నవ్విస్తుంది. క్లయిమాక్స్ ఏమిటనేది ముందే ఊహించేయవచ్చు కనుక అక్కడెలాంటి సర్‌ప్రైజులు లేవు.
అన్ని లౌడ్ క్యారెక్టర్స్ ఒకే చోటికి చేరిన పతాక సన్నివేశంలో కూడా వెన్నెల కిషోర్ తన కంపోజర్ మెయింటైన్ చేస్తూ అక్కడా తనే హైలైట్ అయ్యాడు. ముందే చెప్పినట్టు అవసరాల, తనికెళ్ల లాంటి నటులే ఓవరాక్షన్ చేసినపుడు, ఈష, అదితి లాంటి వాళ్ల గురించి ప్రత్యేకించి చెప్పేదేముంది. అడివి శేష్ ఫర్వాలేదనిపించాడు కానీ అదితి సవతి తల్లి పాత్ర పోషించిన నటి ఆ తుపాకీ పట్టుకుని చేసిన ఓవరాక్షన్ ముందు మిగిలిన వాళ్లు చేసింది నథింగ్ అనిపిస్తుంది.
ఇంద్రగంటి రాసిన సంభాషణలు కొన్ని బాగా నవ్వించగా, మణిశర్మ పాటలు సోసోగా వున్నాయి. ఎక్కువ లొకేషన్లు లేని చిత్రాన్ని పి.జి. విందా తన సినిమాటోగ్రఫీ మాయతో బాగానే ఆకట్టుకున్నాడు. మినిమమ్ గ్యారెంటీ సినిమాలు రూపొందించే మోహనకృష్ణ ఇంద్రగంటి ఒకే తరహా చిత్రాలు చేయడానికి ఇష్టపడరు. జెంటిల్‌మేన్ తర్వాత ఈ తరహా కామెడీ తీయడమే ఆయన తత్వాన్ని తెలియజేస్తుంది. శ్రీ చిలిపి పాత్ర చిత్రణ, ఆ క్యారెక్టర్ డ్రైవ్‌లో ఇంద్రగంటి రచనా పటిమ తెలుస్తుంది. అయితే లౌడ్ కామెడీపై ఆధారపడకుండా సటిల్‌గా వినోదాన్ని అందించడానికి ప్రయత్నించినట్టయితే మెరుగైన ఎక్స్‌పీరియన్స్ వుండేది. కామెడీ అప్పుడప్పుడూ లౌడ్ అవడం వల్ల సమస్య వుండదు కానీ, ఎప్పుడో కానీ డౌన్ అవ్వలేదు అనిపిస్తేనే ప్రాబ్లమ్.
స్టార్లు లేని ఈ చిత్రం నుంచి ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్లు వుండవు కనుక టైమ్ పాస్ అయిపోయిందనిపిస్తే ప్రేక్షకులు శాటిస్‌ఫై అయిపోతారు. మామూలుగా అయితే ఈ కామెడీ చతికిలపడిపోయేదేమో కానీ వెన్నెల కిషోర్ సింగిల్ హ్యాండ్‌తో నిలబెట్టేసి, శాటిస్‌ఫయింగ్ హ్యూమర్‌తో పంపించడం వల్ల అమీ తుమీని ఒక్కసారి చూసేందుకు సంశయాలేమీ అక్కర్లేదు.
బాటమ్ లైన్: ఇది వెన్నెల కిషోర్ షో!
– గణేష్ రావూరి