చిత్రం : ఐస్‌క్రీమ్
రేటింగ్: 0/5
బ్యానర్: భీమవరం టాకీస్
తారాగణం: నవదీప్, తేజస్వి తదితరులు
సంగీతం: ప్రద్యోధన్
కూర్పు: సంగా ప్రతాప్ కుమార్
ఛాయాగ్రహణం: అంజి
నిర్మాత: తుమ్మలపల్లి రామ సత్యనారాయణ
దర్శకత్వం: రామ్‌గోపాల్‌వర్మ
విడుదల తేదీ: జులై 12, 2014
రామ్‌గోపాల్‌వర్మతో సినిమా తీసి చేతులు కాల్చుకున్నానని చెప్పినా… రామ్‌గోపాల్‌వర్మ సినిమా చూసి బుర్ర పాడు చేసుకున్నానని చెప్పినా.. జాలి పడే రోజులు ఏనాడో పోయినియ్. ఇప్పుడా పనులు చేయడం స్వయంకృతాపరాధాలు కింద కౌంట్ అవుతాయ్. వర్మకేముంది… ఏదైనా కొత్త కెమెరా టెక్నిక్ ఉందని తెలిస్తే అది ఉపయోగించి సినిమా తీస్తే ఎలాగుంటుందో చూసుకోవడానికి సరదాగా సినిమాలు తీసుకుంటాడు. దానికి పెట్టుబడి పెట్టిన నిర్మాతది, అది చూడ్డానికి టికెట్ కొన్న ప్రేక్షకుడిది.. సరదా కాదు.. జస్టు దురద!!!
కథేంటి?
రేణు (తేజస్వి), విశాల్ (నవదీప్) లవర్స్. రేణు ఇంట్లో ఎవరూ లేరు. విశాల్ ఆమెని ఇంట్లో డ్రాప్ చేసి వెళ్లాడు. ఆ ఇంట్లో కొన్ని దెయ్యాలుంటాయ్. ఎవరో తలుపు కొడతారు.. రేణు మెట్లు దిగుతుంది. కీ హోల్‌లోంచి చూస్తుంది. తలుపు తీస్తుంది. ఎవరూ ఉండరు. రేణు మెట్లెక్కుతుంది. స్నానం చేస్తుంది. బట్టలేసుకుంటుంది. ఐస్‌క్రీమ్ తింటుంది. తలుపు కొడతారు. చూస్తుంది. ఎవరూ ఉండరు. మళ్లీ పైకెక్కుతుంది. స్నానం చేస్తుంది. తలుపు సౌండ్ అవుతుంది. మెట్లు దిగుతుంది. తీసి చూస్తుంది. ఎవరూ ఉండరు.
కథ ఏంటో రాయకుండా ఈ సొద అంతా ఏంటని అనుకుంటున్నారా? అది మా వల్ల కాదు కానీ… సినిమా చూసే ‘సరదా’ ఉంటే చూసి తెలుసుకోండి.
కళాకారుల పనితీరు:
తేజస్వి కాళ్లు భలేగున్నాయ్. ఆమె కాళ్లని అందంగా ఉంచుకోవడానికి తీసుకునే శ్రద్ధని ప్రశంసించాలి. ఆమె దగ్గర చిట్టి పొట్టి నిక్కర్ల కలెక్షన్ కూడా బాగున్నట్టుంది. అవి వేసుకుని ఎలా నడవాలో బాగా నడిచి చూపించింది. అసలు తేజస్వి పాదాలున్నాయండీ… ఏంటీ నటన గురించి చెప్పకుండా ఈ కాళ్ల గురించిన నాన్సెన్స్ ఏంటని అంటారా? పాపం ఆ అమ్మాయి బాగానే ఎక్స్‌ప్రెషన్లు అవీ ఇచ్చి ఉంటుంది. తనకి మాత్రం ఏం తెలుసు కెమెరా తన కాళ్లట్టుకు తిరుగుతోందని!
నవదీప్ తలుపు కొట్టడంలో ఎక్స్‌పర్టు. ఈ విషయం మనకి ఇంతకుముందు తెలిసి ఉండదు కదా. దానిని చూపించడానికే వర్మ ఈ సినిమా తీసినట్టున్నాడు. అసలు నవదీప్ తనలోని ఇంత మంచి టాలెంట్‌ని ఇన్నాళ్లు ఎందుకు దాచుకున్నాడో అర్థం కాదు. తలుపు కొట్టడానికి ఎంత తీసుకున్నాడో ఏంటో కానీ.. భలే కొట్టాడులెండి. ఒక్కోసారి అతను తలుపు కొట్టకుండానే తేజస్వి తలుపు తీసేస్తుంది… అదే కొంచెం ఇబ్బంది పెడుతుంది.
సాంకేతిక వర్గం పనితీరు:
ఫ్లో కామ్ టెక్నాలజీ అంట… పై గదిలో కెమెరా కదలడం మొదలుపెట్టి.. కిందకి దిగి, కిచెన్‌లోకి వెళ్లి… డ్రాయింగ్ రూమ్ అంతా సర్కిట్లు కొట్టి, మళ్లీ పైకెళ్లి, ఎక్కడ మొదలైందో అక్కడ ఆగుతుంది. సినిమాలు తీయడానికి పనికొస్తుందో లేదో తెలీదు కానీ… ఈ కెమెరాకి చీపురొకటి కట్టి వదిలితే ఇల్లంతా అద్దంలా తుడిచి పారేస్తుంది. ఫ్లో సౌండ్ అని ఏదో అన్నారు. చెక్కలు, గరిటెలు, కప్పులు వగైరా ముందేసుకుని కూర్చుని… సినిమా చూస్తూ ఏది తోస్తే అది నేలకేసి కొట్టడమే ఈ టెక్నిక్ ఏమో.
ఈ తలుపు కొట్టడం, మెట్లు ఎక్కడం, స్నానం చేయడం, పడుకోవడం… తదితర సీన్లన్నీ తీసి ఎడిటర్ చేతిలో పెడితే వాటిని వరసలో పెట్టడానికి అతనెంత ఇబ్బంది పడ్డాడో ఏంటో? అయినా గంటకోసారి స్నానం చేసి, అరగంటకో సారి ఐస్‌క్రీమ్ తినేసి తొంగునేది ప్రధాన పాత్రధారి అయినప్పుడు ఏ ఎడిటర్ అయినా ఇంతకంటే ఏం చేయగలడు పాపం.
రామ్‌గోపాల్‌వర్మ మామూలు తెలివైనోడు కాదు. ఎందుకంటే ఎంత తెలివైనోడు అయినా ఎవరిని అయినా ఒకసారి లేదా రెండుసార్లు మహా అయితే నాలుగైదు సార్లు వెధవలని చేయగలడు. కానీ వర్మ తన ప్రతి సినిమాతో ప్రేక్షకుల్ని వెర్రి వెంగలాయిలని చేస్తూనే ఉన్నాడు. అతని సినిమాలు చూసే హింసని తప్పించుకుని చాలా మంది తిరుగుతున్నా కానీ ఇప్పటికీ తన మాయలో పడి టికెట్లు కొంటోన్న తింగరిమేళాలు కూడా ఉన్నారు. ఈ విషయంలో మాత్రం వర్మకి క్రెడిట్ ఇచ్చేయాలి.
హైలైట్స్:
– తేజస్వి లెగ్స్
– నవదీప్ తలుపుకొట్టే టాలెంట్
డ్రాబ్యాక్స్:
– తేజస్వి కాళ్లని ఇంకాసేపు చూపించి ఉండాల్సింది
– నవదీప్‌తో ఇంకొన్నిసార్లు తలుపు కొట్టిస్తే బాగుండేది
విశ్లేషణ:
ఐస్‌క్రీమ్ ఆద్యంతం ప్రేక్షకుల్ని గెస్సింగ్ మోడ్‌లో ఉంచుతుంది. తలుపు చప్పుడైన ప్రతిసారీ ఈసారి ఎవరైనా ఉంటారా, ఉండరా… ఉంటే నవదీప్ ఎన్నిసార్లు ఉంటాడు? వేరే వాళ్లు ఎన్ని సార్లు వస్తారు? ఇలా టెన్షన్‌తో గోళ్లు కొరికేసుకోవాలి. తేజస్వి బెడ్‌రూమ్‌లోకి వెళితే… ఇప్పుడు స్నానం చేస్తుందా, లేక పడుకుంటుందా, లేక బాత్రూమ్‌లోకెళ్లి ట్యాప్ కడుతుందా? ఈ టెన్షన్‌లో గోళ్లతో పాటు వేళ్లు కూడా నమిలేయాల్సి వస్తుంది.
హారర్ సినిమా కాబట్టి ఇందులో దెయ్యాలుంటాయి. అమ్మో అని భయపడిపోకండి. అన్నీ ఫ్రెండ్లీ దెయ్యాలే. ఒక దెయ్యం స్నానం చేస్తుంటే చూస్తుంటుంది. ఇంకోటేమో పేరు పెట్టి పిలుస్తుంటుంది. మరోటి తలుపు కొడుతూ అల్లరి చేస్తుంటుంది. మరోటి ఇంటి పనులన్నీ చేసి పెడుతుంది. ఇంకో పిల్ల దెయ్యం దాగుడు మూతలు ఆడుతుంటుంది. చివరి వరకు ఇదే తంతు. ఇక క్లయిమాక్స్ ఉంటుందండీ… పీక్స్ అంతే. దాని గురించి వర్ణించడానికి మాకొచ్చిన తెలుగు సరిపోదు. చూసి తరించాల్సిందే.
ఇక ఇందులో మంచి సందేశం కూడా ఉంది. ఐస్‌క్రీమ్ తింటే పీడకలలు వస్తాయనే బలమైన సందేశాన్ని ఈ కథలో నిక్షిప్తం చేసాడు వర్మ. అలాగే ఈ సినిమా వల్ల కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. ఇకపై పిల్లల్తో ఐస్‌క్రీమ్ మాన్పించడం చాలా ఈజీ. ఈ సినిమా ఒక్కసారి చూపిస్తే ఇక జీవితంలో మళ్లీ ఐస్‌క్రీమ్ పేరెత్తరు.
సినిమా కంటే ‘‘ఈ నగరానికి ఏమైంది…’’ లాంటి యాంటీ స్మోకింగ్ యాడ్స్ చాలా బాగున్నాయని అనిపించేలా చేస్తున్న వర్మగారి టాలెంట్‌కి ఎవరైనా సలామ్ చెప్పాలి. ఎంత టార్చర్‌ని అయితే మనం తట్టుకోగలమో టెస్ట్ చేసుకోవడానికి అయినా వర్మ సినిమాలు వదలకుండా చూస్తుండాలి. తమ కాలి గోళ్లలో ఎక్కడైనా మురికి ఉందేమో పరికించి చూసుకోవడానికి, తమకి పెడిక్యూర్ చేసే వాళ్లు సరిగ్గా పని చేస్తున్నారో లేదో స్పష్టంగా అధ్యయనం చేసుకోవడానికి హీరోయిన్లు అప్పుడప్పుడూ అయినా వర్మ సినిమాలు చేస్తుండాలి.
బోటమ్ లైన్: నవనాడుల్ని దహించేసే ఐస్‌క్రీమ్!
– జి.కె.