Advertisement

Advertisement


Home > Politics - Andhra

కూటమికి పవన్ గండం: భళ్లు మంది బాసూ.. గళాసు!

కూటమికి పవన్ గండం: భళ్లు మంది బాసూ.. గళాసు!

‘‘ఘల్లు మంది బాసు గళాసు, థ్రిల్లు గుంది డోసు పటాసు’’ అంటూ ఘర్షణ సినిమాలో ఓ పాట ఉంటుంది. గళాసు ఘల్లు మనే సంగతి ఏమో గానీ.. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో గళాసు గుర్తు మాత్రం భళ్లు మంటోంది. పగిలిన ఆ గళాసుముక్కలు కూటమి పార్టీలకే మానని గాయాన్ని చేసే పరిస్థితి కనిపిస్తోంది.

గత ఎన్నికల్లో నేరుగా తానే ముఖ్యమంత్రి అయిపోవాలని పవన్ కల్యాణ్ ప్రదర్శించిన అత్యుత్సాహం దెబ్బకి.. అసలు ఇప్పుడు కూటమిలోని మిగిలిన పార్టీలు తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలకు భారీ దెబ్బ పడే ప్రమాదం కనిపిస్తోంది.

పాపం పవన్ కల్యాణ్ దళం.. ఇల్లలకగానే పండగ కాదు అనే సామెతను గుర్తు చేసుకోవాల్సిన సందర్భం ఇది. పవన్ తనను మించిన నాయకుడు లేడన్నట్టుగా 2019లో ఒంటరిగా పోటీచేశారు. కానీ రాష్ట్రవ్యాప్తంగా 6 శాతం ఓట్లు మాత్రమే సాధించారు. ఒక్క ఎమ్మెల్యేనే గెలిచారు. అదే ఇప్పుడు పార్టీకి.. కాదు కాదు, కూటమికే పెద్ద ప్రమాదంగా మారుతోంది. 

ఒక పార్టీ ఎన్నికల్లో పోటీచేసిన తర్వాత రాష్ట్రంలోని మొత్తం చెల్లిన ఓట్లలో 6 శాతం ఓట్లు సాధించడంతో పాటు కనీసం ఇద్దరు ఎమ్మెల్యేలైనా గెలిచినప్పుడు మాత్రమే.. అది గుర్తింపు ఉన్న పార్టీ అవుతుంది. గుర్తింపు ఉన్న పార్టీలకు మాత్రమే శాశ్వత గుర్తు దక్కుతుంది. జనసేన ఇంకా గుర్తింపులేని పార్టీగానే కొనసాగుతోంది.

మొన్నటి వరకు వారికి అసలు గ్లాసు గుర్తు దక్కుతుందా లేదా అనే టెన్షన్ నడిచింది. మొత్తానికి జనసేనతో పాటు అనేక మందికి రాష్ట్రమంతా వారి అభ్య‌ర్థుల‌కు ఒకే గుర్తు కేటాయించేలా ఈసీ ఆదేశాలు ఇచ్చింది. అలా జనసేనకు వారి గ్లాసు గుర్తు తిరిగి దక్కింది. కానీ ముందే చెప్పినట్టు ఇల్లలకగానే పండగ కాదు.

ఇప్పుడు ఈసీ కొత్త ఆదేశాలు ఇచ్చింది. వాటి ప్రకారం.. జనసేన పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో తప్ప మిగిలిన నియోజకవర్గాల్లో గాజు గ్లాసు కూడా ఫ్రీ సింబల్ కింద అందుబాటులో ఉంటుంది. అంటే ఇండిపెండెంట్లు ఎవరైనా సరే.. ఆ గుర్తు తీసుకోవచ్చు. అదే జరిగిందంటే.. జనసేన పోటీ చేయని నియోజకవర్గాల్లోని తెలుగుదేశం లేదా భాజపా అభ్యర్థుల నోళ్లలో మన్ను పడుతుంది.

గ్లాసు గుర్తు కనిపిస్తే చాలు.. ముందూ వెనుకా చూసుకోకుండా దానికి ఓటు వేసేసేవారు.. ప్రతి నియోజకవర్గంలో కనీసం వెయ్యి రెండు వేల మంది ఉంటారనుకున్నా.. ఆ తేడా కూటమిలోని తెలుగుదేశం, భాజపాలను పూర్తిగా ముంచేస్తుంది. ఇప్పుడు కూటమిని ఆ భయం వెన్నాడుతోంది. ఈసీని ఆశ్రయించి.. జనసేన పోటీచేసే 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాల్లో కాకుండా మిగిలిన ఎక్కడా అసలు గాజు గ్లాసు గుర్తు అందబాటులో లేకుండా కోరాలని కూటమి నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?