రివ్యూ: యుద్ధం శరణం
రేటింగ్: 2/5
బ్యానర్: వారాహి చలనచిత్రం
తారాగణం: నాగచైతన్య, శ్రీకాంత్, లావణ్య త్రిపాఠి, రేవతి, రావు రమేష్, వినోద్‌కుమార్, మురళి శర్మ, ప్రియదర్శి, కిరీటి తదితరులు
కథ: డేవిడ్ నాధన్
మాటలు: అబ్బూరి రవి
కూర్పు: కృపాకరన్
సంగీతం: వివేక్ సాగర్
ఛాయాగ్రహణం: నికేత్ బొమ్మి
నిర్మాత: రజని కొర్రపాటి
కథనం, దర్శకత్వం: కృష్ణ ఆర్‌వి మరిముత్తు
విడుదల తేదీ: సెప్టెంబర్ 8, 2017
ఈ సినిమాలో చెప్పినట్టు ''తప్పించుకునే ప్రతివాడికీ రెండు ఆప్షన్లుంటాయి… పారిపోవడం లేదా దాక్కోవడం''. అలాగే 'యుద్ధం శరణం'కి వెళ్లిన వాళ్లకీ రెండు ఆప్షన్లుంటాయి… ఏమీ లేదని మధ్యలోనే జారుకోవడం, లేదా చివరి వరకు కూర్చుని ఏం లేదని తెలుసుకోవడం.
మొదలు పెట్టడంతోనే అటెన్షన్ మొత్తం రాబట్టుకునే ఈ చిత్రం మొదలైన కాసేపటికే అది సాంతం కోల్పోతుంది. 'ఏదో జరిగింది' అనే ఆసక్తికరమైన నోట్‌లో మొదలై, 'ఏం జరిగితే ఏముంది?' అని నీరసపడిపోయే తీరున ముందుకి కదులుతుంది. మామూలుగా ఫ్యామిలీ డ్రామా సెటప్‌లో ఒక సీన్ కాకపోతే ఒక సీన్, లేదా ఒక కాన్వర్‌జేషన్ అంటూ ఏదో ఒకటి అంతో ఇంతో ఆకట్టుకుంటూ వుంటుంది.
కానీ ఇందులో స్నేహితులు మాట్లాడుకుంటున్నా సరదాగా అనిపించదు, కుటుంబంతో కలిసి నవ్వుకుంటున్నా ఆహ్లాదం వుండదు, ప్రేమికులు స్వీట్ నథింగ్స్ షేర్ చేసుకుంటున్నా వీసమెత్తు వినోదముండదు. థ్రిల్లర్ సినిమా అంటే స్పీడ్ బోట్ మీద రైడ్‌లా థ్రిల్లింగ్‌గా వుంటుందని ఆశిస్తాం కానీ ఇది సైక్లింగ్ బోట్‌లా ఎంతకీ ముందుకి కదలదు.
నిదానంగా సాగే సన్నివేశాలు దర్శకుడి 'కట్' కోసం వేచి చూస్తూ నీరసం తెప్పించేస్తాయి. కుటుంబం, స్నేహితులు, డ్రోన్ కెమెరా మేకర్ అవ్వాలనే లక్ష్యమున్న హీరో, కొత్తగా వచ్చిన అమ్మాయితో ప్రేమ… వీటన్నిటికీ తోడు పరమ కర్కశుడైన విలన్. ఇంత సరంజామా వున్నపుడు సన్నివేశాలు జలపాతంలా ఫ్రీగా అలా ఫ్లో అయిపోవాలి. కానీ ఇంత సెటప్ పెట్టుకుని కూడా దీనిని నత్తలు సైతం గర్వపడే వేగంతో నడిపిన విధానం ఆశ్చర్యపరుస్తుంది. సాంకేతికంగా చిత్రం ఉన్నతంగా వున్నా కానీ అతి కీలకమైన కథాగమనం విపరీతంగా విసుగెత్తిస్తుంది.
రొటీన్ కథని ఆసక్తికరంగా మలిచేందుకు బ్యాక్ అండ్ ఫోర్త్ స్క్రీన్‌ప్లే టెక్నిక్ వాడినప్పటికీ ఆ ట్రాన్సిషన్ స్మూత్‌గా లేకపోవడం వల్ల కన్‌ఫ్యూజింగ్‌గా తయారైంది. ఫస్ట్ హాఫ్ ఫ్యామిలీ డ్రామా పండకపోయినా, మందకొడి కథనం వల్ల విసుగెత్తించినా, ద్వితీయార్ధంలో థ్రిల్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తారెవరైనా. హీరోని డ్రోన్ కెమెరా మేకర్‌గా చూపించి, విలన్‌ని అంత నెట్‌వర్క్ వున్న క్రిమినల్‌గా ఎస్టాబ్లిష్ చేసినపుడు ఇద్దరి మధ్య యుద్ధం అంటే రసవత్తరంగా వుండి తీరాలి. కానీ నీరసంగా సాగే ఈ యుద్ధం ఆపేయమని ప్రేక్షకులు శరణు కోరే రీతిన తయారైంది. కొత్త కొత్త టార్చర్ టెక్నిక్కులతో హీరో విలన్స్‌ని వేధిస్తోంటే, ఈ సినిమా ఎక్స్‌పీరియన్స్ చేసే కంటే ఆ టెక్నిక్కులేవో ట్రై చేయాలనిపిస్తుంది.
విలన్‌ని తెలివిగా దెబ్బ కొడతాడని ఎక్స్‌పెక్ట్ చేస్తే అతనో కన్వీనియంట్ దారి ఎంచుకుంటాడు. దీంతో ఇక యుద్ధానికి స్కోప్ లేకుండా పోయింది. ఈ సినిమాకి ఆఖరి హోప్‌గా మిగిలిన హీరో-విలన్ ముఖాముఖి కూడా ఆకట్టుకోలేకపోయింది. అంత వరకు ఎంతటి వాడికైనా ఆర్డర్లేసే విలన్ కాస్తా హీరోని 'ఏం చేస్తున్నావు' అంటూ బేలగా మారిపోతాడు.
నువ్వేమి చేసినా నాకు తెలిసిపోతుందనే డాంబీకం పోయినవాడే… 'నీ వాళ్లని ఎక్కడ దాచావు' అంటూ అడుగుతాడు. శ్రీకాంత్‌ని విలన్‌గా పెట్టుకోవడం, అతనికి మంచి గెటప్ సెట్ చేయడం వరకు బాగానే వుంది కానీ ఇంత వీక్ క్యారెక్టరైజేషన్ రాసుకోవడం వల్ల ఈ అటెంప్ట్ వృధా అయిపోయింది. శ్రీకాంత్ విలన్‌గా ముద్ర వేయడానికి తన శక్తి మేర కృషి చేసినప్పటికీ అతను పోషించిన 'నాయక్' పాత్ర తన శ్రమని వృధా చేసేసింది.
నాగచైతన్య 'సాహసం శ్వాసగా సాగిపో' తర్వాత మళ్లీ ఈ కథని ఎంచుకోవడం ఓ విధంగా సాహసమే. ఆల్రెడీ అటెంప్ట్ చేసి ఫెయిలైన తరహా కథని ఇంకోసారి ట్రై చేయడం, ఇది దానికంటే వీక్ ప్లాట్ అవడం వింతగా వుంది. నటుడిగా తనకి ఎలాంటి స్కోప్ ఇవ్వని క్యారెక్టర్ అవడంతో చైతన్యకి ఇందులో 'యాక్షన్… కట్' డైరెక్షన్లు పాటించడం మినహా పెద్ద పని పడలేదు. హీరోయిన్ వుండాలి కనుక లావణ్య వుంది కానీ, ఈ కథలో ఆమెకి చోటు లేదు. మామూలుగా ఎలాంటి పాత్రనైనా మెప్పించే మురళిశర్మ ఇందులో అయోమయంగా కనిపించాడు.
పాటలు క్యాచీగా లేవు. నేపథ్య సంగీతం కూడా మెప్పించదు. ఛాయాగ్రహణం మాత్రం చాలా బాగుంది. డార్క్ థ్రిల్లర్‌లా తీర్చిదిద్దిన విధానం, లైటింగ్ స్కీమ్స్ ఆకట్టుకుంటాయి. దర్శకుడికి టెక్నికల్‌గా రిచ్‌గా తీర్చిదిద్దే టాలెంట్ వున్నప్పటికీ స్క్రీన్‌ప్లే రైటర్‌గా విఫలమయ్యాడు. డేవిడ్ నాధన్ రాసిన కథలో చెప్పుకోతగ్గ కొత్త విషయమేమీ లేకపోవడంతో స్క్రీన్‌ప్లే మీదే డిపెండ్ అయిన ఈ చిత్రానికి సన్నివేశాలు కూడా సరిగా కుదర్లేదు. అబ్బూరి రవి రాసిన కొన్ని మంచి సంభాషణలు మినహా ఇందులో చెప్పుకోతగ్గ విశేషాలేం లేవు.
ఉత్కంఠభరితంగా సాగడం ఒక్కటే ఇలాంటి తరహా చిత్రాలకి యుఎస్‌పి అవుతుంది. కానీ ఉత్కంఠ అనే దానికి చోటే ఇవ్వని ఈ యుద్ధం ఉద్రేకపరచకపోగా, ఉత్సాహాన్ని హరించేస్తుంది. ప్రేమకథల్లోకి అలవోకగా ఇమిడిపోయే చైతన్య జోనర్ మారిన ప్రతిసారీ రాంగ్ స్టెప్‌లు వేస్తున్నాడని ఇది ఇంకోసారి నిరూపిస్తుంది.
బాటమ్ లైన్: ఉత్కంఠ లేని యుద్ధం!
– గణేష్ రావూరి