Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: అజ్ఞాతవాసి

సినిమా రివ్యూ: అజ్ఞాతవాసి

రివ్యూ: అజ్ఞాతవాసి
రేటింగ్‌: 2/5
బ్యానర్‌: హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌
తారాగణం: పవన్‌కళ్యాణ్‌, కుష్బూ, ఆది పినిశెట్టి, కీర్తి సురేష్‌, అను ఎమాన్యుయేల్‌, బొమన్‌ ఇరానీ, తనికెళ్ల భరణి, మురళి శర్మ, రావు రమేష్‌, వెన్నెల కిషోర్‌ తదితరులు
కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
కళ: ఏ.ఎస్‌. ప్రకాష్‌
సంగీతం: అనిరుధ్‌
ఛాయాగ్రహణం: వి. మణికండన్‌
నిర్మాత: సూర్యదేవర రాధాకృష్ణ
రచన, దర్శకత్వం: త్రివిక్రమ్‌
విడుదల తేదీ: జనవరి 10, 2018

'కొత్త ఐడియా రానపుడు పాత ఐడియానే ఫాలో అయిపోవాలి'... అజ్ఞాతవాసిలో అండర్‌లైన్‌ చేసుకోవాల్సిన డైలాగ్‌ ఇది. ఎందుకంటే ఈ చిత్రం చూస్తున్నంత సేపు ఏదో ఒక సమయంలో ఈ మాట తలపుకొస్తుంటుంది. పవన్‌కళ్యాణ్‌-త్రివిక్రమ్‌... ఈ కాంబినేషన్‌లో వచ్చిన గత చిత్రం 'అత్తారింటికి దారేది'. అప్పటికి ఇండస్ట్రీ రికార్డులన్నీ తుడిచి పెట్టేసింది. మళ్లీ ఈ కలయికలో సినిమా అంటే ఖచ్చితంగా అంచనాలు తారాస్థాయిలో వుంటాయి. మళ్లీ పవన్‌తో సినిమా అంటే ఏం చేయాలని ఆలోచిస్తున్నపుడు త్రివిక్రమ్‌కి ఈ డైలాగ్‌ తట్టి వుండాలి. లేదంటే ఈ చిత్రం చూస్తున్నపుడు 'అత్తారింటికి దారేది' ఛాయలు కాదు కాదు... ముద్రలు బలంగా కనిపిస్తూనే వుంటాయి.

'లార్గో వించ్‌' అనే ఫ్రెంచ్‌ సినిమా కథనుంచి ఇన్‌స్పయిర్‌ అయి దానికి అత్తారింటికి దారేది తరహా టచ్‌ ఇస్తే అది అజ్ఞాతవాసి అయింది. అయితే అత్తారింటికి దారేది తమ కుటుంబాన్ని వదిలిపోయిన మేనత్త పంతాన్ని విడిపించి ఎలాగైనా తాతయ్య కోరిక తీర్చాలని వచ్చే మేనల్లుడు/మనవడి కథ. కానీ ఇక్కడ తన తండ్రి సోదరుడిని చంపేసి తమ వ్యాపార సామ్రాజ్యాన్ని కాజేయాలని చూస్తున్నది ఎవరనేది తెలుసుకోవడానికి అజ్ఞాతాన్ని వీడి వచ్చే కొడుకు కథ. ఆ ముందు కథలో హీరో ఎలా ప్రవర్తించినా, ఎంత కామెడీ చేసినా పాత్రౌచిత్యం దెబ్బ తినదు.

కానీ ఈ రెండవ కథలో హీరో ఒక పెయిన్‌ అనుభవించి వస్తున్నాడు. తనకి తీరని అన్యాయం చేసిన వారిని కనిపెట్టడానికి వచ్చాడు. అలాంటివాడు 'అతడు'లోని హీరో మాదిరిగా కార్యోన్ముఖుడిగానో, అంతర్ముఖుడిగానో అనిపించాలే తప్ప అతని సమస్యని, ఆవేదనని సీరియస్‌గా తీసుకోనివ్వని ఎంటర్‌టైనర్‌లా కనిపించకూడదు. త్రివిక్రమ్‌ రచన అందించిన 'జై చిరంజీవ' చిత్రంలోను కథానాయకుడి తీరు ఇలాగే వుంటుంది. జీవితంలో అతి పెద్ద ట్రాజెడీ ఫేస్‌ చేసిన హీరో రివెంజ్‌ కోసం వచ్చి కామెడీ చేసేస్తూ వుంటాడు.

మాంఛి యాక్షన్‌ బ్లాక్‌తో హీరోని పరిచయం చేసి, 'కొడుకే కోతకు కదిలే' అంటూ బరువైన వాక్యాలతో అతడు 'నడిచే మారణాయుధం' అన్న ఫీలింగ్‌ తెచ్చి, ప్రతి చిన్న సౌకర్యం కోసం మినీ సైజ్‌ యుద్ధమే చేయాలనే మాటలు చెప్పించి... ఆ వెంటనే, మరుక్షణంలోనే అతడిని కామెడీ మూడ్‌లోకి 'తోసేయడం' ఏమాత్రం సమంజసమనిపించదు. అంత మూడ్‌ షిఫ్ట్‌ వుండాలనుకున్నపుడు కనీసం తేరుకునే అవకాశం ప్రేక్షకులకైనా ఇవ్వాలి. ఇలాంటివన్నీ కూడా క్షమించేసి సినిమాని సినిమాగా ఎంజాయ్‌ చేసేయవచ్చు. అదెప్పుడు? చేస్తోన్న కామెడీ లాజిక్కులని మర్చిపోయేంత గొప్పగా వున్నపుడు. చూస్తోన్న సన్నివేశాలు మదికి వినోదాన్ని ఆస్వాదించే సౌకర్యం తప్ప మరే విధమైన ఆలోచనల యుద్ధాలు చేయనివ్వనపుడు.

మామూలుగా 'మామూలు' సన్నివేశాల్లోను తన మాటల విరుపులతో, తన మాయాజాలంతో కనికట్టు చేసేసి మెప్పించేసే త్రివిక్రమ్‌ ఈసారి తనలోని రచయితని అజ్ఞాతవాసానికి పంపించేసాడా అని అనుమానం కలిగేలా సన్నివేశాలని తీర్చిదిద్దాడు. హీరో ఏబీ ఆఫీస్‌లో ఉద్యోగం సాధించే ప్రహసనం, హీరోయిన్లతో సాగించే ప్రేమాయణం ఏదీ కూడా అలరించదు, ఆకట్టుకోదు. విలన్‌ని ఎంటర్‌ చేసినా, బ్యాక్‌గ్రౌండ్‌లో 'యాక్షన్‌' నడుస్తున్నా కానీ ఎక్కడా ఉత్కంఠ రేకెత్తదు, ఆసక్తి ఆచూకీ దొరకదు. ఎప్పుడో ఇంట్రడక్షన్‌ సీన్‌ తర్వాత చల్లబడిపోయిన వారికి ఇంటర్వెల్‌ సీన్లో కుష్బూ చెప్పే ఎలివేషన్‌ డైలాగులతో కానీ ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో చూస్తోన్న సంగతి గుర్తురాదు.

ఇంటర్వెల్‌ సీన్లో ఎమోషన్‌ తర్వాత అయినా కథ సీరియస్‌ మూడ్‌లోకి షిఫ్ట్‌ అవుతుందని అనుకుంటే అది జరగకపోగా, ఒక్కసారిగా హీరో కాస్తా 'రౌడీ అల్లుడు'లో ఆటో జానీ మాదిరిగా మారిపోయి బలవంతపు కామెడీ కోసం విఫలయత్నం చేస్తాడు. రావు రమేష్‌ టైమింగ్‌తో కాసిని నవ్వులు పూసినా కానీ ఆ బెల్టు కమ్‌ సైకిల్‌ దృశ్యాలు 'త్రివిక్రమ్‌' సినిమానే చూస్తున్నామా అని గిల్లి చూసుకునేట్టు చేస్తాయి. త్రివిక్రమ్‌ ఏ కథని తీసుకున్నా కామెడీ చేసేస్తాడనేది కంప్లయింటు. ఖలేజాలాంటి డీసెంట్‌ ఎంటర్‌టైనర్‌ని తిప్పికొట్టడానికి కూడా అదే రీజను.

ఈ కథ వరకు ఇంత కామెడీ అవసరం లేదు. పోనీ కామెడీ అంత అత్యవసరం అనుకున్నా ఇలాంటి కామెడీ చెల్లే రోజులు కావు. కథలోకి అనేక పాత్రలు వచ్చి పోతుంటాయి. ఉదాహరణకి సంపత్‌ రాజ్‌ క్యారెక్టర్‌. ఎంటర్‌ అవడం 'అతడు'లో ప్రకాష్‌రాజ్‌ రేంజ్‌ బిల్డప్‌తో ఎంట్రీ ఇస్తాడు. కేవలం హీరో తండ్రి తాలూకు గతాన్ని మాత్రం చెప్పేసి మళ్లీ ఆచూకీ దొరకడు. కెమెరా ముందుకి వచ్చేవరకు హీరోయిన్లు కానీ, విలన్‌ కానీ తామొకరం ఇందులో వున్నామనే సంగతి గుర్తు రానివ్వరు. అంత బలంగా వున్నాయి పాత్రలు. వాళ్లూ వీళ్లూ ఎందుకు... ఒక్కోసారి కథానాయకుడే ఏం చేస్తున్నాడనే అయోమయం కలగక మానదు.

అనవసరమైన సన్నివేశాలపై ఎక్కువ సమయం కేటాయించి, కీలకమైన విషయాలని మాత్రం అలా చూచాయగా చెప్పేస్తూ పోవడం వల్ల అజ్ఞాతవాసికి సంబంధించి చాలా విషయాలు సరిగ్గా రిజిష్టర్‌ కావు. అత్తారింటికి దారేది మాదిరిగా చాలా షాట్లు, సీన్లు రీడిజైన్‌ చేసుకున్నారు కానీ ఆ ఇంపాక్ట్‌లో కనీసం పదో వంతు అయినా రీ క్రియేట్‌ చేయలేకపోయారు.

ఆ సినిమా అంతా పర్‌ఫెక్ట్‌ మీటర్‌లో వెళుతూ పతాక సన్నివేశానికి వచ్చే సరికి హృదయాలని స్పృశిస్తే, ఈ చిత్రం కేవలం అది వెళ్లిన దారిని మాత్రం ఫాలో అవుతూ ఎలాగైనా మనసులని టచ్‌ చేయాలని చాలా తంటాలు పడుతుంటుంది. ఉదాహరణకి కుష్బూ-పవన్‌ల మధ్య అంతిమ సన్నివేశం చూస్తే ఎమోషన్‌ని ఏదో రకంగా పండించడానికి పడిన వృధా ప్రయాసగానే అనిపిస్తుంది తప్ప ఏమాత్రం కదిలించకలేకపోతుంది.

రెండు నిమిషాలు ఫోన్లో కథ వినేసి ఓకే చెప్పారని పవన్‌ గురించి త్రివిక్రమ్‌ చెప్పాడు. దర్శకుడిగా త్రివిక్రమ్‌పై పవన్‌కి వున్న నమ్మకమే దానికి కారణం కావచ్చు. ఇంతవరకు దర్శకుడిగా ఎప్పుడూ పూర్తిగా నిరాశ పరచని త్రివిక్రమ్‌పై ఎవరికైనా వుండే నమ్మకమే అది. అయితే తాను కూడా ఒక బ్యాడ్‌ సినిమా తీయగలను అని నిరూపించడానికే త్రివిక్రమ్‌ ఈ చిత్రం చేసారా అని అనుమానం కలిగించేలా వుంది అజ్ఞాతవాసి. ఒకటి రెండు సందర్భాల్లో మాటలతో తన ఉనికిని చాటుకున్న త్రివిక్రమ్‌ దాదాపు సినిమా అంతటా అజ్ఞాతంలో వున్నట్టే అనిపిస్తాడు.

పవన్‌కళ్యాణ్‌ని ఎంత బాగా చూపించాలనేది ఎంతో బాగా తెలిసిన త్రివిక్రమ్‌ ఇందులో క్లూలెస్‌గా కనిపిస్తాడు. పదే పదే పవన్‌తో ఆ ఆడపిల్లలా ఏడుపులు, బుంగమూతి పెట్టుకోవడాలు వగైరా చేయించడం ఎంతమాత్రం అలరించదు. కథానాయికల పాత్రలు అంత బలహీనంగా ఎలా రాసారా అనిపించకపోదు. ఒక సందర్భంలో హీరో కోసం ఇద్దరూ జుట్టు పట్టుకుని కొట్టుకోవడం చూస్తే ఆశ్చర్యంతో కూడిన నిరాశా నిస్పృహలు 'ప్రిన్స్‌ ఇన్‌ ఎగ్జైల్‌' కథ సుఖాంతం కోసం కంటే 'నియరెస్ట్‌ ఎగ్జిట్‌' కోసం చూడనివ్వకుండా ఆపలేవు.

సర్దార్‌ గబ్బర్‌సింగ్‌, కాటమరాయుడులాంటివి అయినా ఫార్ములా వికటించి విఫలమయ్యాయి కానీ ఈ చిత్రానికి ఆది నుంచి అంతం వరకు ఏదీ సబబుగా, సవ్యంగా అనిపించదు. అబ్బురపరిచే నిర్మాణ విలువలు, కళ్లు చెదిరే దృశ్యాలు, కనువిందైన కెమెరా పనితీరు, వీనుల విందు చేసే స్వరాలు మినహాయిస్తే ఈ చిత్రానికి సంబంధించి ప్లస్‌ పాయింట్లంటూ మరేమీ కానరావు. త్రివిక్రమ్‌ రచనా పటిమపై నమ్మకంతో ఇంతింతై పెరిగిన అంచనాలు ఇక పవన్‌కళ్యాణ్‌ స్టార్‌డమ్‌ తాలూకు భుజాల మీదే ఆధారపడాలి... కనీసం పండగ వెళ్లే వరకైనా ఈ అజ్ఞాతవాసి బాక్సాఫీస్‌పై పట్టు కోల్పోకుండా! వంద కోట్లకి పైగా ఆశల కాసులతో వెలసిన ఈ సినీ వృక్షం ఉన్నపళంగా కూలిపోకుండా!

బాటమ్‌ లైన్‌: అజ్ఞాతంలోకి!

- గణేష్‌ రావూరి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?