cloudfront

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: కృష్ణార్జున యుద్ధం

సినిమా రివ్యూ: కృష్ణార్జున యుద్ధం

రివ్యూ: కృష్ణార్జున యుద్ధం
రేటింగ్‌: 2.5/5
బ్యానర్‌: షైన్‌ స్క్రీన్స్‌
తారాగణం: నాని (ద్విపాత్రాభినయం), అనుపమ పరమేశ్వరన్‌, రుక్సర్‌ ధిల్లాన్‌, బ్రహ్మాజీ, ప్రభాస్‌ శ్రీను, సుదర్శన్‌, దేవదర్శిని తదితరులు
కూర్పు: సత్య జి.
సంగీతం: హిప్‌హాప్‌ తమిళ
ఛాయాగ్రహణం: కార్తీక్‌ ఘట్టమనేని
నిర్మాతలు: హరీష్‌ పెద్ది, సాహు గారపాటి
కథ, మాటలు, కథనం, దర్శకత్వం: మేర్లపాక గాంధీ
విడుదల తేదీ: ఏప్రిల్‌ 12, 2018

'కృష్ణార్జున యుద్ధం... ఇక మొదలు' అంటూ ఇంటర్వెల్‌ కార్డ్‌ పడుతుంది. 'అవునా... మరిప్పటి వరకు చూపించిన సినిమా ఏంటి?' అని మనం అనుకోవాలి. ఆ యుద్ధం మొదలైన కాసేపటికే... ఇది మొదలు పెట్టకుండా ఆ ఫస్ట్‌ హాఫ్‌లో వేసిన సినిమానే కంటిన్యూ చేసేసి వుంటే బాగుండేది కదా అనిపిస్తుంది.

'కృష్ణార్జున యుద్ధం' చెయ్యడానికి ఒక్క నాని వుంటే సరిపోడని బాగానే గెస్‌ చేసారు. కాకపోతే దీనిని లాగడం ఇద్దరు నానిల వల్ల కూడా కాలేదు! పేరుకి కృష్ణుడు, అర్జునుడు అంటూ ఇద్దరు హీరోలున్నా... షో మొత్తం నడిపేది కృష్ణుడే. మామూలుగా అయితే డైరెక్షన్‌ కృష్ణుడిది, యాక్షన్‌ అర్జునుడిదీ కావాలి.

కానీ ఇక్కడ అర్జునుడిది ప్రేక్షక పాత్రే. ఆ క్యారెక్టర్‌ ఎంత డమ్మీ అనేది చెప్పాలంటే... క్లయిమాక్స్‌లో విలన్స్‌ దగ్గరకి బయల్దేరుతూ కృష్ణ అప్పగింతలు చెప్పేస్తాడు 'అప్పుడప్పుడూ మా అమ్మ దగ్గరకి వెళ్లి కనిపిస్తూ వుండు. నాలాగే వుంటావు కదా... నేనే అనుకుంటది' అని. 'ఛ ఛ.. నేనూ నీతో రావాల్సిందే' అని బయల్దేరి వెళ్లిన అర్జున్‌ అక్కడేం చేస్తాడో తెల్సా? 'ట్రాన్స్‌లేషన్‌'! విలన్‌కి తెలుగు ముక్క రాదు... కృష్ణకి ముక్క హిందీ రాదు. కనుక విలన్‌ మాట్లాడేది అనువదించి పెడతాడు అర్జున్‌. అంతకుమించి పతాక సన్నివేశంలో అర్జునుడికి సీనివ్వలేదు.

ద్విపాత్రాభినయం అన్నపుడు ఒక క్యారెక్టర్‌ని మరీ ఇంత పాసివ్‌గా వుంచేయాల్సిన పని లేదు. అర్జున్‌ పాత్రని తీర్చిదిద్దిన దర్శకుడికే దానిపై పెద్ద ఇష్టం, ఆసక్తి లేదనే సంగతి ఆ క్యారెక్టర్‌కి రాసిన సీన్స్‌లోనే తెలుస్తుంటుంది. ఇక నాని అయితే 'రాక్‌స్టార్‌' పాత్రకి అవసరమైన బాడీ లాంగ్వేజ్‌, ఆటిట్యూడ్‌, స్టయిల్‌ ఏదీ చూపించలేకపోయాడు. ఒక రకంగా ఈ పాత్ర చేసి తన లిమిటేషన్స్‌ తానే చూపించినట్టయింది. ఏతావాతా చెప్పేదేంటంటే... ఇది కృష్ణార్జున యుద్ధం కాదు... 'కృష్ణ యుద్ధంలో అర్జునుడి ప్రేక్షక పాత్ర' అని!

కథలోకి వెళితే... పొలాల్లో పక్షులు వాలకుండా డబ్బా కొట్టే పల్లెటూరి కుర్రాడు కృష్ణ (నాని). డాక్టర్‌ అయిన హైదరాబాద్‌ అమ్మాయి రియా (రుక్సర్‌) ఆ ఊరికొస్తే ప్రేమిస్తాడు. డబ్బా కొట్టేవాడికి డాక్టరేంటి? అనేది జనరల్‌ లాజిక్‌. కానీ సినిమా హీరోలకి జాబ్‌తో సంబంధం లేకుండా లవ్‌ వర్కవుట్‌ అయిపోతుంది కనుక నో క్వశ్చన్స్‌. ఇక యూరప్‌లో రాక్‌స్టార్‌ అయిన తెలుగు కుర్రాడు అర్జున్‌ (నాని). స్టీరియోటైప్‌గా ప్లేబాయ్‌ కూడా.

'గోకులంలో సీత', 'ప్రేమతో రా' వగైరా సినిమాల్లో హీరోల ట్రాకే ఇతని లవ్‌స్టోరీ కూడా. ఒక ట్రెడిషినల్‌ అమ్మాయి సుబ్బలక్ష్మి (అనుపమ) ప్రేమలో పడతాడు. ఆమె అతడిని ఛీ కొడుతుంది. ఈ లవ్‌స్టోరీలు ఒక కొలిక్కి వస్తున్నాయనే టైమ్‌కి అమ్మాయిలిద్దరూ ఒక విమెన్‌ ట్రాఫికింగ్‌ గ్యాంగ్‌కి చిక్కి మాయమవుతారు. ఇప్పుడు కృష్ణార్జునులు కలిసి యుద్ధం చేసి తమ తమ ప్రియురాళ్లని తెచ్చుకోవాలి.

'కృష్ణార్జున ప్రేమ' మాత్రమే వున్నంత వరకు సినిమా పాస్‌ అయిపోతుంది. కొన్నిసార్లు రొటీన్‌ కామెడీతో, కొన్నిసార్లు బాగా నవ్వించే కామెడీతో (బ్రహ్మాజీ-దేవదర్శిని ఎపిసోడ్స్‌), కొన్నిసార్లు కృష్ణగా నాని టైమింగ్‌తో, కొన్నిసార్లు అలరించే పాటలతో (దారిచూడు, వాన్నా ఫ్లయ్‌) ఫస్ట్‌ హాఫ్‌ సుదీర్ఘంగా వున్నా కాలక్షేపమైపోతుంది. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ కూడా బాగానే కుదిరింది. అయితే ఒక్కసారి 'కృష్ణార్జున యుద్ధం'గా మారిన తర్వాత కృష్ణ సీరియస్‌ అయిపోవడంతో కామెడీకి స్కోప్‌ లేకపోయింది. హీరోయిన్లు ఇద్దరూ ప్రమాదంలో వుండడం, నలభై ఎనిమిది గంటల్లోగా సేవ్‌ చేయాలనే టైమ్‌ ఫ్రేమ్‌ వుండడంతో పక్కదార్లు పట్టే వీల్లేకపోయింది.

అక్కడికీ ప్రభాస్‌ శ్రీను-హరితేజతో ఏదో కామెడీ లాంటిది ట్రై చేసారు, బలవంతంగా చివర్లో ఒక పాటని ఇరికించారు కానీ అవేమీ అతకకపోగా ఇంకాస్త విసిగించాయి. పైగా హీరోయిన్స్‌ ఇద్దరూ మిస్సింగ్‌ కనుక యాక్షన్‌కి తప్ప మరో ఎలిమెంట్‌కి స్కోప్‌ లేకుండా పోయింది. కథకి ఈ టర్న్‌ ఇచ్చి దర్శకుడు తనని తాను బంధించేసుకున్నట్టు అవడంతో ఇక ఆ చక్రబంధం నుంచి బయటకి రాలేక చాలా తంటాలు పడాల్సి వచ్చింది.

సెకండ్‌ హాఫ్‌ మొత్తంలో ఒక్కటంటే ఒక్క సీన్‌ కూడా పండకపోవడంతో, హీరోలు కాబట్టి కాపాడేస్తారనే ప్రిడిక్టబులిటీ వుండడంతో, విలన్స్‌ని దారుణమైన వాళ్లు అనే ఎస్టాబ్లిష్‌మెంట్‌ కూడా ఏదీ లేకపోవడంతో ఎంత నలభై ఎనిమిది గంటల టైమ్‌ ఫ్రేమ్‌ పెట్టినా కానీ ఉత్కంఠ బొత్తిగా కొరవడింది. హీరోయిన్ల ఆచూకీ తెలుసుకోవడం కూడా చాలా ఈజీ అయిపోవడంతో స్క్రీన్‌ప్లే ఫ్లాట్‌గా తయారైంది. పతాక సన్నివేశం మరీ పేలవంగా తేల్చేయడంతో ఇక దానిని 'లిఫ్ట్‌' చేసే స్కోప్‌ అంటూ లేకుండా పోయింది.

ఫస్ట్‌ హాఫ్‌లో ఇద్దరు నానిల కథల్ని తెలివైన కట్స్‌తో చెప్పుకుంటూ చాతుర్యం చూపించిన దర్శకుడు మేర్లపాక గాంధీ ఇద్దరూ ఒకే ప్లేస్‌కి చేరిన తర్వాత క్లూలెస్‌గా అయిపోయాడు. మొదట్లో రెండు కథల్ని ప్యారలల్‌గా నడిపించిన విధానం, కంటిన్యుటీ మిస్‌ కాకుండా సిమిలర్‌ సిట్యువేషన్స్‌ క్రియేట్‌ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. సెకండ్‌ హాఫ్‌లో కూడా దర్శకుడు అదే చాతుర్యం చూపించినట్టయితే ఈ యుద్ధం ఇంకోలా వుండేది. కృష్ణగా నాని తనదైన శైలిలో అలరించాడు.

చిత్తూరు యాసలో మాట్లాడుతూ అతను పండించిన హాస్యం ఆకట్టుకుంటుంది. అర్జున్‌ పాత్రకి వచ్చేసరికి సరైన హోమ్‌వర్క్‌ లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అలాగే కృష్ణ పాత్ర సీరియస్‌గా మారి యాక్షన్‌లోకి దిగిన తర్వాత ఆ పాత్ర కూడా తేలిపోయింది. హీరోయిన్లు ఇద్దరికీ నటించే స్కోప్‌ ఏమీ దక్కలేదు. అనుపమ స్క్రీన్‌ ప్రెజెన్స్‌ బాగుంది. ఇతర తారాగణంలో బ్రహ్మాజీ కామెడీ టైమింగ్‌, ఎక్స్‌ప్రెషన్స్‌ బాగా నవ్విస్తాయి.

హిప్‌హాప్‌ తమిళ స్వరాలు మనం రెగ్యులర్‌గా వినే పాటలకి భిన్నంగా వున్నాయి. నా కనులే కనని, దారి చూడు దుమ్ము చూడు పాటలు ఆకట్టుకుంటాయి. నేపథ్య సంగీతం హైలైట్‌గా నిలిచింది. ఛాయాగ్రహణం కూడా చక్కగా కుదిరింది. సంభాషణలు నవ్విస్తాయి. దర్శకుడిగా మేర్లపాక గాంధీ మరోసారి కామెడీపై తనకున్న పట్టు చూపించాడు. అయితే ఒక కంప్లీట్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ తీర్చిదిద్దడంలో విఫలమయ్యాడు.  సెకండ్‌ హాఫ్‌లో కామెడీకి స్కోప్‌ లేకపోయినా ఉత్కంఠ రేకెత్తించే అవకాశమున్నా దర్శకుడు ఆ దిశగా దృష్టి పెట్టలేదు. 

లాస్ట్‌ సీన్‌లో వినిపించే 'నిండు ఆకాశమంత మనసు వున్న రాజువయ్యా' పాటొక్కటే థియేటర్‌ బయటకి వచ్చాక గుర్తుంటుందంటే యుద్ధమెంత ఆసక్తికరంగా సాగిందనేది అర్థం చేసుకోండి. సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌కి కనుక ఇండియన్‌ మ్యూజిక్‌తో టచ్‌ వున్నట్టయితే ఈ సందర్భంలో ఏమనేవాడంటే... 'ఇలాంటి సినిమాలు చూసినపుడే ఇళయరాజా పాటలు వింటే బాగుంటుంది' అని! చాలా సాధారణ చిత్రాలని కూడా సక్సెస్‌ చేసేసే ఫామ్‌లో వున్న నాని స్టామినాకి ఇది మరో పరీక్ష అనుకోవాలి. కాకపోతే గాంధీ ఈసారి పేపర్‌ ఇంకాస్త టఫ్‌గా సెట్‌ చేసిచ్చాడు కనుక నాని ఇదీ పాస్‌ అవుతాడా లేదా అనేది చూడాలి.

బాటమ్‌ లైన్‌: సగం వినోదం... సగం యుద్ధం!

- గణేష్‌ రావూరి