సినిమా రివ్యూ: మహానటి

రివ్యూ: మహానటి రేటింగ్‌: 4/5 బ్యానర్‌: స్వప్న సినిమా తారాగణం: కీర్తి సురేష్‌, దుల్కర్‌ సల్మాన్‌, సమంత, విజయ్‌ దేవరకొండ, రాజేంద్రప్రసాద్‌, భానుప్రియ, మోహన్‌బాబు, నాగచైతన్య, ప్రకాష్‌రాజ్‌, క్రిష్‌, అవసరాల శ్రీనివాస్‌ తదితరులు మాటలు:…

రివ్యూ: మహానటి
రేటింగ్‌: 4/5
బ్యానర్‌: స్వప్న సినిమా
తారాగణం: కీర్తి సురేష్‌, దుల్కర్‌ సల్మాన్‌, సమంత, విజయ్‌ దేవరకొండ, రాజేంద్రప్రసాద్‌, భానుప్రియ, మోహన్‌బాబు, నాగచైతన్య, ప్రకాష్‌రాజ్‌, క్రిష్‌, అవసరాల శ్రీనివాస్‌ తదితరులు
మాటలు: సాయిమాధవ్‌ బుర్రా
పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, రామజోగయ్య శాస్త్రి
కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతం: మిక్కీ జె. మేయర్‌
ఛాయాగ్రహణం: డానీ సా లో
సమర్పణ: వైజయంతి మూవీస్‌
నిర్మాత: ప్రియాంక దత్‌
రచన, దర్శకత్వం: నాగ్‌ అశ్విన్‌
విడుదల తేదీ: మే 09, 2018

జీవితం తెరపై ఆవిష్కృతమవుతోంటే కళ్ళకి, మనసుకి పక్కన ఏం జరుగుతోందనే ధ్యాస వుండదు. మహానటి సావిత్రి జీవిత కథని తీద్దామని తలపెట్టి ఆమె జీవితానికే ఒక నివాళిని ఇచ్చాడు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌.

''ఒక కథ తెలుసుకుందామని వెళ్లాను… ఒక చరిత్ర తెలుసుకున్నాను'' అంటూ సమంత చెప్పే మాటలు ఈ చిత్ర దర్శకుడు నాగ్‌ అశ్విన్‌కి వర్తిస్తాయి. తను తెలుసుకున్న ఓ మహానటి మహోన్నత జీవిత చరిత్రని ప్రపంచానికి కళ్లకి కట్టినట్టు, కన్నీళ్ళొచ్చేట్టు, చూసిన కళ్లలో కలకాలం నిలిచిపోయేట్టు చేసిన నాగ్‌ అశ్విన్‌కి ముందుగా వేల వేల ప్రణామాలు.

జీవిత కథ చెప్పడం వేరు… తన కోణంలో కథ చెబుతూ ఇది జీవితమే అనిపించడం వేరు. బయోపిక్స్‌ చాలానే వస్తుంటాయి కానీ నాగ్‌ అశ్విన్‌ దృక్కోణంలో 'మహానటి' జీవితం మొదలవడమే మనల్ని మరో లోకంలోకి, మనకు తెలిసిన సావిత్రి గురించి మనకు తెలియని ప్రపంచంలోకి తీసుకుపోతుంది. సావిత్రి గురించి తెలుసుకోవాలని జర్నలిస్ట్‌ మధురవాణి (సమంత) తపిస్తోంటే ఆమెతో పాటుగా మనలోను ఆరాటం పెరిగిపోతుంది.

సావిత్రి కథని ఎక్కడ్నుంచి మొదలు పెట్టాలి, ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనేదాంట్లో దర్శకుడు నాగ్‌ అశ్విన్‌కి వున్న క్లారిటీ చూస్తే అసలు ఇది అతని రెండవ చిత్రమేనా అనిపిస్తుంది. తలలు పండిన దర్శకులే ముట్టుకోవడానికి భయపడే కథ ఇది. అన్నేళ్ల జీవితాన్ని కొన్ని గంటల్లో చెప్పడం, అంత అద్భుతంలో ఏ ముఖ్య ఘట్టాన్ని మిస్‌ అవకుండా చూపడం అలాంటిలాంటి సాహసం కాదు. సావిత్రి జీవితంలో ప్రపంచం చూసే నెగెటివ్‌ ఎలిమెంట్స్‌ని కూడా పాజిటివ్‌గా చెప్పడం, ఈ చిత్రం చూసిన తర్వాత ఆమె తీసుకున్న కొన్ని 'నిర్ణయాలతో' ప్రపంచం ఏకీభవించేట్టు చేయడంలోనే ఈ చిత్రం ఆమె జీవిత కథలా కాకుండా ఆమె జీవితానికే నివాళి అనే రీతిన నిలిచిపోతుంది.

పెళ్లయిన వ్యక్తితో, మరో స్త్రీతో సంబంధం వున్న వ్యక్తితో ప్రేమలో పడిందనేది సావిత్రిని ప్రపంచం వేలెత్తి చూపించిన విషయం. ఆమె అంతరంగాన్ని చదివేసాడా అన్నట్టు ఆ అంశాన్ని దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఆవిష్కరించిన విధానం అబ్బురపరుస్తుంది. 'దేవదాసు' కథ చదివిన ఒక మూమూలు అమ్మాయిగా సావిత్రి కదిలిపోతుంది. వాళ్లిద్దరి జీవితం అలాగే ఎందుకు వుండాలి, దేవదాసుకి పెళ్లయితే మాత్రం పార్వతి ఎందుకు దూరం కావాలి అని సావిత్రి భావిస్తుంది. అదే పరిస్థితి తన జీవితంలో తలెత్తినపుడు ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్టు చూపించడం మనసుతోనే చప్పట్లు కొట్టేట్టు చేస్తుంది.

ఆమె నిజ జీవితాన్ని, తెర జీవితాన్ని సమాంతరంగా నడిపిస్తూ నిజ జీవితంలోని సంఘటనలను తెరపై జీవించినట్టు చూపించడం కూడా ఈ బయోపిక్‌ని ప్రత్యేకంగా నిలబెడుతుంది. 'రావోయి చందమామ మా వింత గాధ వినుమా' అనేది ఆ సినిమా కోసం రచయిత రాసిన పాట. కానీ సావిత్రికి ఆ టైమ్‌లో జీవితంలో ఎదురైన సంఘటనలకి ఆ సాహిత్యం అద్దం పడుతుంది.

సావిత్రి కాలమానానికే చెందిన మహా నటులు ఎందరో వున్నారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, ఎస్వీయార్‌ లాంటి మహామహులతో నటించిన సావిత్రి గురించిన కథే అయినా మామూలుగా ఆ పాత్రలని కూడా మళ్లీ మళ్లీ చూడాలనే కుతూహలం కలగాలి. అయితే ఏ క్షణంలోను సావిత్రి అసలు కథనుంచి పక్కకి వెళ్లకూడదని, ఆమె జీవితంతోనే ట్రావెల్‌ చేయాలని అనిపించడం ఈ కథనంలో మరో గొప్ప గుణం. ఒక సందర్భంలో సావిత్రి, జెమిని గణేశన్‌ల మధ్య యుగళ గీతం వస్తోంటే… అది ఎంత త్వరగా ముగిసిపోయి తదుపరి ఏమి జరిగిందనేది తెలుసుకోవాలనే ఆరాటం కుదురుండనివ్వదు.

నిజ జీవిత కథలు తెరపై ఆవిష్కరించేప్పుడు కొందరిని నొప్పిస్తాయనే వాటికి సుగర్‌ కోట్‌ చేయడం చూస్తుంటాం. కానీ నాగ్‌ అశ్విన్‌ అలాంటి ఎస్కేపిస్ట్‌ రూట్‌ ఎంచుకోలేదు. ప్రేమలోనే జీవితం వుందనుకున్న సావిత్రిని ఆ ప్రేమే ఎలా బలి తీసుకుంది, ఆమె మంచితనాన్ని ప్రపంచం ఏ విధంగా క్యాష్‌ చేసుకుంది, మత్తు మహమ్మారికి బానిసయిన మహానటి జీవితం ఎలా అర్ధాంతరంగా ముగిసింది అనేది దర్శకుడు చాలా స్పష్టంగా, నిక్కచ్చిగా, నిర్మొహమాటంగా చూపించాడు.

ఈ కథని నడిపించడానికి సాధనంగా వాడుకున్న సమంత పాత్ర, ఆమె మూగ ప్రేమికుడిగా విజయ్‌ ఆంటోనీల ఉపకథని కూడా అసలు కథకి అడ్డం పడకుండా నడిపించిన విధానం ఆకట్టుకుంటుంది. 'శంకరయ్య' ఎవరు అనే హుక్‌తో నడిపించిన కథకి సమంత ద్వారా సావిత్రి జీవితంలో మిగిలిన కోరిక తీర్చి ఒక సినిమాటిక్‌ క్లయిమాక్స్‌ ఇచ్చిన తీరుని బట్టి నాగ్‌ అశ్విన్‌ ఎంత గొప్ప కథకుడనేది మరోసారి తేటతెల్లమవుతుంది.

ఎక్కువ చిత్రాల్లో నటించిన అనుభవం ఎరుగని కీర్తి సురేష్‌లో సావిత్రిని ఎలా చూసాడనేది నాగ్‌ అశ్విన్‌కే తెలియాలి. కొన్ని సన్నివేశాల్లో నిజంగా సావిత్రినే చూస్తున్నామా అనేంతగా ఆ పాత్రకి ఆమె సరిపోయింది. పోలికల్లో మాత్రం కనిపిస్తే సరిపోదు. మహానటి పాత్ర పోషిస్తున్నపుడు అభినయంలోను అంతటి గొప్పతనం చూపించక తప్పదు.

ఇంతటి ఛాలెంజ్‌ని స్వీకరించిన కీర్తి సురేష్‌ సావిత్రి పాత్రని పోషించిన తీరుకి ఎన్ని అభినందనలు, అవార్డులు ఇచ్చినా తక్కువే. సావిత్రిపై అపారమైన ప్రేమ వున్నా కానీ మనిషిలోని సగటు బలహీనతల్ని అధిగమించలేక, పరోక్షంగా ఆమె పతనానికి కారణమైన వాడిగా జెమిని గణేశన్‌ పాత్రలో దుల్కర్‌ ఇచ్చిన పర్‌ఫార్మెన్స్‌ కూడా చిరస్మరణీయం.

మధురవాణి పాత్రకి సమంత ప్రాణం పోసింది. విజయ్‌ దేవరకొండ సహాయ పాత్రలో మెప్పించాడు. రాజేంద్రప్రసాద్‌కి అద్భుతమైన పాత్ర దక్కింది. నటకిరీటి తన కీర్తి కిరీటంలో మరో మణిగా మిగిలిపోయే రీతిన 'పెదనాన్న' పాత్రకి ప్రాణం పోసారు. నాగచైతన్య, మోహన్‌బాబు, ప్రకాష్‌రాజ్‌, క్రిష్‌ తదితరులంతా కొన్ని లెజెండరీ పర్సన్స్‌ని తెర మీదకి తెచ్చారు. అయితే ఇది ప్రధానంగా సావిత్రి కథే కనుక పక్కనున్న ఏ లెజెండ్‌కీ ఎక్కువ సమయం దక్కలేదు.

యాభై, అరవైల కాలంలో జరిగిన ఈ కథకి తగ్గ ప్రొడక్షన్‌ డిజైన్‌ చేయడంలో ఆర్ట్‌ డైరెక్టర్స్‌ సక్సెస్‌ అయ్యారు. బ్లాక్‌ అండ్‌ వైట్‌, ఈస్ట్‌మన్‌ కలర్‌ తదితర టెక్నిక్స్‌తో ఈ సినిమాకి అథెంటిక్‌ అప్పీల్‌ తేవడంలో ఛాయాగ్రాహకుడు చక్కని ప్రతిభ చూపించాడు. ఇక సంగీతంతో ఈ చిత్రాన్ని అజరామరంగా మార్చిన మిక్కీ జె. మేయర్‌ ఈ చిత్రానికి మరో కథానాయకుడు. ఇలాంటి బృహత్తర ప్రయత్నానికి బాసటగా నిర్మాతలు అభినందనీయులు. 'ప్రతిభ ఇంటిపట్టునుంటే ప్రపంచానికి పుట్టగతులుండవు' లాంటి అర్థవంతమైన, లోతైన సంభాషణలతో సాయి మాధవ్‌ బుర్రా తన ముద్ర వేసారు.

సగటు కమర్షియల్‌ చిత్రాలు చూసే దృష్టి కోణంతో చూసే సినిమా కాదు ఇది. కాకపోతే ఒక సినిమా కమర్షియల్‌ సక్సెస్‌ స్థాయిని నిర్దేశించే మెజారిటీ ప్రేక్షకుల అభిరుచికి భిన్నమైన చిత్రమిది. వారిని ఎంతగా మెప్పిస్తుందనే దానిపై ఆర్థిక విజయం ఆధారపడవచ్చు కానీ ఆ అంశం ఈ చిత్రం గొప్పతనాన్ని కాస్తయినా తగ్గించేది కాదని ఘంటాపథంగా చెప్పాలి. తెరపై జీవితాన్ని చూపించే చిత్రాలు అరుదుగా వస్తాయి. చూసిన వారి మదిపై చిరస్మరణీయమైన ముద్ర వేసే 'మహానటి'లాంటివి ఎక్కడో వుంటాయి. సావిత్రిని అభిమానించే వాళ్లే కాదు… సినిమాని ఇష్టపడే ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రమిది.

బాటమ్‌ లైన్‌: మహానటికి మరపురాని నివాళి!

– గణేష్‌ రావూరి