cloudfront

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: ఒక్క క్షణం

సినిమా రివ్యూ: ఒక్క క్షణం

రివ్యూ: ఒక్క క్షణం
రేటింగ్‌: 2.75/5
బ్యానర్‌: లక్ష్మి నరసింహా ఎంటర్‌టైన్‌మెంట్స్‌
తారాగణం: అల్లు శిరీష్‌, సురభి, సీరత్‌ కపూర్‌, శ్రీనివాస్‌ అవసరాల, ప్రవీణ్‌, సత్య, దాసరి అరుణ్‌ తదితరులు
మాటలు: అబ్బూరి రవి
కూర్పు: చోటా కె. ప్రసాద్‌
సంగీతం: మణిశర్మ
ఛాయాగ్రహణం: శ్యామ్‌ కె. నాయుడు
నిర్మాత: చక్రి చిగురుపాటి
కథ, కథనం, దర్శకత్వం: విఐ ఆనంద్‌
విడుదల తేదీ: డిసెంబర్‌ 28, 2017

ఇద్దరు వ్యక్తుల జీవితాలు ఒకే రీతిన సాగుతుంటే? ఒకరి ప్రస్తుతం మరొకరికి భవిష్యత్తు అయితే? ఈ వ్యక్తి తాలూకు అనుభవాలన్నీ వెనక వున్న వ్యక్తికి సైతం ఎదురవుతోంటే? వి.ఐ. ఆనంద్‌ కొత్త చిత్రం 'ఒక్క క్షణం' ఇదే పాయింట్‌ ఆధారంగా అల్లుకున్న మిస్టరీ థ్రిల్లర్‌. సైన్స్‌ ఫిక్షన్‌తో కూడిన 'ప్యారలల్‌ లైఫ్‌' అనే థియరీని ఇతివృత్తంగా చేసుకుని ప్రేమ వర్సెస్‌ విధి అంటూ 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' దర్శకుడు ఒక చిత్రమైన చిత్రాన్ని తీర్చిదిద్దాడు. ఈ కాన్సెప్ట్‌తో కొరియన్‌ భాషలో 'ప్యారలల్‌ లైఫ్‌' పేరుతో ఒక చిత్రం వచ్చింది. ఆ పాయింట్‌ని, అందులో ఆ దర్శకుడు చెప్పిన 'అబ్రహాం లింకన్‌ - జాన్‌ ఎఫ్‌. కెన్నడీల' ఉదంతాన్ని బేస్‌గా పెట్టుకుని మనం రిలేట్‌ చేసుకునే అంశాలతో ఆనంద్‌ ఓ కథ చెప్పాడు.

ఈ కాన్సెప్ట్‌ కొత్తగా వుండడమే కాకుండా వీక్షకులని ఉత్కంఠకి గురి చేసే సత్తా వున్నది. ఖచ్చితంగా ఈ సినిమాతో ఓ కొత్త అనుభూతి అయితే కలుగుతుంది. కాకపోతే ఇలాంటి కాన్సెప్ట్‌ని తక్కువ నిడివిలో, ఎక్కువ డీవియేషన్స్‌ లేకుండా చెప్పాల్సిన అవసరముంది. ఈ సినిమా మొదలైన తీరులో చాలా లేజీనెస్‌ కనిపిస్తుంది. అసలు పాయింట్‌కి రావడానికి చాలా సమయం వృధా చేయడమే కాకుండా, ఆ వృధా అయిన సమయంలో చూపించినది ఏదీ అంతగా ఆకట్టుకోదు.

ఈ చిత్రానికి అతి కీలకమైన పాయింట్‌ నలుగురు జీవితాల మధ్య వున్న 'కో ఇన్సిడెన్స్‌'. ఆ కో ఇన్సిడెన్స్‌ తాలూకు సన్నివేశాలని దర్శకుడు ఆనంద్‌ ఇంకాస్త బలంగా, అరెస్టింగ్‌గా రాసుకుని వుండాల్సింది. మాల్‌ సెల్లార్‌ పార్కింగ్‌లో మొదలయ్యే ప్రేమకథ ఏమాత్రం ఎక్సయిటింగ్‌గా అనిపించదు. ఆ తర్వాత ఆ జంట జీవితంలో జరిగే ఏ సంఘటనలోను తగిన డెప్త్‌ కనిపించదు.

మామూలు ప్రేమకథల్లో అయితే ఇలాంటి సాధారణ సన్నివేశాలని ఓవర్‌లుక్‌ చేయవచ్చు కానీ అవే సంఘటనలు మరో జంట జీవితంలో కూడా జరిగాయని తెలిసినపుడు వాటికి తగిన సిగ్నిఫికెన్స్‌ వుండి తీరాలి. అవసరాల శ్రీనివాస్‌ తన ప్రేమకథ చెబుతున్నప్పుడు ఆ సంఘటనలు తనకీ ఎదురయ్యాయని శిరీష్‌ ఆశ్చర్యచకితుడు అవుతాడే తప్ప అది వీక్షిస్తున్న వారికి అవి ఏమంత స్ట్రయికింగ్‌గా అనిపించవు. ఈ ప్రేమకథలు చాలా చప్పగా వుండడం వల్ల ప్రథమార్ధంలో చాలా వరకు నిస్సారంగా గడిచిపోతుంది.

అది క్రైమ్‌గా టర్న్‌ తీసుకున్నప్పుడు కానీ ఈ ప్యారలల్‌ లైఫ్‌ తాలూకు తీవ్రత తెలిసిరాదు. ఇంటర్వెల్‌ పాయింట్‌ దగ్గర కథ రసకందాయంలో పడుతుంది. ఆ తర్వాత 'అసలేం జరిగింది?' అంటూ డీటెయిల్స్‌లోకి వెళ్లే కొద్దీ ఆసక్తి పెరుగుతుంది. ఒక అరగంట పాటు ఉత్కంఠభరితంగా నడిపిన కథలో అసలు సంగతి బయటపెట్టే సరికి మళ్లీ రొటీన్‌ అనిపిస్తుంది. మెడికల్‌ స్కామ్స్‌, మెడికల్‌ నెగ్లిజెన్స్‌ పాయింట్స్‌ని మన సినిమాల్లో చాలాసార్లు చూపించేసారు. ఈ ప్యారలల్‌ లైఫ్‌ అనే అత్యంత ఆసక్తికరమైన పాయింట్‌ని కూడా అదే అంశానికి లింక్‌ చేయడం, కథ పతాక స్థాయికి చేరుకునే కొద్దీ రొటీన్‌ వ్యవహారంగా మార్చేయడం నిరుత్సాహ పరుస్తుంది.

క్లైమాక్స్‌ దృశ్యాలని అవసరానికి మించి సాగదీయడం కానీ, ఈ కథకి ఇంతటి నిడివి వుండాలని ఆప్ట్‌ చేసుకోవడం కానీ మంచి ఆప్షన్స్‌ కావు. కాన్సెప్ట్‌ పరంగా చాలా ఇంట్రెస్టింగ్‌ సెటప్‌ వున్నా కానీ దానిని ఆద్యంతం ఆసక్తి రేకెత్తించే సినిమాగా తీర్చిదిద్దడంలో దర్శకుడు సక్సెస్‌ అవలేదు. క్యారెక్టర్స్‌ ఇంట్రడక్షన్‌ కానీ, లవ్‌స్టోరీకి బేస్‌ కానీ సరిగా కుదరకపోవడం వల్ల ఆ జంటకి ఎదురయ్యే పరిస్థితులు చూసే వారిని అంతగా కదిలించవు.

అయితే ఆ పాత్రలతో ఎమోషనల్‌గా కనక్ట్‌ చేయడం లేదా ఆద్యంతం ఉత్కంఠభరితంగా మార్చేడం మాత్రమే ఇలాంటి కాన్సెప్ట్‌లకి వున్న ఆప్షన్లు. దర్శకుడు ఈ రెండు అంశాలని అంతగా లెక్క చేయకుండా, కాన్సెప్ట్‌లో వున్న వెరైటీనే కట్టిపడేస్తుందనే రీతిన సన్నివేశాలని సాదాసీదాగా రాసేసుకున్న భావన కలుగుతుంది.

ఇక నటీనటుల విషయానికి వస్తే, ఈ తరహా కథాంశాలని రక్తి కట్టించేంత అనుభవం అటు శిరీష్‌కి కానీ, ఇటు సురభికి కానీ లేవు. ఇద్దరూ తాము చేయగలిగిన దాంట్లో ఫుల్‌ ఎఫర్ట్‌ పెట్టారు కానీ ఆ పాత్రల తాలూకు ఎమోషన్స్‌తో కనక్ట్‌ చేయలేకపోయారు. వారు అనుభవించే వ్యధతో రిలేట్‌ చేసుకునేంతగా పర్‌ఫార్మ్‌ చేయలేకపోయారు. దాసరి అరుణ్‌ చాలా కాలం తర్వాత తెరపై కనిపించాడు. కాకపోతే ఇది అతడిని గుర్తు పెట్టుకునేంత గొప్ప క్యారెక్టర్‌ ఏమీ కాదు.

శ్రీనివాస్‌ అవసరాల, సీరత్‌ కపూర్‌లు బాగానే చేసారు. ప్రవీణ్‌, సత్య సహాయక పాత్రల్లో కాస్త వినోదానికి దోహదపడ్డారు. మణిశర్మ ఇచ్చిన 'వైబ్రేటింగ్‌' బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ చాలా సీన్స్‌కి ప్లస్‌ అయింది. పాటల పరంగా మాత్రం మణిశర్మ ఆకట్టుకోలేదు. ఛాయాగ్రహణం బాగుంది. ముఖ్యంగా ఇండోర్‌ సన్నివేశాల్లో సినిమాటోగ్రాఫర్‌ ప్రతిభ బాగా తెలుస్తుంది. నిడివి విషయంలో జాగ్రత్త పడాల్సింది.

నవీన ఆలోచనలున్న దర్శకుడిగా వి.ఐ. ఆనంద్‌ మరోసారి తన ఆలోచనలతో ఇంప్రెస్‌ చేస్తాడు. అయితే 'ఎక్కడికిపోతావు చిన్నవాడా' మాదిరిగా వినోదాన్ని, ఎక్సయిట్‌మెంట్‌ని మిక్స్‌ చేసే క్రమంలో ఈసారి స్క్రీన్‌ప్లే రైటర్‌గా కొన్ని పొరపాట్లు చేసాడు. ద్వితియార్ధాన్ని హ్యాండిల్‌ చేసిన తీరు చూస్తే, ఇదే స్పార్కు ప్రథమార్ధంలో కూడా చూపించినట్టయితే ఎంత బాగుండేదనిపిస్తుంది.

రొటీన్‌ సినిమాల విషయంలో పట్టువిడుపుల గురించి పెద్ద పట్టింపులు వుండవు కానీ కొత్తరకం ప్రయత్నాలు చేసేప్పుడు అన్ని విషయాలపై అధిక శ్రద్ధ అత్యవసరం మరి. అసలే తమ సినిమా అప్పీల్‌ అయ్యేది లిమిటెడ్‌ ఆడియన్స్‌కి అయినపుడు అందులోను పకడ్బందీగా లేకపోతే ఆ వర్గం ప్రేక్షకుల నుంచి కూడా చప్పట్లు రావు కాబట్టి. రొటీన్‌ సినిమాలతో విసిగిన వారికి వి.ఐ. ఆనంద్‌ ఒక ఫ్రెష్‌ ఫీల్‌ అయితే ఇవ్వగలడు కానీ ఒక చక్కటి థ్రిల్లర్‌ చూసిన ఎక్సయిట్‌మెంట్‌ని మాత్రం పూర్తి స్థాయిలో అందించలేదనే చెప్పాలి.

బాటమ్‌ లైన్‌: కొన్ని నిమిషాలు ఉత్కంఠభరితం!

- గణేష్‌ రావూరి