cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: దిల్ బేచారా

సినిమా రివ్యూ: దిల్ బేచారా

సమీక్ష: దిల్ బేచారా
రేటింగ్: 3/5
బ్యానర్:
ఫాక్స్ స్టార్ స్టూడియోస్
తారాగణం: సుషాంత్ సింగ్ రాజ్‌పుత్, సంజన సాంఘి, సైఫ్ అలీ ఖాన్, సాహిల్ వైద్, స్వస్తికా ముఖర్జీ తదితరులు
రచన: శశాంక్ ఖైతాన్, సుప్రోతిమ్ సేన్ గుప్తా
సంగీతం: ఏ.ఆర్. రహమాన్
కూర్పు: ఆరిఫ్ షేక్
ఛాయాగ్రహణం: సేతు
నిర్మాణం: ఫాక్స్ స్టార్ స్టూడియోస్
దర్శకత్వం: ముకేష్ చాబ్రా
విడుదల తేదీ: జులై 24, 2020
వేదిక: డిస్నీ+హాట్‌స్టార్

గమనిక: ఈ సమీక్షలో స్పాయిలర్స్ ఉన్నాయి. సినిమా చూడకముందే సమీక్ష చదువుతున్న వాళ్లు అది గమనించగలరు. 

సుషాంత్ లైఫ్ స్క్రిప్ట్ ఎవరు రాసారో కానీ... అతని చివరి సినిమా ‘దిల్ బేచారా’ కావడం ఒక విచిత్రమైన, గుండెని మెలితిప్పే కోఇన్సిడెన్స్. సుషాంత్ ఇప్పుడు ఉన్నట్టయితే ‘దిల్ బేచారా’ ఎలా అనిపించేదో తెలియదు కానీ... అతను ఇక లేడనే వాస్తవం ఈ చిత్రం చూస్తున్నంతసేపు మైండ్‌లో ప్లే అవుతూ వుంటుంది. పలు సంభాషణలు, సన్నివేశాలు అతని ‘అర్థాంతరపు వీడుకోలు’తో కనక్ట్ అవడంతో మరింతగా ఎఫెక్ట్ చేస్తాయి. ముఖ్యంగా పతాక సన్నివేశాలయితే ‘దిల్ బేచారా’ చూస్తోన్న వారిని, తెరపై చనిపోయిన ‘ఇమ్మాన్యుయేల్’ తీసిన సరదా సినిమా చూస్తూ ఎమోషనల్‌గా ఫీలవుతున్న వారి స్థానంలో నిలబెడతాయి. 

‘ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’ నవల ఆధారంగా రూపొందిన ఈ చిత్ర కథ మనకి తెలియనిది కాదు. చావు ముంగిట వున్న ఇద్దరు కాన్సర్ బాధితులు ప్రేమలో పడడం, ఆ కలిసి వున్న కొన్ని రోజుల పాటు జన్మలకు సరిపడా జ్ఞాపకాలు ప్రోది చేసుకోవడం... ముప్పయ్యేళ్ల క్రితమే మణిరత్నం ‘గీతాంజలి’లో చూపించేసారు. ఈ కాన్సెప్ట్‌తో ప్రపంచ భాషల్లో ఇప్పటికే చాలా చిత్రాలొచ్చాయి. వాటిలో చాలా వరకు చూసిన ప్రేక్షకుడిగా ఒకటయితే చెప్పగలను. ఇలాంటి కథల్లో ‘గీతాంజలి’ ఎవరెస్ట్ లాంటిది. అది చూసిన వారికి ‘సుషాంత్ ఫ్యాక్టర్’ పక్కన పెడితే ఇది జస్ట్ ‘సెరి’ (ఓకే) అనిపిస్తుంది. 

‘దిల్ బేచారా’ పాత్రలు, మరణం ముంగిట వున్న పాత్రలతో వినోదం పండించిన విధానం ‘గీతాంజలి’ని తలపిస్తుంది. కాకపోతే ఇక్కడ రోల్ రివర్స్ అనుకోండి. బెంగాలీ అమ్మాయి కిజీ బాసు (సంజన) థైరాయిడ్ క్యాన్సర్‌తో బాధ పడుతూ... నిత్యం ఓ ఆక్సిజన్ సిలిండర్ మోస్తూ నిస్సారమైన జీవితాన్ని గడుపుతూ వుంటుంది. చనిపోయినపుడు వుండే బాధని తెలుసుకోవడం, లేదా పోగొట్టుకున్న వారితో ఆ బాధ పంచుకోవడం కోసం ఫ్యూనరల్స్ అటెండ్ అవుతూ వుంటుంది. ఆమె ఒక అదృశ్యమయిన సంగీత దర్శకుడిని ఆరాధిస్తూ ఒక్కసారయినా అతడిని కలుసుకోవాలని అనుకుంటుంది. అతను చేసిన ఒక అసంపూర్ణ గీతం పూర్తి చేస్తే వినాలనుకుంటుంది. ఆమెకి పరిచయమవుతాడు ఇమ్మాన్యుయేల్ రాజ్‌కుమార్ జూనియర్ అలియాస్ మ్యానీ (సుషాంత్). అతను కూడా క్యాన్సర్ పేషెంటే కానీ కిజీకి పూర్తి విరుద్ధంగా జాలీగా గడిపేస్తుంటాడు. ఆక్సిజన్ సిలిండర్ మోస్తూ తిరిగే కిజీతో ఫ్లర్ట్ చేస్తూ ఆమెకి దగ్గరవుతాడు. ఆమె కోరికలన్నీ తీరుస్తాడు. కావాల్సిన వాళ్లు చనిపోయిన తర్వాత ఎలా వుంటుందో ఆమెకి స్వయంగా తెలియజేసి వెళతాడు. 

బెంగాలీ ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్, మ్యానీకి వున్న రజనీకాంత్ అభిమానం లాంటి అంశాలతో దర్శకుడు పలు సన్నివేశాలను వినోదాత్మకంగా తీర్చిదిద్దాడు. డిప్రెసివ్ క్యారెక్టర్స్ అయినా కానీ ఎక్కడా సినిమా మెలోడ్రమటిక్‌గా అనిపించకుండా ఎక్కడికక్కడ హాయిగా సాగిపోయే సన్నివేశాలు, సంభాషణలతో అలరించాడు. చివరకు ఏమి జరుగుతుందనేది ముందే ఊహించగలిగినా కానీ ఆ ప్రయాణం కూడా నీరసం తెప్పించకుండా ప్లెజెంట్‌గా మలిచాడు. సుషాంత్ సింగ్ నటన ఈ కథని లిఫ్ట్ చేసిందంటే అతిశయోక్తి కాదు. అతనెంత టాలెంటెడ్ నటుడనే దానికి ఈ పాత్ర ఒక ఉదాహరణ. అంత ప్రతిభ అర్థాంతరంగా వెళ్లిపోవడమే బాధిస్తుంది. సుషాంత్ నటనతో పాటు ఈ చిత్రానికి సోల్ ఇచ్చింది రెహమాన్ మ్యూజిక్. ఈ ఇద్దరే ఒక రెగ్యులర్ కథని ‘వాచబుల్’గా మలిచారు. 

కొత్తమ్మాయి అయినా కానీ సంజన కూడా తన పాత్రని చక్కగా పోషించింది. సహాయ నటులు ఒకరిద్దరు మినహా వీరిద్దరి చుట్టే కథంతా తిరుగుతుంది. త్వరలో చనిపోతుందని తెలిసిన తన కూతురు ఒక కుర్రాడితో స్నేహంగా మెలుగుతోందని ఆమె ‘వర్జినిటీ’ గురించి వర్రీ అయ్యే సగటు ఇండియన్ మదర్‌గా స్వస్తిక ముఖర్జీ నటన మెప్పిస్తుంది. సైఫ్ అలీ ఖాన్ అతిథి పాత్రలో కనిపించాడు. ఆ పాత్రతో ఏమి చెప్పాలనుకున్నారనేది సరిగా కన్వే చేయలేకపోయారు. ఆ సన్నివేశమంతా గందరగోళంగా అనిపిస్తుంది. 

పతాక సన్నివేశాలు ప్రిడిక్టబుల్ అయినా కానీ సుషాంత్ రియల్ లైఫ్‌తో కనక్ట్ అవడం వల్ల ఎమోషనల్‌గా మరింతగా తాకుతాయి. తన ఫ్యూనరల్ ఎలా వుంటుందో చూసుకోవాలని స్నేహితులని పిలిచి, తను చనిపోయిన తర్వాత తన గురించి ఏమి మాట్లాడతారో మాట్లాడమని అడగడం, అలాగే అతను చేసిన షార్ట్ ఫిలింని మ్యానీ చనిపోయిన తర్వాత అతని సన్నిహితులు, స్నేహితులు చూస్తూ బాధ పడడం లాంటివి సుషాంత్ మరణించడం వల్ల చాలా పెయిన్‌ఫుల్‌గా అనిపిస్తాయి. అతని చివరి సినిమా ఇది కావడమనే నిజం ఓ అవ్యక్తమయిన భావానికి లోను చేస్తుంది. 

తెలిసిన కథ అయినా కానీ చూడదగ్గ చిత్రంగా మలచడంలో రచయితలు, దర్శకుడు సెక్సస్ అయ్యారు.  నిడివి తక్కువ వుండడం వల్ల అనవసరమైన విషయాలని ఇరికించాల్సిన అవసరం పడక అసలు అంశంపైనే ఫోకస్డ్‌గా వున్నారు. దీని వల్ల ఈ చిత్రం ఎక్కడా విసిగించదు. సుషాంత్ అభిమానులని అయితే చివరి సన్నివేశాలు, మరణం గురించిన కొన్ని మాటలు కన్నీళ్లు పెట్టించేస్తాయి. 

బాటమ్ లైన్: ఎమోషనల్ గుడ్‌బై!

గణేష్ రావూరి