cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: డర్టీ హరి

సినిమా రివ్యూ: డర్టీ హరి

సమీక్ష: డర్టీ హరి
రేటింగ్‍: 2.5/5
బ్యానర్‍: ఎస్‍.పి.జె. క్రియేషన్స్, హైలైఫ్‍ ఎంటర్‍టైన్‍మెంట్‍
తారాగణం: శ్రవణ్‍ రెడ్డి, సిమ్రత్‍ కౌర్‍, రుహాని శర్మ, అజయ్‍, సురేఖవాణి, అప్పాజీ అంబరీష, మహేష్‍ తదితరులు
సంగీతం: మార్క్ కె. రాబిన్‍
కూర్పు: జునైద్‍ సిద్ధికీ
ఛాయాగ్రహణం: ఎం.ఎన్‍. బాల్‍రెడ్డి
నిర్మాతలు: గూడూరు సతీష్‍బాబు, గూడూరు సాయి పునీత్‍
రచన, దర్శకత్వం: ఎం.ఎస్‍. రాజు
విడుదల తేదీ: డిసెంబరు 18, 2020
వేదిక: ఫ్రైడే మూవీస్‍ ఎటిటి

ఒక్కడు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, మనసంతా నువ్వే, వర్షం తదితర బ్లాక్‍బస్టర్‍ సినిమాల నిర్మాతగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ప్రత్యేకత చాటుకున్న ఎం.ఎస్‍. రాజు దర్శకుడిగా సక్సెస్‍ కోసం చాలా కాలంగా విఫలయత్నం చేస్తున్నారు. 

సక్సెస్‍ వేటలో భాగంగా ఈ తరానికి నచ్చే ‘బోల్డ్’ అంశాలను మిళితం చేసి ఆయన చేసిన ‘డర్టీ’ అటెంప్టే ఈ డర్టీ హరి. ఎరోటిక్‍ జోన్రాలో మెయిన్‍ స్ట్రీమ్‍ సినిమాలు తెలుగు చిత్ర పరిశ్రమకు ఇంకా అలవాటు కాలేదు. బాలీవుడ్‍లో మర్డర్‍, హేట్‍ స్టోరీలాంటి ఫ్రాంచైజీలు సక్సెస్‍ అవడంతో ఎం.ఎస్‍. రాజు ఆ తరహా ప్రయత్నాన్ని ‘డర్టీ హరి’తో చేసారు. 

ఆడవాళ్ల అందాలను ఆకలితో తినేసేట్టు చూసే మగాడి చూపులు, ఏ బట్టలేసుకున్నా కానీ క్లీవేజ్‍ తప్పనిసరిగా కనిపించేట్టు చూసుకునే హీరోయిను, ఎఫ్‍ వర్డస్, సెక్స్ సీన్స్, గాంజా స్మోకింగ్‍ షాట్స్... ఇలా ఎరోటిక్‍ జోన్రాకి అవసరమైన సరంజామా అంతా వుండేట్టు రాజు తన సన్నివేశాలను రాసుకున్నారు. 

అడ్డదారిలో అందలం ఎక్కాలని చూసే హరి తనకో రాణిలాంటి సతి, కోట్ల ఆస్తీ కమ్‍ పరపతీ దక్కినా పర స్త్రీపై మోహం చంపుకోలేక అడ్డదారి తొక్కుతాడు. తాను ప్రేమిస్తోన్న యువతి సోదరుడి ప్రేయసిపై హరి కన్నేస్తాడు. తన హీరో ఎంత డర్టీ అనేదానికోసం ఈ ‘టాబూ’ ఎలిమెంట్‍ని రాజు చొప్పించినట్టున్నారు. 

తనకున్న ఆస్తి, అంతస్తు కావాలి, అలాగే తాను కన్నేసిన ఆ సతి సుఖం కావాలని ఆలోచించే హరి ఒక వీక్‍ మూమెంట్‍లో ఆమెను ఎలా లొంగదీసుకుంటాడు, ఆపై ఆమెను తన సంపద సాయంతో ఏ విధంగా తన చెప్పుచేతల్లో పెట్టుకుంటాడనేది ప్రధాన ఇతివృత్తం. అయితే ఈ లస్ట్ యాంగిల్‍కి ఏదైనా ఆసక్తికర అంశాన్ని లేదా డ్రామాని జత చేసినట్టయితే ఈ డర్టీ హరి కేవలం లస్ట్ స్టోరీగా కాకుండా ఒక పరిపూర్ణ సినిమా ఎక్స్పీరియన్స్ అయి వుండేది. 

హరి బలహీనత, వక్ర బుద్ధి వంటి అంశాలను దర్శకుడు స్పష్టంగానే చూపించినా కానీ స్త్రీ పాత్రలకు వెన్నెముక లేకుండా కేవలం సెక్స్ టాయ్స్ అన్నట్టు చూపించిన పైశాచిక చిత్తమేంటో అర్థం కాదు. హరి భార్య పెళ్లి చేసుకున్నది లగాయతు ప్రెగ్నెంట్‍ కావాలంటూ పదే పదే భర్త ముందు తన కోరిక బయటపెడుతూ వుంటుంది. 

హీరోయిన్‍ అవ్వాలనే లక్ష్యంతో వున్న హరి గాళ్‍ఫ్రెండ్‍ ఆ లక్ష్యాన్ని పక్కనపెట్టి అతడికి సుఖాన్నిచ్చే మెషీన్‍ మాదిరిగా కన్వర్ట్ అయిపోతుంది. హరి స్నేహితుడి భార్య కనిపించేది ఒకే సన్నివేశమయినా కానీ ఆమె పదే పదే సెక్స్ కోరుకుంటూ తన శక్తి హరించేస్తోందనేది అతని కంప్లయింట్‍. ఇక హరి అత్తగారు ఈ జనరేషన్‍ ముందు బెడ్‍రూమ్‍కి వెళ్లి తర్వాతే కళ్యాణ మండపానికి వెళుతున్నారంటూ కాబోయే అల్లుడితో పచ్చిగా మాట్లాడేస్తుంది. 

ఇదంతా బోల్డు సినిమాలో భాగం అనుకోవాలి. మాటకి ముందో చానా, మాటకు తర్వాతొక చానా అనే డర్టీ హరిలో బోల్డు తంతు సంగతెలా వున్నా కేవలం ఆ లస్ట్ సీన్లు కాకుండా మరేదైనా ఇతర ఆసక్తికరమైన యాంగిల్‍ని కథకు ఇవ్వలేకపోవడం, అది వచ్చేసరికి ‘చానా’ ఆలస్యం కావడంతో ఈ సినిమా ఒక పాయింట్‍ దాటిన తర్వాత ‘చానా’ విసుగు పుట్టిస్తుంది. 

చివర్లో క్రైమ్‍ యాంగిల్‍తో ఏదైనా ఉత్కంఠ వుంటుందని భావిస్తే డబ్బున్న వాళ్లకిదంతా కామన్‍ అనే ఫీలింగ్‍ ఇచ్చే ఎండింగ్‍తో కథ కంచికి చేరుతుంది. సదరు ముగింపుతో హరికి తగిన ప్రాయశ్చిత్తం జరిగిందా లేదా అన్నది డిబేటబుల్‍ కానీ సదరు ట్విస్ట్ డర్టీ హరికి కాస్తో కూస్తో ఆసక్తిని జోడిస్తుంది. 

శ్రవణ్‍ రెడ్డి ‘హరి’ పాత్రకు కావాల్సిన కామంతో నిండిన చూపులతో పాటు సదరు క్యారెక్టర్‍కి వున్న అనైతిక లక్షణాలను కూడా ప్రదర్శించగలిగాడు. సిమ్రత్‍ కౌర్‍లో హావభావాలు పలకలేదు కానీ ఈ చిత్రానికి అవసరమైన స్కిన్‍ షో, ఎరోటిక్‍ అప్పీల్‍ విషయంలో ఆమె చాలా హెల్ప్ అయింది. 

రుహాని శర్మ పాత్రను పెయింటర్‍గా పరిచయం చేసినా కానీ తర్వాత దారుణంగా సైడ్‍లైన్‍ చేసేసి మళ్లీ చివర్లో కానీ కాస్త ఇంపాక్ట్ ఇచ్చే వీలు ఇవ్వలేదు. ప్రొడక్షన్‍ డిజైన్‍ బాగుంది. నేపథ్య సంగీతం, ఛాయాగ్రహణం ఈ చిత్రానికి క్లాసీ లుక్‍ తెచ్చాయి. సంభాషణలు మాత్రం చాలా సందర్భాలలో పేలవంగా అనిపిస్తాయి. 

దర్శకుడిగా ఎం.ఎస్‍. రాజు తాను చాలా బోల్డ్ అనిపించుకునేలా కొన్నిటిని ధైర్యంగానే కానీ చేసారు కానీ ఎరోటిక్‍ సినిమా అయినా మరో జోన్రా అయినా ఆసక్తి కలిగించే కథ, కథనాలే కీ రోల్‍ ప్లే చేస్తాయని విస్మరించారు. దాంతో ఈ డర్టీ హరి కేవలం ఈ తరహా సినిమాల్లోని ఉద్రేకపరిచే సన్నివేశాలను చూసేందుకు ఇష్టపడే వారిని మినహా ఎక్కువ మందిని ఆకట్టుకోదు. 

ఇదే సినిమాకు బెటర్‍ స్క్రీన్‍ప్లేతో బెటర్‍ ఇంపాక్ట్ వేసే వీలున్నా కానీ నిర్మాతగా ‘స్క్రీన్‍ప్లే మాస్టర్‍’ అనిపించుకున్న రాజు ఆ దిశగా ఆలోచించకపోవడంలోనే ఆయన దర్శకుడిగా ఎందుకు ఫెయిలవుతున్నారనే దానికి మరో రుజువు. 

బాటమ్‍ లైన్‍: ఎరోటిక్‍ హరి! 

 


×