Advertisement

Advertisement


Home > Movies - Reviews

Dunki Review: మూవీ రివ్యూ: డంకీ

Dunki Review: మూవీ రివ్యూ: డంకీ

టైటిల్: డంకీ
రేటింగ్: 2.5/5
తారాగణం:
షారుఖ్ ఖాన్, తాప్సీ పన్ను, విక్కీ కౌషల్, బొమన్ ఇరానీ, అనీల్ గ్రోవర్, విక్రం కొచ్చర్ తదితరులు
కెమెరా: సీ.కె. మురళీధరన్, మనుష్ నందన్, అమిత్ రాయ్, కుమార్ పంకజ్
ఎడిటింగ్: రాజ్ కుమార్ హిరానీ
సంగీతం: ప్రీతం, అమన్ పంత్
నిర్మాతలు: గౌరి ఖాన్, రాజ్ కుమార్ హిరాని, జ్యోతి దేష్ పాండే
దర్శకత్వం: రాజ్ కుమార్ హిరానీ
విడుదల: 21 డిసెంబర్ 2023

రాజ్ కుమార్ హిరానీ సినిమాలంటే ఒక వేల్యూ ఉంటుంది. మానవసంబంధాలు, తాత్వికత, సందేశం, హ్యూమర్ అన్నీ తగుపాళ్లల్లో కలగలిపి చక్కగా తెర మీద చూపిస్తాడని ఆయనకి పేరు. మొట్టమొదటిసారిగా షారుఖ్ ఖాన్ తో హిరానీ సినిమా అనగానే ఆసక్తి కలగడం సహజం. అందునా షారుఖ్ వరుస పాన్ ఇండియా విజయాలతో దూసుకుపోతున్నాడు. ఈ సినిమాతో అతని విజయపరంపర కొనసాగుతుందా? ఇంతకీ ఇందులో ఉన్న విషయమేంటో చూద్దాం.

మను (తాప్సీ), సుఖి (విక్కీ కౌషల్), బల్లి (అనీల్ గ్రోవర్), బుగ్గు (విక్రం కొచ్చర్) అనే నలుగురు స్నేహితులు. 1995లో పంజాబులో ఒక పల్లెటూరిలో జీవిస్తుంటారు. వీళ్లకి ఆర్ధిక ఇబ్బందులు అవీ ఉంటాయి. లండన్ వెళ్లి పౌండ్లు సంపాదించాలని వీళ్ల కోరిక. దానికి తగిన విద్యార్హత కానీ, ఇంగ్లీష్ సంభాషణా నైపుణ్యం కానీ ఉండవు. ఇంతలో హార్డీ సింగ్ (షారుఖ్) అనే మాజీ సైనికుడు ఆ ఊరికి ఒక పని మీద వస్తాడు. అతను వీళ్లని లండన్ చేర్చే విషయంలో దోహదపడతాడు. అయితే లీగల్ గా కాదు, ఇల్లీగల్ గా! అలా ఇల్లీగల్ గా దేశ సరిహద్దుని దాటే ప్రక్రియనే డంకీ అని పిలుస్తారు. అదే ఈ సినిమా టైటిల్. ఇంతకీ వాళ్లు డంకీ మార్గంలో లండన్ చేరుకోవడానికి ఎలా ప్రయత్నిస్తారు? తర్వాత ఏమిటి అనేదే సినిమా. 

ఏదో చేద్దామానుకుని ఏదో చేస్తే చివరికి ఏదో అయ్యిందన్నట్టుగా ఉంది ఈ సినిమా పరిస్థితి. 

ఇంగ్లాండులో ఉద్యోగాలు పొందాలంటే ఇంగ్లీష్ రావాల్సి రావడం, అస్సలు ఇంగ్లీషు రాని ఈ ప్రధాన పాత్రలకి బొమన్ ఇరానీ వచ్చీరాని అరకొర ఇంగ్లీషుని నేర్పడం.. దాని చుట్టూ కామెడీని నడిపించాలనుకోవడం బాగానే ఉంది. 

ఈ ట్రాక్ లో కొంత వరకు కామెడీ అయితే కుదిరింది. ఇంగ్లీషు రాక ఇమిగ్రేషన్ ఇంటర్వ్యూలో డింకీ కొడితే ఇక వేరే దారి లేదన్నట్టు డంకీ మార్గంలో (ఇల్లీగల్ మార్గంలో) లండన్ కే వెళ్లాలన్న తెగింపు దేనికి? ఇలాంటి వారి కోసం గల్ఫ్ దేశాలు ఎప్పటి నుంచో తలుపులు తెరిచే పెట్టాయి కదా. చాలామంది ఆ మార్గంలో వెళ్లి జీవితాల్ని మెరుగుపరుచుకున్నవాళ్లు, బాగా స్థిరపడిన వాళ్లు కూడా ఉన్నారు కదా! అది వదిలేసి భారతీయ యువతకి ఇంగ్లాండే దిక్కు అన్నంతగా ఎందుకు రాసుకోవాలి కథని? 

అసలీ కథలోనే తేడా ఉందనుకుంటే దానికి తోడు కొన్ని షారూక్ డైలాగులు కానీ, చివర్లో సినిమా అయిపోయాక వచ్చే స్టేట్మెంట్స్ కానీ మరీ ఫూలిష్ ఎమోషనల్ గా ఉన్నాయి.

పేదరికం కూడా ప్రమాదమే కాబట్టి... అటువంటి శరణార్ధులకి ప్రతి అగ్రదేశం ఆశ్రయం ఇవ్వాలంటాడు దర్శకుడు. దీనికి రష్యా నుంచి ఏ వీసా లేకుండా ఇండియాకి వచ్చే పక్షులని ఉదాహరణగా చూపిస్తాడు. పక్షులకి లేనప్పుడు మనుషులకి ఎందుకు ఈ సరిహద్దులు అంటాడు! తాత్వికంగా ఎలా ఉన్నా ప్రాక్టికల్ గా ఆలోచిస్తే వినడానికే విడ్డూరంగా ఉన్న లాజిక్ లేని పాయింట్ ఇది. 

ఇన్ని సరిహద్దులు, వీసాలు, చెకింగులు ఉంటేనే మెక్సికో నుంచి అమెరికాలోకి, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ల నుంచి ఇండియాలోకి బోలెడంతమంది డంకీ మార్గంలో చేరుకుంటున్నారు. వాళ్లు ఇబ్బంది పడుతున్నారు, ఇంకొందరు ఇబ్బంది పెడుతున్నారు. ఇక అడిగినవారికి ఆశ్రయాలు ఇవ్వడం వల్ల యూరోప్ ఎంత ఇబ్బంది పడుతోందో చూస్తున్నాం.

శరణార్ధులుగా వచ్చిన వాళ్లు తమ సంఖ్యాబలం పెంచుకుని లోకల్ న్యాయవ్యవస్థని పక్కన పెట్టి తమ గ్రూప్ కి సంబంధించిన న్యాయశాస్త్రాన్ని అమలు చేయమంటున్నారు.

ఇన్ని జరుగుతున్నా అసలు సరిహద్దుల్నే చెరిపేయండి, అన్ని దేశాల పేదవారిని అక్కున చేర్చుకోండి అని మహాత్ముడిలాగ ప్రబోధం చేయడమే వింతగా ఉంది. అది కూడా రాజ్ కుమార్ హిరానీ నుంచి రావడం మరీ చిత్రంగా ఉంది. 

ఏదో నలుగురు యువతీయువకుల కథ, వాళ్లు పడ్డ ఇబ్బందులు అవీ చూపిస్తే అంత కంప్లైంట్ ఉండదు. కానీ ఇచ్చిన మెసేజే తెలివితక్కువగా ఉంది. 

ఇందులో ఒక పాత్రకి లండన్ వెళ్లి అక్కడున్న ఒకమ్మాయిని ఇండియాకి తీసుకురావాల్సిన పరిస్థితి. దానికి ఇంగ్లీష్ నేర్చుకోవడం దేనికి? విజిటర్ వీసా కోసం ఎందుకు ప్రయత్నించడో అర్ధం కాదు!

అదలా ఉంటే, మాజీ అర్మీ జవాన్ ని హీరోగా పెట్టుకుని ఏ కష్టమొచ్చినా, ఆర్ధికపరమైన ఇబ్బంది వచ్చినా ఇండియాలోనే ఉండి చక్కబెట్టుకోవచ్చనే ఎమోషన్ నడపాలి కానీ, వాళ్ల మెరుగైన జీవనం కోసం నలుగుర్ని ఇల్లీగల్గా దేశం బోర్డర్ దాటించి అందులో హీరోయిజం వెతుక్కోమంటే ఎలాగండీ రాజ్ కుమార్ హిరానీ గారు!? 

ఇలాంటి కథ రాసి అందులో దేశభక్తి ఉందని మభ్యపెట్టడం ఎంతవరకు సమంజసం? 

అభినయం పరంగా షారుఖ్ రెండు షేడ్స్ ఉన్న పాత్ర పోషించాడు. జవాన్, పఠాన్ లో మాదిరిగా భయంకరమైన యాక్షన్ సీన్లు అవీ చేయనవసరంలేని సటిల్ పాత్రలో ఒదిగిపోయాడు. 

తాప్సీ కూడా యంగ్, ఓల్డ్ పాత్రల్లో కనిపించింది. హత్తుకునేంతగా లేదు కానీ, తన పాత్రకు తాను న్యాయం చేసింది. 

విక్కీ కౌశల్ అభినయం ఆకట్టుకుంటుంది. ఎమోషన్ ని బాగా పండించిన పాత్ర ఇతనిది. బొమన్ ఇరానీ, అనీల్ గ్రోవర్, విక్రం కొచ్చర్ లు ఓకే. 

టెక్నికల్ గా చూస్తే ఇంత వీక్ మ్యూజిక్ హిరానీ సినిమాల్లో ఎప్పుడూ వినిపించలేదు. ఒక్క లుట్ పుట్ తప్ప మిగిలినవి ఏవీ హాంట్ చెయ్యవు. కెమెరా వర్క్ బాగుంది.  

ఫస్టాఫ్ సరదాగా సాగినా ఇంటెర్వల్లో ఎమోషన్ పండినా, సెకండాఫ్ అంతా తేడా కొట్టింది. 

చాలా సన్నివేశాలు కన్వీనియంటుగానూ, అతకనట్టుగానూ, అతిగానూ ఉన్నాయి. కొన్నైతే పైన చెప్పుకున్నట్టు లాజిక్ లేకుండా, అనేక డౌట్లు తెచ్చిపెట్టేలా ఉన్నాయి. ఒక్క వాక్యంలో చెప్పాలంటే సిల్లీగా అనిపించే కథని ఎమోషనల్ గా నడిపించే ప్రయత్నం ఈ "డంకీ". కానీ డింకీ కొట్టింది.

బాటం లైన్: డింకీ

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?