Advertisement

Advertisement


Home > Movies - Reviews

Extra Ordinary Man Review: మూవీ రివ్యూ: ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్

Extra Ordinary Man Review: మూవీ రివ్యూ: ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్

చిత్రం: ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ 
రేటింగ్: 2.25/5

తారాగణం: నితిన్, శ్రీలీల, రాజశేఖర్, రావు రమేష్, రోహిణి, తదితరులు
సంగీతం: హారిస్ జయరాజ్
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
నిర్మాతలు: సుధాకర్ రెడ్డి, నికిత రెడ్డి
రచన- దర్శకత్వం: వక్కంతం వంశీ
విడుదల: 8 డిసెంబర్ 2023

ఈ చిత్రం ట్రైలర్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. సకుటుంబ సపరివార సమేతంగా  వినోదాత్మక చిత్రం చూడాలనుకునే వారికి ఇది పెద్ద ఊరట కావొచ్చనే అభిప్రాయం కలిగింది. నితిన్ కి మూడేళ్ళ తర్వాత "భీష్మ" కంటే పెద్ద విజయం దక్కుతుందేమోనన్న ఆశలు కూడా చిగురించాయి ట్రైలర్ చూసాక. ఇంతకీ విషయమేంటో చూద్దాం. 

అభినయ్ (నితిన్) సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్. ధవనవంతురాలైన లితిక (శ్రీలీల) తో ప్రేమలో పడతాడు. దాంతో తన యాక్టింగ్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి ఆమె కంపెనీలో నెలకి రెండు లక్షల జీతానికి చేరిపోతాడు. అంతలోనే ఒక కొత్త దర్శకుడు అతని దగ్గరకొచ్చి ఒక కథ చెప్పి తనని హీరోగా పెట్టి సినిమా తీస్తానంటాడు. దాంతో అభినయ్ లో మళ్లీ ఆశలు చిగురిస్తాయి. ఆ కథలో ఆంధ్ర-ఒరిస్సా బోర్డర్ దగ్గరున్న ఒక రియల్ విలన్ గురించి చెప్తాడు. హీరో ఆ పాత్రని ఎదుర్కోవాలి. అందుకని తన హీరో పాత్రలో ఇన్వాల్వ్ అయిపోతాడు అభినయ్. కానీ అనివార్యకారణాల వల్ల ఆ సినిమా తీయట్లేదని చెప్తాడు దర్శకుడు. అయినప్పటికీ ఆ స్క్రిప్టులో ఉన్న విధంగా చేసుకుపోతూ మన హీరో విలన్ కి ఎలా ఫుల్ స్టాప్ పెడతాడనేది కథ. 

అన్నం ఉడికిందో లేదో ఒక్క మెతుకు చూస్తే తెలుస్తుందన్నట్టుగా ఈ సినిమా మొదలయ్యి పావు గంట గడవగానే ఇది కామెడీ అనుకుని తీసిన సో-కాల్డ్ కామెడీ చిత్రమనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి పాత్ర అతిగానే బిహేవ్ చేస్తుంటుంది. ఎవర్ని సీరియస్ గా తీసుకోవాలో, ఎవరు కామెడీ పీసో అర్ధం కాక ప్రేక్షకులకి "ఫుల్ ఆఫ్ కంఫ్యూజన్"! ఆఖరికి సీరియస్ విలన్ కూడా నవ్వురాని పిచ్చి కామెడీ చేస్తూ అంతలోనే టపా టపా తుపాకి పేల్చి మర్డర్ చేస్తూ.. ఇలా చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటాడు. ట్రైలర్లో చూసిన బిట్లు వేటికవిగా బానే ఉన్నా ఇక్కడ ఫ్లోలో చూస్తున్నప్పుడు అనుకున్నంతగా పేలవు. 

ఇదంతా ఒకెత్తైతే సీన్లు తేడాగా ఉన్నా, కథా గమనం అటు ఇటుగా ఉన్నా నేపథ్య సంగీతానికి కాపాడే శక్తి ఉంటుంది. అలాంటిది ఇక్కడ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా వీక్ గా, ఔట్  డేటెడ్ గా ఉండడం వల్ల పరిస్థితి మరింత వికటించింది. 

మధ్యమధ్యలో రావురమేష్ చిత్రమైన సౌండ్స్ చేస్తూ గట్టిగా అరుస్తుంటాడు. హాల్లో ప్రేక్షకులు తెర మీద ఆ పాత్రలో తమను తాము చూసుకునే పరిస్థితి! చిన్నపిల్లలు స్కిట్టో, స్పూఫో చేస్తే నవ్వు రాకపోయినా వాళ్ళ కష్టనికి పెద్ద మనసుతో ఎలా చప్పట్లు కొడతామో అలా కొట్టాలంతే. వక్కంతం వంశీ లాంటి విషయమున్న రచయిత నుంచి కచ్చితంగా ఫార్ బెటర్ స్క్రిప్ట్ నే ఆశిస్తారు ఎవరైనా! 

ఇక స్క్రీన్ ప్లేలో గందరగోళం అంతా ఇంతా కాదు. ఒక చోట హీరో బిహేవియర్లో విషయం అర్ధం కాక విలన్ సుధేవ్ నాయర్ అయోమయంగా చూస్తుంటాడు. ప్రేక్షకులు కూడా ఆ సమయంలో అదే అయోమయంలో ఉంటారు- "ఫుల్ ఆఫ్ కంఫ్యూజన్"!. అంతలోనే హీరో వచ్చి ముందొచ్చిన సీన్ వెకుక, వెనుకటి సీన్ ముందుకు పెట్టి చూసుకో అర్ధమవుతుంది అంటాడు! అలాంటి స్క్రీన్ ప్లే టెస్టులు తెర మీద పాత్రలకి, తెర ముందున్న ప్రేక్షకులకి పెట్టిన అరుదైన చిత్రమిది. 

మంచి విషయాలు చెప్పుకోవాలంటే "డెంజర్ పిల్ల" పాట బాగుంది. నేపథ్య సంగీతంతో నిరాశపరిచినా పాటలతో పర్వాలేదనిపించాడు సంగీత దర్శకుడు. కెమెరా వర్క్ కూడా బాగుంది. బాలకృష్ణ, విజయ్ దేవరకొండ రష్మిక డేటింగ్, పవిత్ర లోకేష్ ల మీద స్పూఫ్ సీన్ నవ్విస్తుంది. జైల్లో "తాళం" మీద పాడే సాంగ్ కూడా సరదాగా ఉంది. అయితే ఓవరాల్ గా ఫ్లోలో గ్రిప్ ఉండుంటే ఇవన్నీ మరింత బాగా ఎంజాయ్ చేసేవాళ్లు ప్రేక్షకులు. 

హీరోని జూనియర్ ఆర్టిస్ట్ పాత్రలో పెట్టుకుని కథ రాసుకోవడమనే ఐడియా ఇంటరెస్టింగ్. ఎంచుకున్న స్పూఫ్ మేటర్ కూడా బాగుంది. అయితే ఎంత లాజిక్ అవసరం లేదనుకున్నా పొంతన కూడా అవసరం లేదనుకోవడం ఈ సినిమాలో మైనస్. 

ఉన్నట్టుండి మన హీరో ఫైనాన్స్ ఎక్స్పర్ట్ అయిపోయి ఒక పెద్ద కంపెనీ తరపున రిప్రజెంట్ చేస్తూ ట్యాక్స్ ఆఫీసర్స్ తో మాట్లాడి వాళ్లని కన్విన్స్ చేసేస్తాడు. మళ్లీ హఠాత్తుగా పోలీసాఫీసరైపోయి పెద్ద పెద్ద పనులు చేసేస్తాడు. ఇలా పొంతన లేకుండా సాగే మెయిన్ స్టోరీ వల్ల మిగిలిన స్పూఫులన్నీ నాన్ సింక్ లా అనిపిస్తాయి. 

అప్పట్లో వచ్చిన "అత్తారింటికి దారేది" లో స్పూఫ్, ఆ తర్వాత వచ్చిన "రేస్ గుర్రం" స్టైల్లో విలన్ క్యారక్టర్.. వంటివి స్ఫూర్తిగా తీసుకుని రాసుకున్న సీన్స్ కాలం చెల్లినట్టుగా అనిపిస్తాయి. 

నితిన్ బాగానే చేసాడు. లుక్స్ నుంచి పర్ఫామెన్స్ వరకు ఎక్కడా తేడాల్లేవు. 

శ్రీలీల పాత్ర మాత్రం తేలిపోయింది. ఆమె స్పెషాలిటీ అయిన డ్యాన్సులకి కూడా ఆమెని అంతగా వాడుకోలేదు. 

రావు రమేష్ పాత్ర లౌడ్ గా ఉంది. రోహిణి సటిల్ గా చేసింది. 

సుధేవ్ నాయర్ కాసేపు సీరియస్ గా, కొంచెం సేపు కామెడీగా కనిపిస్తూ రకరకాలుగ అకనిపించాడు.

పోలీస్ స్టేషన్లో బ్రహ్మాజి వగైరా జబర్దస్త్ టీం ఓకే.  

క్లైమాక్స్ కి ముందు వచ్చే రాజశేఖర్ క్యారెక్టర్ కాస్త సరదాగానే ఉన్నా ఆశించిన వినోదాన్ని మాత్రం అందించలేదు. 

అశ్లీలం, చీప్ డైలాగ్స్ లేవు కనుక ఈ చిత్రాన్ని ఫ్యామిలీ ఆడియన్స్ చూడడానికి ఇబ్బందైతే ఉండదు. అయితే కన్విన్సింగ్ కామెడీని ఆశిస్తే మాత్రం నిరాశ తప్పదు. చాలా ఎక్స్‌ట్రాలతో కూడిన ఈ "ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్" ఆర్డినరీగా అనిపిస్తుంది.  

బాటం లైన్: ఆర్డినరీ

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?