Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: గౌతమ్‌ నంద

సినిమా రివ్యూ: గౌతమ్‌ నంద

రివ్యూ: గౌతమ్‌ నంద
రేటింగ్‌: 2/5
బ్యానర్‌:
శ్రీ బాలాజీ సినీ మీడియా                                                                    
తారాగణం: గోపిచంద్‌, హన్సిక, క్యాథరిన్‌, సచిన్‌ ఖేడ్కర్‌, చంద్రమోహన్‌, ముఖేష్‌ రుషి, సీత, వెన్నెల కిషోర్‌, బిత్తిరి సత్తి తదితరులు
కూర్పు: గౌతరరాజు
సంగీతం: ఎస్‌.ఎస్‌. థమన్‌
ఛాయాగ్రహణం: ఎస్‌. సౌందర్‌ రాజన్‌
నిర్మాతలు: జె. భగవాన్‌, జె. పుల్లారావు
కథ, కథనం, మాటలు, దర్శకత్వం: సంపత్‌ నంది
విడుదల తేదీ: జులై 28, 2017

'ధనం మూలం ఇదమ్‌ జగత్‌' అనే పాయింట్‌పై సినిమా తీసిన సంపత్‌ నంది 'కథనం మూలం ఇదమ్‌ సినిమా' అని విస్మరించాడు. ఒక పాయింట్‌ అనుకుని, ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ రాసుకుని, క్లయిమాక్స్‌లో ఒక ట్విస్ట్‌ జత చేసేస్తే సినిమాలు ఆడేస్తాయనుకుంటే ఇక ఏళ్ల తరబడి కథలపై కసరత్తులు దేనికి? ఒక కథ అనుకున్న తర్వాత ఫస్ట్‌ డ్రాఫ్ట్‌ స్క్రిప్ట్‌తో షూటింగ్‌కి వెళ్లిపోతే ఆ సినిమా ఎలా తయారవుతుందో అలాగుంది గౌతమ్‌ నంద పరిస్థితి! వచ్చిన సీన్లే రిపీట్‌ అవుతూ, కూర్చున్న చోటి నుంచి కథ ముందుకి కదలక, పతాక సన్నివేశాల వరకు ఆసక్తిగొలిపే ఒక్క అంశమూ కనిపించదు. క్లయిమాక్స్‌కి ముందు వచ్చే ట్విస్ట్‌ ఆసక్తి కలిగించినప్పటికీ అప్పటికే ఆలస్యమైపోయింది. 

ఇద్దరు ఒకేలాగుంటారు. ఒకరి స్థానంలోకి ఒకరు వెళతారు. తరువాత ఆ ఇద్దరి జీవితాల్లో ఏమి జరుగుతుంది? అనేది బ్లాక్‌ అండ్‌ వైట్‌ కాలం నుంచీ చూస్తోన్న కథే. ఆ పాయింట్‌కి 'డబ్బు' అనే మరో ఎక్సయిటింగ్‌ ఎలిమెంట్‌ జత చేస్తే కొత్తదనం వచ్చేస్తుందని అనుకున్న సంపత్‌ నంది, అంతకుమించి ఏమీ ఆలోచించలేకపోయాడు. డబ్బున్న వాడంటే ఖరీదైన కార్లు, విలాసవంతమైన భవంతులు, బ్రాండెడ్‌ బట్టలు, యాక్ససరీలు... పేదవాడంటే చిల్లు పడ్డ ఇంటి పైకప్పు, ఆకలిదప్పులు, దోమలు, నీళ్ల కోసం ఫైట్లు అన్నట్టు అవే విషయాలని తిప్పి, తిప్పి చూపించాడే తప్ప అపారమైన ధనంతో అతడేమి కోల్పోయాడో, అస్సలు డబ్బుల్లేక ఇతనెంత కష్టపడ్డాడో ఎస్టాబ్లిష్‌ చేయలేదు. కనీసం రెండు క్యారెక్టర్లు చనిపోదామనుకునే డెసిషన్‌ తీసుకోవడానికి అయినా ఒక బలమైన కారణం వుండాలి కదా?

క్లయిమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌ చెబితే తప్ప అస్సలు ఇంట్రెస్ట్‌ కలిగించని కాన్సెప్ట్‌ తీసుకుని, ఇంత ఫ్లాట్‌ స్క్రీన్‌ప్లేతో స్టోరీ నెరేట్‌ చేస్తే రక్తి కడుతుందని దర్శకుడు ఎలా భావించాడో అర్థం కాదు. కనీసం ఆ ట్విస్టు తర్వాత జరిగేది అయినా ఎక్సయిటింగ్‌గా వుంటుందా అంటే అదీ లేదు. ఫ్రేమ్స్‌ అన్నీ రిచ్‌గా వుంటే కళ్లు రిక్కించి చూసేస్తారనే భ్రమలో వున్నట్టుగా కేవలం ఫ్రేమింగ్‌ మీదే దృష్టి పెట్టిన సంపత్‌ నంది కాస్త కూడా కథనం మీద దృష్టి సారించలేదు. దీంతో అతను నిజంగా ఎమోషన్స్‌ చూపించినపుడు కూడా అవి కదిలించక పోగా, వీధి నాటకాన్ని తలపిస్తాయి. అదే ట్విస్టుని ఇంటర్వెల్‌ బ్యాంగ్‌గా పెట్టుకుని, సెకండ్‌ హాఫ్‌ మొత్తం వాళ్లిద్దరి మధ్య క్యాట్‌ అండ్‌ మౌస్‌ గేమ్‌గా తీర్చి దిద్దినట్టయితే గౌతమ్‌ నంద ప్రామిసింగ్‌గా తయారయ్యేదేమో మరి. కథలో ఆసక్తికర అంశం వున్నపుడు దాని చుట్టూ కథనం అల్లుకోవాలే తప్ప, దానిని క్లయిమాక్స్‌ ముందు ట్విస్టుగా వాడేసి థ్రిల్‌ ఇద్దామంటే కుదరదు. 

గోపిచంద్‌ హీరోగా రాణించాడు కానీ విలన్‌గా ఇంకా బాగుంటాడు. ఈ సంగతిని 'గౌతమ్‌ నంద' ఇంకోసారి ఘనంగా చాటుతుంది. హన్సిక 'తెల్లతోలు పిల్ల'గా బస్తీ దొరసాని లెక్క అనిపించిందే తప్ప బస్తీ పిల్లలా అస్సలు కనిపించలేదు. క్యాథరిన్‌ మరోసారి గ్లామర్‌ పాత్రకే పరిమితం అయింది. మసాలా అవసరార్ధం స్విమ్‌సూట్‌లోను కనిపించిన క్యాథరిన్‌ అంతకుమించి ఈ పాత్రలో చేయడానికేమీ లేదనుకోండి. ముఖేష్‌ రుషి నటన, అతనికి రాసిన డైలాగులు, చెప్పిన డబ్బింగ్‌ డెబ్బయ్‌ల కాలం నాటి విలన్‌ని తలపిస్తాయి. చంద్రమోహన్‌ ఒక్కరే నటనతో మెప్పించగా, మిగిలిన వాళ్లంతా యాక్షన్‌, కట్‌కి మధ్య డైలాగులు చెప్పేసి మమ అనిపించాలని చూసారు. 

సన్నివేశాల్లో విషయం లేకపోయే సరికి నేపథ్య సంగీతంతో అయినా సందడి చేద్దామని చూసిన తమన్‌ అత్యుత్సాహం చూపించి కాస్త ఎక్కువ వాయించాడు. తద్వారా చెవి నొప్పి, తల నొప్పి తప్ప ఒరిగిందంటూ ఏమీ లేదు. పాటలు సైతం ఇంకోసారి వినాలనిపించే ఫీల్‌ కూడా తీసుకు రాలేదు. సినిమాటోగ్రాఫర్‌ ఈ చిత్రాన్ని రిచ్‌గా తీర్చిదిద్దాడు. నిర్మాతలు పెట్టిన ఖర్చుకి మించిన అవుట్‌పుట్‌నే తీసుకొచ్చాడు. కలర్‌ గ్రేడింగ్‌, ఎఫెక్ట్స్‌ వగైరా కూడా బాగానే వున్నాయి. సంపత్‌ నంది రాసిన సంభాషణలు కానీ, అతని మేకింగ్‌ స్టయిల్‌ కానీ ఈ ట్రెండుకి తగ్గట్టు లేవు. ఆ హైస్పీడ్‌ షాట్స్‌లో హీరోని చూపించడమే హీరోయిజమ్‌ అనుకుంటే ఇక రియల్‌ హీరోయిజం చూపించడానికి, మాస్‌ని ఎక్సయిట్‌ చేయడానికి మెటీరియల్‌ దొరకదు. రచ్చ, బెంగాల్‌ టైగర్‌ చిత్రాలకి ఫార్ములాని ఫాలో అయిన సంపత్‌ నంది ఈసారి కథాబలం బాగా వుందనే ఫీలింగ్‌తోనో ఏమో ఫార్ములాని కూడా వదిలేసి తీసిన సీన్లనే మళ్లీ మళ్లీ తీసుకుంటూ కాలక్షేపం చేసాడు.

ద్విపాత్రాభినయం చేసిన గోపిచంద్‌ రిచ్‌ క్యారెక్టర్‌ ఇంట్రడక్షన్‌తో కథ మొదలవుతుంది. తర్వాత పూర్‌ క్యారెక్టర్‌ బ్యాక్‌గ్రౌండ్‌ వివరించడంతో ఇంటర్వెల్‌ వస్తుంది. ఈ రెండు పాత్రలు ప్లేస్‌లు మారిన తర్వాత మళ్లీ ఇప్పుడు రిచ్‌ క్యారెక్టర్‌ అక్కడేమి కష్టాలు పడుతోంది, పూర్‌ క్యారెక్టర్‌ ఇక్కడ ఎంత ఎంజాయ్‌ చేస్తోంది అనేది మాత్రమే కనిపిస్తుంది. క్యారెక్టర్స్‌ని ఇంటర్‌ఛేంజ్‌ చేసి లిటరల్‌గా ఫస్ట్‌ హాఫ్‌నే సెకండ్‌ హాఫ్‌లోను తిరిగి చూపించడం జరిగింది. ఫైనల్‌గా ట్విస్ట్‌ ఇచ్చేసి క్లయిమాక్స్‌ని వెతుక్కుంటూ పోయిన ఈ సినిమాలో స్టఫ్‌ లేదనే సంగతి దర్శకుడు ఏ తరుణంలోను గుర్తించకపోవడం విచిత్రంగా తోస్తుంది. ఇదే కథని మళ్లీ మళ్లీ తీసి చాలా మంది డైరెక్టర్లు హిట్లు కొట్టారు. చిరంజీవి అయితే దొంగ మొగుడు, రౌడీ అల్లుడు రూపంలో రెండుసార్లు ఇదే కథని రిపీట్‌ చేసి సక్సెస్‌ అయ్యారు. ఇటీవలి కాలంలో చరణ్‌ కూడా 'నాయక్‌'తో హిట్‌ సాధించాడు. అన్ని భాషల్లోను తరచుగా కనిపించే ఈ పాయింట్‌ని సంపత్‌ సరిగ్గా హ్యాండిల్‌ చేసినట్టయితే ఇది కూడా అలరించేదే. కానీ ఓవర్‌ కాన్ఫిడెన్స్‌తో, అవసరానికి మించిన స్టయిల్‌తో అసలు వదిలేసి కొసరు విషయాల మీద దృష్టి పెట్టడంతో మొదటికే మోసం వచ్చి బోరింగ్‌ ఫేర్‌గా మారింది. చివరి పావుగంట పాటయినా ఆ మాత్రం ఆసక్తి కలగకపోతే కనుక అసలు ఈ సినిమా గోపీచంద్‌ ఎందుకు చేసాడనే అనుమానం కూడా కలిగేది. అంత విషయ శూన్యంగా సాగే ఈ చిత్రం సోకాల్డ్‌ మాస్‌ ప్రేక్షకులని అలరించడమూ కష్టమేననాలి.

బాటమ్‌ లైన్‌: గోవిందా గోవింద!

గణేష్‌ రావూరి

గౌతమ్‌ నంద పబ్లిక్ టాక్ కోసం క్లిక్ చేయండి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?