Advertisement

Advertisement


Home > Movies - Reviews

Hi Nanna Review: మూవీ రివ్యూ: హాయ్ నాన్న

Hi Nanna Review: మూవీ రివ్యూ: హాయ్ నాన్న

చిత్రం: హాయ్ నాన్న
రేటింగ్: 2.5/5
తారాగణం:
నాని, మృణాల్ ఠాకూర్, బేబీ కియారా ఖన్నా, ప్రియదర్శి, జయరాం, అంగన్ బేడి తదితరులు
సంగీతం: హేషం అబ్దుల్ వాహబ్
కెమెరా: సను జాన్ వర్ఘీస్
ఎడిటింగ్: ప్రవీణ్ ఆంటోనీ
నిర్మాతలు: మోహన్ చెరుకూరి, విజయేందర్ రెడ్డి తీగల
రచన-దర్శకత్వం: శౌర్యువ్
విడుదల: డిసెంబర్ 7, 2023

నాని సినిమా అనగానే ఒక అంచనా ఉంటుంది. కథలోనో, కథనంలోనో ఎంతో కొంత విషయం లేనిదే నటించడనే అభిప్రాయం ఉంది. మృణాల్ ఠాకూర్ ఇంకా సీతారామం నటీమణిగా క్లాస్ ఆడియన్స్ కి దగ్గరగా ఉంది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో "హాయ్ నాన్న" అనగానే, ప్రేక్షకులు కూడా "హాయ్" అంటూ థియేటర్స్ కు రావడం సహజం. ఇక ఎలా ఉందో చెప్పుకుందాం. 

విరాజ్ (నాని) ఒక ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్. మహి అనే తన ఆరేళ్ల పాపకి (కియారా ఖన్నా) సింగిల్ పేరెంట్ గా ఉంటూ ముంబాయిలో జీవనం సాగిస్తుంటాడు. ఆ పాపకి ఒక ప్రాణాంతకమైన ఊపిరితిత్తుల వ్యాధి. ఈ ఇద్దరికీ తోడుగా ప్లూటో అనే పెంపుడు కుక్క. అలాగే ఇంట్లో పాపకి తాత (జయరాం). ఇదీ హీరో కుటుంబం. 

అనుకోకుండా ఆ పాప ఒక రోడ్ యాక్సిడెంటుకి గురి కాబోతుంటే యష్ణ (మృణాల్ ఠాకూర్) అనే అమ్మాయి కాపాడుతుంది. అలా పరిచయమైన ఆ ఇద్దరూ దగ్గరవుతారు. ఆ క్రమంలో విరాజ్ తో కూడా యష్ణ ప్రేమలో పడుతుంది. అసలు విరాజ్ సింగిల్ పేరెంట్ గా ఎందుకుంటున్నాడు? తన భార్య ఏమయ్యింది? విరాజ్-యష్ణ ల బంధం ఏమౌతుంది అనేది కథ. 

నిజానికి ఎమోషన్ ని పండించడానికి మంచి స్కోప్ ఉన్న కథ ఇది. ఇందులో ఆరేళ్ల మహి పాత్ర చాలా మెచ్యూర్డ్ గా బిహేవ్ చేస్తుంటుంది. అది రచయిత గొప్పతనమా లేక ఏ హాలీవుడ్ సినిమా అయినా స్ఫూర్తా అనే అనుమానాలొస్తాయి. ఆ అనుమానాన్ని బలపరిచేదే "డెఫినెట్లీ, మే బీ" చిత్రం. ఇది ఆ సినిమాకి దగ్గరగా సాగే కథాంశం. 

సినిమా మొదలైన చాలా సేపటి వరకు ఎక్కడా డ్రాప్ లేకుండా నడుస్తుంటుంది కథ. యెస్, "నడుస్తుంటుంది.." పరుగెట్టదు. అయినా పెద్దగా ఇబ్బంది అనిపించదు. హ్యూమన్ ఎమోషన్స్ ని పండించడానికి దర్శకుడు తగిన సమయం తీసుకోవడం తప్పు కాదనిపిస్తుంది. 

డైలాగ్స్ కూడా గ్రిప్పింగ్ గా ఉండడం, మరీ ముఖ్యంగా నాని, మృణాల్ సహజమైన నటనతో ఆకట్టుకోవడం వల్ల బోర్ కొట్టదు. 

కానీ ఇంటెర్వల్ కి ముందు వచ్చే సన్నివేశంతో దర్శకుడు పాత చింతకాయ ఫార్ములాని పట్టుకున్నాడని అర్ధమౌతుంది. మరీ అంత కన్వీనియంట్ గా రాసుకోవాలా అనిపిస్తుంది. దాంతో మొదలైన డ్రాప్ సెకండాఫులో కూడా కొన్ని రొటీన్ సీన్స్ తో పడుతూ లేస్తూ ఉంటుంది. 

అంతే కాకుండా జయరాం లాంటి గొప్ప నటుడిని పెట్టుకుని అతనిని సరిగ్గా ఎందుకువాడుకోలేదో అర్ధమవ్వదు. క్లైమాక్స్ లో ఒక సీనులో ఆయనకి కాస్త వేల్యూ ఇచ్చినా అది కూడా పెద్ద డెప్త్ లో లేదు. శృతిహాసన్ లాంటి నటిని అంత చిన్న కేమియోకి పరిమితం చేసి ఉపయోగమేంటో తెలీదు. పైగా అది ఆమె ఇమేజ్ ని దిగజార్చేలా ఉంది తప్ప ఏ మాత్రం ఎలివేషన్ లేని అతిథి పాత్ర అది. 

అప్పటివరకు సీరియస్ గా సాగుతున్న కథలో కాస్త కామెడీ లాంటిది పెట్టకపోతే జననానికి రిలీఫ్ ఉండదనుకున్నాడేమో గానీ...నాని, మృణాల్ ల మధ్య గోవాలో తాగుడు సీనొకటి పెట్టి ఫ్లావర్ మార్చాడు దర్శకుడు. అది నాన్ సింక్ లా అనిపిస్తుంది. 

ఆ మైనస్సుల్ని పక్కనపెడితే చెప్పుకోవడానికి మంచి విషయలు కూడా ఉన్నాయిందులో. 

ముందుగా చెప్పుకోవాల్సింది సంగీతం. ఈ సినిమాకి పెద్ద సేవింగ్ అదే. ఎక్కడా డ్రాప్ లేకుండా ఇంత స్లో కథనాన్ని కూడా చూసేలా చేసిందంటే వెనుక వినిపించే నేపథ్య సంగీతమే. 

అలాగే ప్రతి పాట బాగుంది. సంగీతమే కాదు, సాహిత్యం కూడా ఆకట్టుకుంది. "ఇటు రావే నా గాజుబొమ్మ.." పాటలో మంచి డెప్త్ ఉన్న పంక్తులున్నాయి. అలాగే "సమయమా.." అనే పాటలో "చెంగావి చెంపల్లో మౌనం.." లాంటి ఎక్స్ప్రెషన్స్ ఫ్రెష్ గా అనిపించాయి. 

సంభాషణలు కూడా మెచ్చుకోదగ్గవిగా ఉన్నాయి. ప్రేమకి, బాధ్యతకి తేడా చెప్పే డైలాగ్ బాగుంది. కెమెరా వర్క్ అయితే నీట్ గా ఉంది. 

ప్రధమార్ధం నిదానంగా ఉన్నా బాగుంది. ద్వితీయార్ధం బాగుందనుకునే లోపు రొటీన్ గా అనిపించే సీన్స్ తో డ్రాప్ అవుతూ ఉంటుంది. 

స్క్రీన్ ప్లేలో పెట్టుకున్న ట్విస్టులు కొన్ని కథకి పెద్దగా పనికిరానివి ఉన్నాయి. హీరోయిన్ తల్లిదండ్రుల మధ్య గొడవేమిటో సరిగ్గా ఎస్టాబ్లిష్ కాకపోవడం కూడా కథనలోపమే. 

చివరిగా చెప్పాలంటే ఇందులోని సెంటిమెంట్ డ్రామా పండీపండనట్టుగా ఉంది. మంచి స్కోప్ ఉన్నా కానీ కథనంలో పొరపాట్లు, మెయిన్ క్యారెక్టర్స్ మీద తప్ప మిగిలిన పాత్రల మీద ఫోకస్ పెట్టకపోవడం వంటివి ఆశించిన ఫలితాన్ని రాకుండా చేసాయి. స్లో నేరేషన్, రొటీన్ సన్నివేశాలు లేకపోతే మరింత మంచి అనుభూతిని అందించగలిగేది. 

ఇందులోని హీరోయిన్ స్టైల్లో చెప్పాలంటే... 
"ఈ కథకి మరింత బలమైన స్క్రీన్ ప్లే రాసుకుంటే బాగుండేది. 
రాసుకున్న స్క్రీన్ ప్లేకి ఊహించలేని ట్విస్టులు పెట్టగలిగుంటే బాగుండేది. 
ఆ ట్విస్టులు కూడా కథతో సంబంధముండి కథనాన్ని మరింత బలపరచగలిగితే బాగుండేది. 
అయితే అవన్నీ రాసుకున్నప్పుడే చూసుకునుంటే బాగుండేది". 

బాటం లైన్: అంత "హాయ్"గా లేదు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?