cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Reviews

మూవీ రివ్యూ: జై భీమ్‌

మూవీ రివ్యూ: జై భీమ్‌

టైటిల్: జై భీమ్‌
తారాగణం: సూర్య, ప్రకాష్ రాజ్, రావు రమేష్, లిజొమొల్ జోస్, మణికందన్ తదితరులు
కెమెరా: కదిర్
ఎడిటింగ్:
ఫిలోమిన్ రాజ్
సంగీతం: సీన్ రోల్డన్
నిర్మాతలు: సూర్య, జ్యోతిక
దర్శకత్వం: టి.జె. జ్ఞానవేల్ 
విడుదల తేదీ: 2 నవంబర్ 2021
స్ట్రీమింగ్: అమెజాన్ ప్రైం వీడియో 

నలుగురిలోనూ కూర్చుని వినోదాన్ని ఆస్వాదిస్తూ చూడదగ్గ సినిమాలు కొన్నుంటాయి. 

ఏకాంతంగా కూర్చుని భావేద్వేగాన్ని గుండెల్లోకి నింపుకుంటూ చూసేవి కొన్నుంటాయి. 

మొదటి రకం థియేటర్ కి వెళ్లి చూడదగ్గవైతే, రెండో రకం కేవలం ఓటీటీలో చూడాల్సినవి.

ఆ రెండో కోవకి చెందిన సినిమా "జై భీమ్‌". ఇది కల్పితకథ కాదు. 1990ల్లో జరిగిన ఒక యదార్థ సంఘటన.

చంద్రు అనే లాయర్ గిరిజనుల పక్షాన నిలబడి వారి వద్ద పైసా ఫీజు తీసుకోకుండా వారికి జరుగుతున్న అన్యాయాలకు న్యాయబద్ధంగా అడ్డుకట్టవేయగలిగారు. ఆయన కథే ఇది. అలాగని ఇదేమీ బయోపిక్ కాదు. ఇందులో ఆయన వ్యక్తిగత కథేమీ ఉందదు. కేవలం ఆయన ఒకానొక కేసులో చేసిన న్యాయపోరాటమే ఉంటుంది. 

అడ్వొకేట్ చంద్రు పాత్రలో సూర్య నటించారు. అతని పక్కన హీరోయిన్ లేదు. అంటే అసలిది కమెర్షియల్ ఫార్మట్ లో థియేటర్ కోసం సినిమానే కాదు. ఐజీగా ప్రకాష్ రాజ్, అడ్వొకేట్ జెనెరల్ గా రావు రమేష్ బలమైన పాత్రలు పోషించారు. 

మూడు దశాబ్దాల క్రితం పోలీసులు కొన్ని కులాలకి చెందిన నిరుపేద గిరిజన ప్రజలని ఎలా టార్గెట్ చేసి హింసించేవారనేది ఈ కథలోని మెయిన్ పాయింట్. కులవివక్ష ఎప్పుడో వందలేళ్ల క్రితం ఉండేది తప్ప మేం పుట్టాక ఎప్పుడూ చూడలేదు అని చెప్పే కొందరు జనానికి ఇది కనువిప్పు కలిగించే చిత్రం. 

బాధపడ్డవాడికి తప్ప బాధ తెలియదు. ఇదే సినిమా జరిగిన కథ కాకుంటే, బలవంతంగా తీసిన దళిత పక్షపాత సినిమా అని ఒక వర్గం సమాజం తీసిపారేసేదేమో. 

ఎలుకల్ని, పాముల్ని పట్టుకుంటూ పొలాల్లో కూలి పని చేసే జనానికి అక్షరజ్ఞానం అందకుండా, కనీసం ఓటు హక్కు కూడా కల్పించకుండా, ఎక్కడ ఏ నేరం జరిగినా నేరస్థుడు దొరకనప్పుడు వీరిలో ఒకరిని ఇరికించి జైల్లోకి తోసేసే ఆటవిక పర్వం దేశంలో చాలా చోట్ల జరిగింది. అలాగే తమిళనాడులో కూడా ఒకానొక ప్రాంతంలో జరిగింది. సినిమా చివర్లో ఆ వివరాలు పొందుపరిచారు. ఆ కథే ఇది.  

జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భావోద్వేగభరితంగా ఉంది. లాకప్పులో ఆడామగా తేడా లేకుండా పోలీసులు పెట్టే హింసలు చూస్తే కళ్లు చెమ్మగిల్లకుండా ఉండవు. కొందరు స్వార్థపరులైన పోలీసుల దాష్టీకం చూడ్డానికి కూడా మనసుని రాయి చేసుకోవాలి. చూస్తున్నది కథే కదా, అంతా నటనే కదా అని ఎమోషన్లోంచి బయటికొద్దామన్నా కూడా ఇది నిజమైన కథ అన్న ఆలోచన గుండెని పిండకుండా వదలదు. 

సూర్య-జ్యోతిక సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం అవార్డులు పొందే అవకాశమైతే ఉంది. సినిమాలో అగ్రభాగం కోర్ట్ రూం డ్రామానే. మిగతాదంతా లాకప్పు, గుడెసెలు. 

డీగ్లామరస్ పాత్రలో మలయాళ నటి లిజొమొల్ జోస్ అద్భుతమైన నటన కనబరచింది. అలాగే ఓటీటీ చిత్రాల పుణ్యమా అని ఈ మధ్య తరచూ కనిపిస్తున్న నటుడు మణికందన్ కూడా పాత్రకి అతికినట్టు సరిపోయి జీవించాడు. 

టెక్నికల్ గా చూస్తే తెలుగు డబ్బింగ్ ఆకట్టుకోదు. ఇంకొంచెం సహసిద్ధమైన పదాలతో సంభాషణలు చెప్పించుంటే బాగుండేది. అలాగే ప్రకాష్ రాజ్ వంటి పాపులర్ నటుడికి వేరే వాయిస్ లో డబ్బింగ్ చెప్పించడం వల్ల ఎబ్బెట్టుగా ఉంది. రావు రమేష్ మాత్రం తెలుగులోనూ, తమిళంలోనూ సొంత గొంతుతోనే డబ్బింగ్ చెప్పుకున్నారు. 

మిగిలిన నటీనటులందరూ వారి వారి పాత్రలకు తగ్గట్టుగా ఒదిగిపోయారు. నిజానికి ఏ స్టారూ లేకపోయినా ఈ చిత్రం ఆకట్టుకోవడంలో తేడా ఉండదు. 

కానీ సూర్య లాంటి స్టార్ ఇలాంటి చిత్రాన్ని నిర్మించి నటించడం.. ప్రకాష్ రాజ్, రావు రమేష్ లాంటి నటులు తోడవడం అనేది మెయిన్ స్ట్రీం లో ఆఫ్ బీట్ విప్లవంలాగ అనిపిస్తుంది. 

బాటం లైన్: చూడొచ్చు

హీరోలు దేవుళ్లా ఏందీ?

జగన్: దూకుడే.. ముందుచూపు ఏదీ?!