Advertisement

Advertisement


Home > Movies - Reviews

Jailer Review: మూవీ రివ్యూ: జైలర్

Jailer Review: మూవీ రివ్యూ: జైలర్

చిత్రం: జైలర్
రేటింగ్: 2.75/5
తారాగణం:
రజనీకాంత్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, సునీల్, రమ్య కృష్ణ, వినాయకన్, మిర్ణా మీనన్, తమన్నా, యోగి బాబు తదితరులు
సంగీతం: అనిరుధ్
కెమెరా: విజయ్ కార్తిక్ కన్నన్
ఎడిటింగ్: ఆర్ నిర్మల్
నిర్మాణం: సన్ పిక్చర్స్
దర్శకత్వం: నెల్సన్
విడుదల: ఆగష్ట్ 10, 2023

రజనీకాంత్ సినిమాలంటే ఇక పెద్దగా ఆడవు అనే అభిప్రాయాన్ని కలిగిస్తూ వస్తున్నాయి ఆయన తాజా సినిమాలు. కానీ ఎందుకో "కావాలయ్య" పాట వైరల్ అవ్వడం వల్ల కొంత, ట్రైలర్ చూసాక ఇందులో ఏదో విషయం ఉందేమో అనే అభిప్రాయం కలగడం వల్ల కొంత చాలామందిలో ఆసక్తి కలిగింది. ఇంతకీ ఏముంది ఇందులో? విషయంలోకి వెళదాం. 

ఎక్కడా సుత్తి లేకుండా డైరెక్ట్ గా గుడిలో విగ్రహం చోరీతో కథ మొదలవుతుంది. వర్మ (వినాయకన్) అనే స్మగ్లర్ ఆ క్రైం చేస్తాడు. ముత్తు (రజనీకాంత్) ఒక రిటర్డ్ జైలర్. అతని కొడుకు ప్రస్తుతం ఆ స్మగ్లింగ్ ముఠా కార్యకలాపాలపై కన్నేసిన ఏసీపీ. అతనిని ఆ స్మగ్లింగ్ గ్యాంగ్ కిడ్నాప్ చేస్తుంది. చనిపోయాడని కూడా కబురందుతుంది ముత్తు కుటుంబానికి. ముత్తు ఆ గ్యాంగ్ పై ప్రతీకారం తీర్చుకోవడం ప్రధాన కథ. 

కథగా చూస్తే హిందీలో పూరీ జగన్నాథ్ తీసిన "బుడ్డా హోగా తేరా బాప్" ఛాయలు ఆద్యంతం ఉంటాయి. అందులో కూడా పోలీసాఫీసరైన కొడుకుకి ప్రమాదాలు ఎదురైతే అడ్డంపడి ఫైట్స్ చేసే వృద్ధ తండ్రి పాత్రలో అమితాబ్ ని చూసాం. ఇక్కడ రజనీకాంత్..అంతే తేడా! అయితే క్లైమాక్స్ లో కమల్ హాసన్ "భారతీయుడు" పోలికలు కనిపిస్తాయి. హాలీవుడ్ మూవీ "ఎక్స్పెండిబుల్స్" లో లాగా సీనియర్ హీరోలు ఒక్కొక్కరు కథలోకి ప్రవేశిస్తుంటారు. 

ఇలా రకరకాల పాత సినిమాల ఫ్లేవర్ తగులుతున్నా మేకింగులో ఉన్న స్టైల్ వల్ల కొత్తగానే అనిపిస్తుంది.

సినిమా అంటే కథకంటే కథనం ప్రధానం. ఆ విషయంలో ప్రధమార్ధం చాలా ఆసక్తికరంగా మలిచాడు దర్శకుడు. కొన్ని అతి పోకడలు, విలన్ గ్యాంగులో ఓవరాక్షన్లు ఉన్నా అవన్నీ కథనంలో కలిసిపోయేలా ఉండడం వల్ల పెద్దగా కంప్లైంట్ అనిపించదు. ఎక్కడికక్కడ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాని బాగా నిలబెట్టింది. అలాగే కెమెరా యాంగిల్స్ కానీ, వాడిన ఎడిటింగ్ టెక్నిక్స్ కానీ, కొత్తతరం స్టాండర్డ్స్ ని ప్రతిబింబించాయి. 

అయితే ఈ పట్టంతా ప్రధమార్థంలోనే ఉంది. మలి సగం కూడా ఆ స్థాయిలో నిలబెట్టుంటే ఫలితం మరింత బాగుండేది. కానీ తడబడి కథనంలో పట్టుని సడలించినట్టయ్యింది. 

మళ్లీ క్లైమాక్స్ ని ఊహించని విధంగా ముగించడంతో కుర్చీలోంచి లేచి వెళ్లే ప్రేక్షకుడికి సంతృప్తి కలుగుతుంది. ఒక రకంగా ఎమోషనల్ వేలో పొయెటిక్ జస్టిస్ జరిగిన ముగింపు ఇది. 

ఇక సినిమాలోని మొమెంట్స్ గురించి చెప్పుకోవాలంటే ఫ్లాష్ బ్యాకులో తిహార్ జైల్ కి జైలర్ గా 1980ల నాటి వింటేజ్ రజనీకాంత్ ని తలపించాడు. మేకప్ కి, హెయి స్టైలిస్ట్ కి చప్పట్లు కొట్టాలి. అయితే ఆ సీన్ లో రజని లుక్ వరకే తప్ప అసలు కంటెంట్ మాత్రం దెబ్బకోట్టింది. స్టైల్ కి ప్రాధాన్యతనిచ్చి సబ్స్టాన్స్ ని చంపేసిన సీన్లు ఇలాంటివి ఇందులో కొన్నున్నాయి. అయితే రజనీకాంత్ సినిమాల్లో "అతి" కూడా అతికినట్టే ఉంటుంది. అదొక జానర్ అంతే. 

రమ్యకృష్ణ, మిర్ణా మీనన్ టేబుల్ మీద కూర్చుంటే రజనీకాంత్ చేసే (చేయించే)ఫైట్ కి వాళ్ల మీద రక్తం పడడం వగైరాలు "అరవ అతి" గా ఉన్నా అది కూడా ఒక స్టైల్ అన్నట్టుగా ఫ్లోలో కొట్టుకుపోయింది. 

జాకీ ష్రోఫ్ ఎపిసోడ్ రొటీన్ గా ఉంది. శివరాజ్ కుమార్ ట్రాక్ బాగుందనిపిస్తే, మోహన్ లాల్ పార్ట్ పేలవంగా ఉంది. ఇక సునీల్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ హడావిడిగా జరిగినా క్రమంగా పెదవి విరిచేలా తయారయ్యింది. సినిమా కథకి ఏ మాత్రం సంబంధం లేకపోయినా తమన్నా మాత్రం కట్టిపారేసింది తన అందంతో. కేవలం ఐటం సాంగ్ లాగ అనిపించకూడదు అన్నట్టుగా ఏదో కాస్తంత ట్రాక్ పెట్టారు. కానీ ఆమె స్థాయికి ఆ ట్రాక్ అంత బాలేదు. కమెడియన్ యోగి బాబు పాత్ర తొలిసగంలో బాగుంది. 

దర్శకుడు నెల్సన్ ఈ తరం ప్రేక్షకుల నాడికి తగ్గట్టుగా కథనాన్ని మలచడంలో మరోసారి తన టేలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు. అయితే సుత్తితో మొహం పగలగొట్టడం, చెవులు కత్తితో తెగ్గొట్టేయడం లాంటి హింసాత్మక సన్నివేశాలు చిరాకు పెట్టిస్తాయి. 

గత కొన్నేళ్లుగా వచ్చిన రజనీకాంత్ సినిమాల్లో ఇదే బెస్ట్ అన్నట్టుగా ఉంది. తన వయసుకి, ఇమేజ్ కి తగిన పాత్రలో రజనీకాంత్ కనిపించడం బాగుంది. స్టైలిష్ యాక్షన్ సినిమాలు ఇష్టపడేవారిని పెద్దగా నిరాశపరచని చిత్రమిది. అలాగని లోపాలు లేకపోలేదు. ఓవరాల్ గా రెండు గంటల యాభై నిమిషాల నిడివి గల సినిమా అయినప్పటికీ ఎక్కడా ల్యాగ్ ఉందనిపించదు. 

బాటం లైన్: వన్ మేన్ షో

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?