చంద్రబాబునాయుడుకు రాజకీయంగా చాణక్య తెలివితేటలు ఉంటాయని ఆయన గురించి బాగా తెలిసిన వారు అంటూ ఉంటారు. ఆ తెలివితేటలకు నిదర్శనాలే ఇప్పుడు కనిపిస్తున్నాయి.
చంద్రబాబునాయుడు- పవన్ కల్యాణ్ కలిసి.. లోపాయికారీ ఒప్పందంతో రాబోయే ఎన్నికల్లో జగన్ ను ఓడించడానికి సిద్ధం అవుతున్నారనేది అందరికీ తెలిసిన సంగతి. అయితే ఆ ఒప్పందంలో కూడా.. అనేక వక్రవ్యూహాలు తెరపైకి వస్తున్నాయి.
చంద్రబాబునాయుడు తన మాస్టర్ గేమ్ ప్లాన్ ను అమలులో పెడుతున్నారు. ఇక్కడ కీలకం ఏంటంటే.. పవన్ కల్యాణ్ కు చంద్రవ్యూహాల్లోని మర్మం అర్థం అవుతున్నప్పటికీ.. అంతకంటె వేరే గతిలేదు కాబట్టి.. డూడూబసవన్నలాగా తల ఊపుతున్నారు.
తెలుగుదేశం పార్టీకి తరఫున మూడుసార్లు గెలిచిన మాజీ మంత్రి పడాల అరుణ ప్రస్తుతం జనసేనలో చేరబోతున్నారట. రెండేళ్లుగా ఆమె టీడీపీకి రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. విశాఖలో ప్రారంభం కానున్న పవన్ కల్యాణ్ వారాహి యాత్రలో ఈ చేరిక ఉంటుంది.
అలాగే విశాఖపట్నం నాయకుడు పంచకర్ల రమేష్ బాబు కూడా జనసేనలో చేరిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలను చుట్టబెట్టేసిన ట్రాక్ రికార్డు పంచకర్లది! తెలుగుదేశం నుంచి వచ్చి తమతో చేరినప్పటికీ.. వైసీపీ ఆయనకు పెద్దపీట వేసి.. జిల్లా సారథ్య బాధ్యతలు అప్పగించింది. అయినా సరే.. ఆయన పార్టీని వీడి జనసేనలో చేరిపోయారు. వీరి చేరికలు కొత్త అనుమానాలు పుట్టిస్తున్నాయి.
చంద్రబాబుతో సాన్నిహిత్యం ఉన్న నాయకులనే.. జనసేనలోకి పంపి, వారికి కావాల్సిన సీట్లను జనసేనకు కేటాయించి.. వారి విజయానికి తెలుగుదేశం అక్కడ సహకరిస్తుందా? అనే అనుమానాలు పలువురికి కలుగుతున్నాయి. పంచకర్లకు పెందుర్తి నుంచి 2009లో ప్రజారాజ్యం తరఫున గెలిచారు. తర్వాత కాంగ్రెసులోకి, విభజన తర్వాత తెలుగుదేశంలోకి వెళ్లి యలమంచిలి నుంచి 2014 గెలిచారు. 2019లో ఓడిపోయారు. అప్పుడు వైసీపీ తీర్థం పుచ్చుకుని జిల్లా పార్టీ అధ్యక్షుడు అయ్యారు. అయినా పార్టీని వీడి జనసేనలో చేరారు. ఇప్పుడు పెందుర్తి టికెట్ కోసం పవన్ వద్ద భరోసా తీసుకున్నట్టుగా పుకార్లున్నాయి.
పడాల అరుణ, పంచకర్ల రమేష్ బాబు వంటి తెలుగుదేశం మూలాలు ఉన్న వ్యక్తులు జనసేనలో చేరడం గమనిస్తోంటే.. అంతా చంద్రబాబు స్కెచ్ లాగానే కనిపిస్తోంది. తన కోవర్టులు కొందరిని భాజపాలోకి పంపి ఒక రేంజి రాజకీయం నడిపిస్తున్న చంద్రబాబు.. ఇప్పుడు పవన్ కు పొత్తుల్లో సీట్లు పంచాలి గనుక.. తనకు కావాల్సిన వారిని కొందరిని ఆ పార్టీలోకి పంపుతున్నట్టుగా పలువురు భావిస్తున్నారు.
సీనియర్ నాయకులు ఎగబడి వచ్చి తన పార్టీలో చేరుతున్నారని పవన్ కల్యాణ్ అదే పనిగా మురిసిపోకుండా.. వచ్చిన వాళ్లు చంద్రబాబు మనుషులు అనే అప్రమత్తతతో ఉంటే ఆయనకే మంచిదని పార్టీ వర్గాలే భావిస్తున్నాయి. లేదా, ఇదంతా కూడా ఇరువురి అంగీకరాంతోనే అమలవుతున్న వ్యూహమా అనే అనుమానాలు కూడా కొందరిలో ఉన్నాయి.