వైసీపీకి చికాకు: ఒక కుట్ర, ఒక వర్గవిభేదాలు!

గడప గడపకు మన ప్రభుత్వం అనే పేరుతో జగన్ సర్కారు నిర్వహిస్తున్న కార్యక్రమం నిజంగా ఎంతో మంచి పని. ప్రభుత్వంలో ఉన్న వారు, తిరిగి ఎన్నికలు వచ్చేదాకా ఇంటింటికీ తిరుగుతూ ప్రజల వద్దకు రావడం…

గడప గడపకు మన ప్రభుత్వం అనే పేరుతో జగన్ సర్కారు నిర్వహిస్తున్న కార్యక్రమం నిజంగా ఎంతో మంచి పని. ప్రభుత్వంలో ఉన్న వారు, తిరిగి ఎన్నికలు వచ్చేదాకా ఇంటింటికీ తిరుగుతూ ప్రజల వద్దకు రావడం అనేది చరిత్రలో ఎన్నడూ జరిగిన సంఘటన కాదు. జగన్ చాలా వినూత్నంగా ప్రజలతో తమ ఎమ్మెల్యేలను మమేకం చేయడానికి ఇలాంటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని సత్ఫలితాలు కనిపిస్తూనే ఉన్నాయి. ఈ కార్యక్రమం కింద ఎమ్మెల్యేల దృష్టికి వచ్చే సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేకంగా నిధులు కూడా విడుదల చేస్తున్నారు. ప్రతిచోటా పనులు కూడా జరుగుతున్నాయి.

ఈ కార్యక్రమం ద్వారా రాజకీయంగా అధికార పార్టీకి కొంత లబ్ధి ఉండే మాట నిజమే. అయితే.. ప్రజలకు ఒనగూరే మేలే ఎక్కువ. అయితే.. ఎవ్వరు ఏ పనిచేసినా కొన్ని అపశృతులు దొర్లడం సహజం. పచ్చ మీడియా వాటిని హైలైట్ చేస్తూ ఉంటుంది. తాజాగా పలమనేరులో ఎమ్మెల్యే వెంకటే గౌడ పర్యటనలో వ్యతిరేకత ఎదురైంది.

ఓ గ్రామంలో మహిళ.. ‘ఈ ప్రభుత్వంలో మా కుటుంబానికి ఏమీ మేలు జరగలేదు.. మా ఇంటికి రావొద్దు’ అంటూ ఎమ్మెల్యేను వెళ్లగొట్టారు. ‘మీకు ఏం సమస్య ఉన్నదో చెప్పకుండానే.. అరిస్తే ఎలా? ముందు సమస్య చెప్పండి’ అంటూ ఎమ్మెల్యే అడిగినా కూడా ఆమె వినిపించుకోలేదు. ‘మా ఊళ్లో మాకు మేలుచేసేవాళ్లు ఎవరూ లేరు.. వెళ్లిపోండి’ అంటూ తిరస్కరించారు. 

సాధారణంగా తెలుగుదేశం పార్టీకి బలమైన కుటుంబాల్లో ఇలాంటి వ్యతిరేకత ఉంటుంది. ఇలాంటివే పచ్చమీడియాలో హైలైట్ అవుతుంటాయి. అదంతా ఓకే అనుకున్నప్పటికీ.. సమస్య ఏమిటో చెప్పమని ఎమ్మెల్యే అడిగినా కూడా ఏమీ చెప్పకుండా.. కేవలం తిరస్కరించడం అనేది కుట్ర కాక మరేమిటి? ఎమ్మెల్యే ఇంటికి వచ్చి ‘మీ సమస్య ఏంటని’ అడగడం అనేదే ప్రజాస్వామ్యంలో జగన్ సాధించిన గొప్ప విజయం. దానిని ఇలా దుర్వినియోగం చేసేవారిని ఎలా అర్థం చేసుకోవాలి? పచ్చకుట్రల గురించి ప్రజలు ఏం అనుకోవాలి.. అనేది చర్చనీయాంశం అవుతోంది.

అదే సమయంలో నియోజకవర్గాల్లో ముఠా తగాదాలు కూడా పార్టీకి ప్రమాదకరంగా మారుతున్నాయనే వైనం పలమనేరులో బయటపడింది. నియోజకవర్గంలోనే వైసీపీ రాష్ట్ర కార్యదర్శి విజయభాస్కర రెడ్డి వర్గానికి ఎమ్మెల్యేతో విభేదాలున్నాయి. ఆయనకు సమాచారం లేకుండా వారి స్వగ్రామంలో ‘గడపగడపకు..’ నిర్వహించాలని ఎమ్మెల్యే అనుకున్నారు. అయితే ఆ గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటనను పూర్తిగా బహిష్కరించారు. ఆయన రాకముందే.. ఇళ్లకు తాళాలు వేసుకుని ప్రజలు వెళ్లిపోయారు. దాంతో వేరే మార్గం లేక.. ఆ గ్రామాల్లో పర్యటనను ఎమ్మెల్యే రద్దు చేసుకోవాల్సి వచ్చింది.

పచ్చ కుట్రలు చేసే దుష్ప్రచారాన్ని పట్టించుకోనక్కరలేదు గానీ.. ఎన్నికలు మరెంతో దూరంలో లేవని ముఖ్యమంత్రే అందరినీ సన్నద్ధం కమ్మంటున్న తరుణంలో ఇంకా.. నియోజకవర్గాల్లో ఇలాంటి ముఠా తగాదాలు ఉంటే.. పార్టీకి నష్టం జరుగుతుందనే వాస్తవాన్ని నాయకత్వం గుర్తించాలి.