తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఈ ఏడాది జరగబోయే ఎన్నికల మీద కాస్త ఆశ ఉంది. అందరూ కలసికట్టుగా ఉండి కష్టపడి పనిచేస్తే.. ఈ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రాగలం అనే విశ్వాసం ఉంది.
కర్ణాటక ఎన్నికల తర్వాత.. కాంగ్రెసు పార్టీకి తెలంగాణలో వచ్చిన ఊపు ఒక ఎత్తు అయితే.. రాష్ట్రంలో ఇతర పార్టీల్లో అసంతృప్తి రగులుతున్న కీలక నాయకులు అనేకులు.. తమ భవిష్యత్తు మార్గంగా కాంగ్రెసు పార్టీనే ఎంచుకుంటున్న వైనం కూడా వారి ఉత్సాహాన్ని పెంచుతోంది. గెలుస్తామనే నమ్మకంతో పాటు.. పార్టీలో ఇప్పుడున్న విభేదాలు ఇలాగే కొనసాగితే.. గెలిచే అవకాశాన్ని కోల్పోతామనే భయం కూడా వారిలో ఉంది.
ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం కూడా.. పార్టీ బలోపేతం, ప్రజల్లోకి వెళ్లడం, ప్రజలను ఆకట్టుకునే హామీలు ఇలాంటి అనేక వ్యవహారాల కంటె.. పార్టీని సమైక్యంగా ఉంచడం మీదనే దృష్టి పెడుతోంది. మొన్నటికి మొన్న ఢిల్లీ నుంచి పార్టీ పెద్దలు వచ్చి ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించినప్పుడు కూడా.. వారు ప్రధానంగా దృష్టి సారించినది విభేదాలు లేకుండా ముందుకు వెళ్లడం గురించి మాత్రమే. ఈ రకంగా.. ఉన్న ముఠాలను దువ్వి.. సమైక్యంగా పార్టీని నడపడానికి ప్రయత్నాలు జరుగుతుండగా.. పార్టీలో కొత్త ముసలాలు పుడుతున్నాయి.
జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి రాబోయే ఎన్నికల్లో తాను పోటీచేస్తానంటూ మాజీ ఎంపీ అజారుద్దీన్ ప్రకటించడం, ఆ మేరకు నియోజకవర్గంలోని మూడు డివిజన్లలో ఆయన పర్యటించడం ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది. పైగా, జూబ్లీహిల్స్ ప్రజలు ఎమ్మెల్యేగా కొత్త మొహాన్ని కోరుకుంటున్నారని అజార్ అనడం కూడా వివాదం అవుతోంది. పీజేఆర్ తనయుడు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్ రెడ్డి వర్గీయులు అజార్ పర్యటనను అడ్డుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. తోపులాటలు జరిగాయి.
మొత్తానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి తానే అభ్యర్థిని అనుకుంటున్న విష్ణువర్దన్ రెడ్డికి ఇప్పుడు ఇంటిపోరు ఎదురైంది. అజారుద్దీన్.. తాను అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లిన తర్వాతే.. నియోజకవర్గంలో పర్యటనకు వచ్చినట్టుగా చెప్పడం గమనిస్తే.. విష్ణుకు వ్యతిరేకంగా పార్టీపెద్దలే అజార్ ను ఎగదోస్తున్నారా? అనే అనుమానాలు కూడా పలువురికి కలుగుతున్నాయి. ఉన్న ముఠాలను సర్దుతోంటే.. కొత్త ముసలం పుడుతున్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.