మోకాలికీ బోడిగుండుకీ ముడి పెడతారా?

మీడియాలో ఒక వర్గానికి తాము ప్రత్యేకంగా ఒక వర్గం మీద నిత్యం బురద చల్లుతూ ఉండాలనే కోరిక ఉంటుంది. అందుకు అనేక రకాల రంధ్రాన్వేషణలు చేస్తుంటారు. వక్రమార్గాలు వెతుకుతూ ఉంటారు. వీసమెత్తు అవకాశం కనిపిస్తే..…

మీడియాలో ఒక వర్గానికి తాము ప్రత్యేకంగా ఒక వర్గం మీద నిత్యం బురద చల్లుతూ ఉండాలనే కోరిక ఉంటుంది. అందుకు అనేక రకాల రంధ్రాన్వేషణలు చేస్తుంటారు. వక్రమార్గాలు వెతుకుతూ ఉంటారు. వీసమెత్తు అవకాశం కనిపిస్తే.. అడ్డగోలుగా విమర్శలకు దిగుతుంటారు. బురద పులుముతుంటారు. 

ఇంతవరకు దిగజారినా వారి తరహా అంతే అని అర్థం చేసుకోవచ్చు. అయితే ఏమాత్రం సంబంధం లేని విషయాన్ని, సంబంధం లేని సందర్భంలో.. తమకు నచ్చని వారి మీద బురద చల్లడానికి ఉపయోగించుకుంటే వారిని ఏం అనాలి? రజనీకాంత్ వ్యాఖ్యల నేపథ్యంలో ఈనాడు అలాంటి ప్రయత్నమే చేస్తోంది.

రజనీకాంత్ తన తాజా చిత్రం జైలర్ ఆడియో ఫంక్షన్ లో మాట్లాడిన కొన్ని మాటలను తీసుకుని.. వాటిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ముడిపెట్టి బురద చల్లడానికి పచ్చమీడియా కుటిలప్రయత్నం చేస్తోంది. నిజానికి ఇది పూర్తిగా అర్థం పర్థం లేని వ్యవహారం. ఎందుకంటే.. సినిమా ఆడియో ఫంక్షన్ లో రాజకీయాలు మాట్లాడడానికి రజనీకాంత్- పవన్ కల్యాణ్ లాగా విచక్షణ లేని మనిషి కాదు. 

ఇంతకూ ఏం జరిగిందంటే.. ‘‘మెరగని కుక్కా లేదు.. విమర్శించని నోరూ లేదు.. ఈ రెండూ లేని ఊరు లేదు.. ఎవరేం చెప్పినా మన పని మనం చేసుకుంటూ పోవాలి.. అర్థమైందా రాజా..’’ అని అన్నారు.

రజనీకాంత్ సూపర్ స్టార్ అయినప్పటికీ.. ఇటీవలి కాలంలో వరుసఫ్లాప్ లు ఎదుర్కొంటున్నారు. గురువారం విడుదల కాబోతున్న ఆయన జైలర్ చిత్రం మీద కూడా విమర్శలు, వెటకారాలు ఉన్నాయి. ఒకప్పట్లో సినిమా ఎంత చెత్తగా ఫ్లాప్ అయినా.. భారీగా ఓపెనింగ్స్ ఉండే స్టార్ డమ్ సొంతం చేసుకున్న రజనీకాంత్ సినిమాల గురించి.. తాజాగా ఏం వస్తోందో పట్టించుకునే వారే లేకుండాపోయారని ఇండస్ట్రీలోనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో పరిశ్రమలో తనకు నెగటివ్ గా మాట్లాడే వారిపై రజనీ ఇలా సెటైర్ వేశారు.

అయితే ఎల్లో మీడియా దీనిని వైసీపీకి ముడిపెడుతున్నారు. గతంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు వచ్చిన రజనీకాంత్ చంద్రబాబును కీర్తించిన నేపథ్యంలో.. వైసీపీ నేతలు అప్పట్లో రజనీని విమర్శించారు. ఇదంతా మే నెల ప్రారంభంలో జరిగింది. రజనీకాంత్ వారి విమర్శలను పట్టించుకోకుండా సైలెంట్ గానే ఉండిపోయారు. ఇప్పుడు జైలర్ వేదిక మీద మాట్లాడగానే.. ఇప్పటి మాటలు.. మూడు నెలల కిందటి వ్యవహారానికి సంబంధించినవని, వైసీపీ నేతలపై కౌంటర్ వేశారని పచ్చమీడియా ప్రచారం చేస్తోంది. 

వైసీపీ నేతలకు కౌంటర్ ఇవ్వాలంటే.. నేరుగా ఏపీలోనే ఆ పని చేయడానికి రజనీకి ధైర్యం లేదా.. తమిళనాడులో సినిమా ఆడియోవేడుకలో ముసుగులో మాట్లాడాలా? అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. పచ్చ మీడియా.. మోకాలికీ బోడిగుండుకీ ముడిపెడుతున్నదని అంటున్నారు.