విశాఖలో జనసేన వారాహి యాత్రకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇవాళ సాయంత్రం విశాఖలో పవన్ తొలి సభ వారాహి వాహనం మీద నుంచి ఉంటుంది. పవన్ కళ్యాణ్ సభ నేపధ్యంలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కండిషన్లు పెట్టారు. సిటీలో సెక్షన్ 30 అమలు అవుతుందని కూడా ప్రకటించారు.
దీని మీద జనసేన నాయకులు మండిపడుతున్నారు. తాము ప్రశాంతంగా సభలు సమావేశాలు నిర్వహించుకుందామని చూస్తూంటే అల్లర్లు జరుగుతాయని చెబుతూ సెక్షన్ 30 పేరుతో ఇబ్బందులు ఏమిటి అని అంటున్నారు. మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అయితే తాము ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని చెప్పారు. అయినా ఎందుకీ కండిషన్లు అని అంటున్నారు.
వారాహి సభకు అడ్డనుకు సృష్టిస్తున్నారని జనసేన నేతలు విమర్శలు చేస్తున్నారు. పోలీస్ వర్గాలు మాత్రం భద్రతాపరమైన చర్యలు ఎపుడూ ఉంటాయని అందులో భాగమే తప్ప ప్రత్యేకంగా జనసేనకు కండిషన్లు లేవని అంటున్నారు.
దీని మీద జనసైనిక్స్ ఒక వైపు పోలీసులు మరో వైపు అన్నట్లుగా విశాఖ వాతావరణం మారింది. ర్యాలీలు వద్దని పోలీసులు అంటూనే పవన్ ఇప్పటికి దాదాపు ఏడాది క్రితం విశాఖ వచ్చినపుడు ఎయిర్ పోర్టు నుంచి విశాఖ బీచ్ లోని హొటల్ దాకా ర్యాలీగా వెళ్లిన సంగతిని గుర్తు చేస్తున్నారు. ఆనాడు కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. పవన్ ఒక హొటల్ లో ఉండిపోయారు. జనవాణి కార్యక్రమం రద్దు అయింది.
ఇపుడు చూస్తే వైసీపీ కలల రాజధాని విశాఖలో పవన్ వారాహి మూడవ విడత ఏ విధమైన టెన్షన్ ని క్రియేట్ చేస్తుంది అన్నది రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది. పవన్ ఏమి మాట్లాడుతారు అన్నది కూడా రాజకీయ పక్షాలలో తర్కించుకునే పరిస్థితి ఉంది. జనసేన సభకు పోలీసుల ఆంక్షలు అంటూ అపుడే ఆ పార్టీ విమర్శలు చేస్తూంటే అంతా రొటీన్ అని పోలీసులు అంటున్నారు. ఇవాళ విశాఖలో ఏమి జరుగుతుంది అన్నది ఏపీ అంతా చూసేలాగానే ఉందిపుడు.