కొంచెం కష్టమైనా కచ్చితంగా మానుకోవాల్సిన అలవాట్లు, అలవాటు చేసుకోవాల్సిన అలవాట్లు కొన్ని ఉన్నాయి. ఈ మానుకోవాల్సిన అలవాట్లు చాలా మందికి ఉన్నవే! ఏ వయసు వారిలో అయినా ఈ అలవాట్లు ఉండవచ్చు.
ఏ వయసులో అయినా ఇవి మంచి అలవాట్లైతే కాదు. వీటిని కలిగి ఉండటం వల్ల నష్టం లేదని చాలా మంది అనేసుకోవచ్చు కానీ, వీటిని వదిలించుకుంటే మాత్రం.. కచ్చితంగా మెరుగైన జీవితం ముందుంటుంది! ఇంతకీ వదిలించుకోవాల్సిన ఈ అలవాట్లు ఏమిటంటే!
వ్యాయామం చేయకపోవడం!
ప్రస్తుత తరంలో .. తప్పనిసరిగా ఉండాల్సిన అలవాటు వ్యాయామం. ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏ మాత్రం లేకుండా కూడా ఇప్పుడు రోజు గడపడం కష్టం కాదు. కూర్చున్న చోటికే అన్నీ వచ్చేస్తున్నాయి. దీంతో.. ఏ పని కోసం కూడా పెద్దగా కదలాల్సిన అవసరం లేదు. మరి కొందరికి కదిలేంత టైమ్ ఉండదు. మరి ఎంత టైమ్ లేకపోయినా.. ఎంత బిజీగా గడపుతున్నా, ఎన్ని బాధ్యతలున్నా.. ఏదో రకంగా కాసేపైనా ఫిజికల్ ఎక్సర్ సైజ్ ను అలవాటుగా మార్చుకోవాలి. దానికి కేటాయించే సమయం తక్కువే అయినా.. ఫిజికల్ గా మెంటల్ గా చాలా ఉత్సాహం లభించడం ఖాయం.
అతిగా ఫోన్ చూడటం!
ఫోన్ అనునిత్యం చేతిలోనే ఉంటుంది. ఫోన్ చూడటం విపరీతంగా అలవాటుగా మారింది. ఐదు నిమిషాలు ఖాళీ దొరికినా ఫోన్ లోకి కళ్లను దూర్చేసేవారు, మరే పనీ పెట్టుకోకుండా ఫోన్ చూడటమే పనిగా పెట్టుకున్న వారు కోకొల్లలు. అతిగా ఫోన్ చూడటం వల్ల.. కళ్లలోకి పడే బ్లూ లైట్ మీ నిద్రనే కాదు, మీ ఆరోగ్యాన్నే దెబ్బతీస్తుందని అంటున్నాయి పరిశోధనలు. రీల్స్ చూడటం, లేదా ఎంటర్ టైన్ మెంట్ వీడియోలు చూడటం, ఫోన్ లో గేమ్స్ ఆడటం..గంటలు గంటలు ఫోన్ మాట్లాడుతూనే ఉండటం.. ఇవి సానుకూలమైన అలవాట్లు ఎంతమాత్రం కాదు!
పూర్ స్లీపింగ్ హ్యాబిట్స్!
అతిగా పని చేస్తూనో, అతిగా ఆలోచిస్తూనో, విపరీతమైన ఎంటర్ టైన్ మెంట్ తోనో.. అర్ధరాత్రుల్ల వరకూ మేలుకోవడం, తెల్లవారుఝామున పడుకోవడం, ఆ తర్వాత ఏ పదికో, పన్నెండుకో నిద్ర లేవడం. లేదంటే రోజంతా పడుకోవడం, రాత్రిళ్లు వేరే పనులు పెట్టుకోవడం.. ఇవన్నీ పూర్ స్లీపింగ్ హ్యాబిట్స్. అతిగా నిద్రపోవడం లేదా, నిద్రకంటూ ప్రాపర్ షెడ్యూల్ లేకపోవడం మానుకోవాల్సిన అలవాటు. ఈ విషయంలో ప్రకృతికి అనుగుణంగా మెలగడం మంచి అలవాటు.
తిండి విషయంలో జాగ్రత్త లేకపోవడం!
శరీరానికి పడని ఫుడ్ ను తక్షణం వదిలివేయడం ఉత్తమం. తినడం విషయంలో వేరే దొరకలేదనో, ఏమవుతుంది అనో, జాగ్రత్త అనవసరం అనో, బాగా ఇష్టం అనో.. జంక్ ఫుడ్ ను, స్ట్రీట్ ఫుడ్ నో విపరీతంగా లాగించేయడం కూడా చాలా మందికి ఉండే అలవాటే! సాయంత్రం అయితే స్ట్రీట్ ఫుడ్ ను తింటూ అదో తప్పనిసరి అలవాటుగా కలిగిన వారు కోకొల్లలు. రెగ్యులర్ గా వాటిని తింటున్నా.. తమకు ఏ సమస్యా లేదు.. అని చెప్పే వాళ్లు క్రమంగా తగ్గిపోతూ ఉన్నారంటే అదెంత ఇబ్బందికరమైన అలవాటో అర్థం చేసుకోవచ్చు!
సెల్ఫ్ ఐసొలేషన్!
రకరకాల రీజన్లతో అందరికీ దూరంగా మెలగడం మరి కొందరికి అలవాటు. ఉద్యోగం లేదనో, పెళ్లి కాలేదనో, మరేదైనా ఫీలింగ్ తోనో చాలా మంది సెల్ఫ్ ఐసొలేట్ అయిపోతూ ఉంటారు. ఎవరైనా కలవడానికి ఉత్సాహాన్ని చూపించినా, వీరిలో అందుకు ఆసక్తి ఉండదు. ఈ సెల్ఫ్ ఐసొలేషన్ కూడా చెడ్డ అలవాటే. అందరూ తమను తక్కువగా చూస్తారు అనే భావనను పక్కన పెట్టి పదుగురిలో కలిస్తే కొత్త అవకాశాలూ రావొచ్చు.