సినిమా రివ్యూ: కవచం

రివ్యూ: కవచం రేటింగ్‌: 2/5 బ్యానర్‌: వంశధార క్రియేషన్స్‌ తారాగణం: బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, కాజల్‌ అగర్వాల్‌, మెహ్రీన్‌, నీల్‌ నితిన్‌ ముఖేష్‌, పోసాని కృష్ణమురళి, హరీష్‌ ఉత్తమన్‌, రాజేష్‌, హర్షవర్ధన్‌ రాణె, అజయ్‌…

రివ్యూ: కవచం
రేటింగ్‌: 2/5
బ్యానర్‌: వంశధార క్రియేషన్స్‌
తారాగణం: బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, కాజల్‌ అగర్వాల్‌, మెహ్రీన్‌, నీల్‌ నితిన్‌ ముఖేష్‌, పోసాని కృష్ణమురళి, హరీష్‌ ఉత్తమన్‌, రాజేష్‌, హర్షవర్ధన్‌ రాణె, అజయ్‌ తదితరులు
కూర్పు: చోటా కె. ప్రసాద్‌
సంగీతం: తమన్‌.ఎస్‌
ఛాయాగ్రహణం: చోటా కె. నాయుడు
నిర్మాత: నవీన్‌ చౌదరి సొంటినేని
కథ, కథనం, దర్శకత్వం: శ్రీనివాస్‌ మామిళ్ల
విడుదల తేదీ: 7 డిసెంబర్‌, 2018

తెలుగు సినిమా అన్నాక ఎప్పుడో అప్పుడు ఖాకీ యూనిఫామ్‌ వేయాల్సిందే. అప్పుడు కానీ హీరోగా లాంఛనం పూర్తి కాదు. ఇప్పుడు ఖాకీ వేసే వంతు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ది. ఈ చిత్ర దర్శకుడు శ్రీనివాస్‌ మామిళ్లకి పోలీస్‌ కథతో సినిమా తీయాలనే ఆలోచన అయితే వుంది కానీ దానిని ఏ విధంగా డీల్‌ చేయాలనే దానిపై క్లారిటీ కొరవడింది. అచ్చమయిన మాస్‌ మసాలా పోలీస్‌గా తీర్చిదిద్దాలా లేక ఇప్పటి ప్రేక్షకులకి నచ్చే విధంగా థ్రిల్లింగ్‌ పోలీస్‌ స్టోరీగా దీనిని మలచాలా అనే అయోమయంలో 'కవచం' బలహీనంగా మారి, దీని బారినుంచి మన సెన్సిబులిటీస్‌ని కాపాడుకోవడానికి ఓ కవచం అవసరం పడుతుంది.

భయపడే వాడికి, భయపెట్టే వాడికీ మధ్య కవచంలా ఒకడుంటాడు… వాడే పోలీస్‌! అంటాడు హీరో. ఈ పాయింట్‌ని స్ట్రెస్‌ చేయడానికో లేక చెప్పడానికి సరిపడా పాయింట్‌ లేకనో… పలుమార్లు హీరో 'కవచం' డ్యూటీ చేసే సీన్లని బౌన్సింగ్‌ ఫైట్ల రూపంలో చూపిస్తూ పోయారు. 'జయ జానకీ నాయక' మోడ్‌లోనే వున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ భారీ డైలాగులన్నీ అదే మాడ్యులేషన్‌లో చెబుతోంటే, పంచ్‌ సరిపోతోందో లేదోనని తమన్‌ వాల్యూమ్‌ పెంచి మరీ ఉనికి చాటుకుంటూ వుంటాడు. సున్నితత్వం, సౌమ్యం అనే వాటికి చోటివ్వరాదన్నట్టు అవసరానికి మించిన యాక్షన్‌తో తెరపై ఎవరికి వారే అతికి పరిధిని నిర్దేశించే పనిలో వుంటారు.

ప్రథమార్ధం అంతా కూడా బెల్లంకొండని మాస్‌ హీరోగా నిలబెట్టే మాండెటరీ ఎఫర్ట్స్‌తో ఒక డైరెక్షన్‌ అంటూ లేకుండా జరిగిపోతుంది. కాజల్‌, మెహ్రీన్‌ల ట్రాక్స్‌ కూడా గ్యాప్‌ ఫిల్లర్స్‌లా అనిపిస్తాయే తప్ప పర్పస్‌ వున్నట్టు అనిపించవు. తలా ఒక పాట ఇచ్చి హీరోయిన్లకి న్యాయం చేస్తారు. మధ్యలో కిడ్నాప్‌ డ్రామా, పోలీసుల కళ్లు కప్పి హీరో డబ్బు చేజిక్కించుకోవడం లాంటివి కాస్త అటెన్షన్‌ని రాబట్టుకుంటే, ఇంటర్వెల్‌ ట్విస్ట్‌తో 'కవచం' గట్టిపడిన ఫీలింగ్‌ వస్తుంది. అయితే ఉక్కు కవచంగా మార్చే వీలున్న కథని, మాస్‌ మసాలా పేరిట మట్టి కవచంగా తీర్చిదిద్దడంతో ఒక డీసెంట్‌ యాక్షన్‌ సినిమా కాగలిగే ప్లాట్‌ ఎక్కడో మధ్యలో అగాధాల్లోకి జారిపోతుంది.

ధృవ చిత్రం మాదిరిగా క్యాట్‌ అండ్‌ మౌస్‌ గేమ్‌ ఆడుకునే వీలున్న కథని, సింగం మోడ్‌లోకి తీసుకెళ్లి తెరపై ఏమీ జరగకపోయినా ఏదో జరుగుతోన్న అలజడి సృష్టించే ప్రయత్నం బలంగా జరుగుతుంది. కొన్ని ట్విస్టులు బాగున్నా కానీ హీరో మరీ చిన్న క్లూ ఇస్తే మొత్తం స్టోరీ ఊహించి చెప్పేయగల సమర్ధుడు కావడంతో ఉత్కంఠకి తావు లేకుండా పోయింది. చేయని నేరంలో ఇరుక్కుని, ఉద్యోగం పోగొట్టుకుని, ప్రేమించిన యువతి ఏమయిందో తెలియని స్థితిలో వున్న హీరో ఏ దశలోను అన్ని సమస్యల్లో వున్నవాడిలా అనిపించడు. పైగా ఉద్యోగం ఊడిన తను ఉద్యోగంలో వున్న సహచరుడిపై అజమాయిషీ చలాయిస్తూ ఆర్డర్లేస్తుంటాడు.

పాత్ర ఏమిటి, ఎలాంటి పరిస్థితుల్లో వుంది, ఈ టైమ్‌లో ఫలానా సిట్యువేషన్‌లో ఇవ్వాల్సిన రియాక్షన్‌ ఏమిటి లాంటి బేసిక్స్‌ గురించి బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కి ఏమాత్రం పట్టినట్టు లేదు. 'నేను హీరో… హీరో ఇలాగే బిహేవ్‌ చేస్తాడు' అని ఏదో కీ ఇచ్చిన వాడిలా సీన్‌కి, సిట్యువేషన్‌కి సంబంధం లేకుండా చేసుకుంటూ పోయాడు. హీరోయిన్లిద్దరూ కూడా బ్యాక్‌గ్రౌండ్‌కి పరిమితం అయిపోవడంతో సెకండ్‌ హాఫ్‌ టోటల్‌గా యాక్షన్‌ మీదే డిపెండ్‌ అవుతుంది. అది రియలిస్టిక్‌గా వుంటే ఆసక్తి కలుగుతుందేమో, కనీసం హీరో తెలివితేటలు ప్రదర్శిస్తే అయినా ఎంతో కొంత అలరించే అవకాశం వుండేదేమో… అసలు ఇంటిలిజెన్స్‌కి తావు ఇవ్వకుండా, పైగా దానిని చవకబారు హాస్యంతో కప్పిపుచ్చేందుకు చూడడంతో 'కవచం' సహనానికి పరీక్షగా మారుతుంది.

ట్రెయిలర్‌ చూడని వారికి విలన్‌ ఎవరనే సస్పెన్స్‌ వుంటుందేమో తెలియదు మరి. ఆ విలన్‌ చుట్టూ వున్న సస్పెన్స్‌ని చివరి వరకు దాచి పెట్టేయడంతో హీరోకి అంతవరకు పెద్దగా పని లేకుండా పోతుంది. పోనీ విలన్‌ వచ్చి ఏదైనా కొత్తగా చేస్తాడా అంటే అతడివన్నీ రావుగోపాలరావు కాలం నాటి ఐడియాలే కావడంతో ఆ ఆశ కూడా ఆవిరైపోతుంది. నేటి తరం ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో పెట్టుకుని తీసినట్టయితే అదే ఈ కథకి కవచం అయి వుండేది. కానీ ముందే చెప్పినట్టుగా కొత్తదనానికి, రొటీన్‌ పోకడలకి మధ్య నలిగిపోయింది. ప్రేక్షకులనీ నలిపేసింది.

కాజల్‌, మెహ్రీన్‌తో పాటు విలన్‌గా నీల్‌ నితిన్‌ కూడా పెద్దగా చేయడానికి ఏమీ లేకపోయింది. అంత బిల్డప్‌తో ఎంటర్‌ అయిన హరీష్‌ ఉత్తమన్‌ కూడా పరుగులు పెట్టి ఫిట్‌నెస్‌ చాటుకోవడానికి తప్ప అతని పాత్ర వల్ల ప్రయోజనం లేకుండా పోయింది. పోసాని కృష్ణమురళి నవ్వించడానికి చేసే విఫలయత్నం యాతన పెడుతుంది. కనీసం తమన్‌ అయినా కాస్త ఉపశమనం ఇస్తాడంటే ఒక్క పాట కూడా మెప్పించలేకపోయింది. భారీగా ఖర్చు పెట్టి తీయడం అయితే తీసారు కానీ ప్రేక్షకుల రక్షణ కూడా దృష్టిలో వుంచుకుంటే బాగుండేది.

బాటమ్‌ లైన్‌: కల్లోలం!
-గణేష్‌ రావూరి

సినిమా రివ్యూ: సుబ్రహ్మణ్యపురం