cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: కిట్టు ఉన్నాడు జాగ్రత్త

సినిమా రివ్యూ: కిట్టు ఉన్నాడు జాగ్రత్త

రివ్యూ: కిట్టు ఉన్నాడు జాగ్రత్త
రేటింగ్‌: 2.75/5
బ్యానర్‌:
ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి. 
తారాగణం: రాజ్‌ తరుణ్‌, అను ఎమాన్యుయేల్‌, అర్బాజ్‌ ఖాన్‌, పృధ్వీ, రఘుబాబు, ప్రవీణ్‌, నాగబాబు, సుదర్శన్‌, రాజా రవీంద్ర, ప్రభాకర్‌ తదితరులు
కథ: శ్రీకాంత్‌ విస్సా 
మాటలు: సాయిమాధవ్‌ బుర్రా
కూర్పు: ఎం.ఆర్‌. వర్మ
సంగీతం: అనూప్‌ రూబెన్స్‌
ఛాయాగ్రహణం: బి. రాజశేఖర్‌ 
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
కథనం, దర్శకత్వం: వంశీకృష్ణ
విడుదల తేదీ: మార్చి 3, 2017

'మనీ' నుంచి 'ఎక్స్‌ప్రెస్‌ రాజా' వరకు చాలానే క్రైమ్‌ కామెడీలు వచ్చాయి, విజయవంతమయ్యాయి. ఇప్పుడదే జోనర్‌లో వచ్చిన 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' కూడా ఈ తరహా చిత్రాలకి పెట్టుకున్న ఫార్ములాని తు.చ. తప్పకుండా పాటిస్తుంది. ప్రేక్షకులని నవ్వించడమే ముఖ్యోద్దేశం కనుక దానిపై శ్రద్ధ బాగానే పెట్టారు. ముఖ్యంగా పృధ్వీ కామెడీ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలిచింది. 'రేచీకటి' లోపాన్ని కవర్‌ చేసుకుంటూ అతను చేసిన కామెడీ గిలిగింతలు పెడుతుంది. 

కుక్కల్ని కిడ్నాప్‌ చేసే విచిత్రమైన వృత్తిని ఎంచుకున్న కిట్టు (రాజ్‌ తరుణ్‌) అది చేయడానికి వెనుక ఓ కారణం ఉంటుంది. పెద్ద దాదా (ప్రభాకర్‌) దగ్గర పదిహేను లక్షల అప్పు చేసి, ఆ వడ్డీ తీర్చడానికి కుక్కల్ని కిడ్నాప్‌ చేయడం స్టార్ట్‌ చేస్తాడు. కిట్టు చేసే పని కారణంగా తనని అసహ్యించుకుని వెళ్లిపోతుంది అతని ప్రేయసి జానకి (అను ఎమాన్యుయేల్‌). ఒకే ఒక్క కుక్కని కిడ్నాప్‌ చేసేసి ఇక తన సమస్యని తీర్చేసుకోవాలని ప్లాన్‌ చేస్తాడు కిట్టు. తన ప్లాన్‌ని సక్సెస్‌ఫుల్‌గా అమలు చేస్తాడు కానీ ఈలోగా జానకిని ఏఆర్‌ (అర్బాజ్‌ ఖాన్‌) అనే మాఫియా డాన్‌ కిడ్నాప్‌ చేస్తాడు. అతను ఆమెని కిడ్నాప్‌ చేయడానికి కారణమేంటి? అతడి నుంచి జానకిని కిట్టు కాపాడే దారేది?

మామూలు కథే అయినప్పటికీ వివిధ త్రెడ్స్‌ని కలుపుతూ అల్లుకున్న కథనం బాగానే వుంది. ముఖ్యంగా కామెడీని జోడించడంలో దర్శకుడు ఎక్కడా ఛాన్స్‌ వదులుకోలేదు. పృధ్వీ కామెడీతో పాటు, హీరోయిన్‌ స్నేహితురాలిగా స్నిగ్ధ వేసే సెటైర్లు కూడా బాగా పేలాయి. ఫేక్‌ బాబాగా రఘుబాబు కూడా అక్కడక్కడా నవ్వించాడు. ప్రథమార్ధం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోయినా, ద్వితీయార్ధంకి వచ్చేసరికి కథ అడ్డం తిరిగింది. కామెడీ మీదకి ఎక్కువ ఫోకస్‌ వెళ్లడంతో అసలు కథ పలచబడింది. హీరోయిన్‌ కిడ్నాప్‌ అయి పెద్ద సమస్యలో పడిపోయి వుంటే, దానిని మొత్తం కాసేపు పక్కన పెట్టి రఘుబాబు ఫ్లాష్‌బ్యాక్‌ కోసం ఒక సుదీర్ఘమైన ఎపిసోడ్‌ వస్తుంది. ఆ సీన్‌ అక్కడ ఎంత ఇబ్బందిగా అనిపిస్తుందంటే, ఒక సినిమా చూస్తూ, చూస్తూ మధ్యలో ఛానల్‌ మార్చేస్తే ఎలాగుంటుందో అంతగా ట్రాక్‌ తప్పుతుంది. ఆ తర్వాత రాజా రవీంద్ర పాత్రని విపరీతమైన బిల్డప్‌తో ఎంటర్‌ చేయడం, అటు తర్వాత అవసరం లేని ఐటెమ్‌ సాంగ్‌ కోసం ఒక సీన్‌ క్రియేట్‌ చేయడం ఇదంతా టోటల్‌ మూడ్‌ని డిస్టర్బ్‌ చేస్తుంది. కమర్షియల్‌ అంశాల కోసం ఇదంతా చేసిన ఫీలింగ్‌ వస్తుంది కానీ, అదే సమయాన్ని కథని పకడ్బందీగా నడిపించడంపై, సిట్యువేషనల్‌ కామెడీ పండించడంపై పెట్టి వుంటే ఎండ్‌ ప్రాడక్ట్‌ ఇంకోలా వుండేది. 

పాటల అవసరం కనిపించని ఈ చిత్రంలో అనూప్‌ చేసిన పాటలేవీ ఆకట్టుకోలేదు. డైలాగులు కొన్ని బాగానే నవ్వించాయి కానీ బుర్రా మార్కు సంభాషణలేమీ వినిపించలేదు. సినిమాటోగ్రఫీ మామూలుగా వుంది. విజువల్‌ అప్పీల్‌పై శ్రద్ధ పెట్టినట్టు లేరు. దర్శకుడిగా వంశీకృష్ణ తన సెన్సాఫ్‌ హ్యూమర్‌తో బాగానే నవ్వించాడు. అయితే ఫస్ట్‌హాఫ్‌కి రాసుకున్న ఫ్రీ ఫ్లోయింగ్‌ స్క్రీన్‌ప్లే సెకండాఫ్‌లో లేదు. ఇలాంటి కథలకి ఎంతసేపు మెయిన్‌ త్రెడ్‌ మీదే ఫోకస్‌ వుండాలి తప్ప పక్క దారి పట్టకూడదు. ఈ తరహా కథల్లోకి ఎంటరయ్యే ప్రతి పాత్ర కూడా పర్పస్‌ఫుల్‌గా వుండాలి, అలాగే వినోదానికి దోహదపడాలి. రఘుబాబు క్యారెక్టర్‌ టోటల్‌గా అవుటాఫ్‌ ట్రాక్‌ నడుస్తూ, కథతో లింక్‌ అవ్వకుండా సాగుతుంది. అలాగే రాజా రవీంద్ర క్యారెక్టరైజేషన్‌ ఈ సినిమా మూడ్‌కి అవుటాఫ్‌ సింక్‌ ఉన్నట్టనిపిస్తుంది. పవర్‌ఫుల్‌గా చూపిస్తూ వచ్చిన విలన్‌ చేత సడన్‌గా క్లయిమాక్స్‌లో బఫూన్‌లా బిహేవ్‌ చేయించడం బాలేదు. 

రాజ్‌ తరుణ్‌ మాత్రం తనకి సూటయ్యే పాత్రలు ఎంచుకుంటూ, హీరోలా బిహేవ్‌ చేయకుండా నేచురల్‌గా పర్‌ఫార్మ్‌ చేయడం అతడికి పెద్ద ప్లస్‌ అవుతోంది. కామెడీ టైమింగ్‌, డైలాగ్‌ డెలివరీ, పక్కింటి కుర్రాడిలా కనిపించే తన ఫీచర్స్‌ కూడా అతడితో రిలేట్‌ చేసుకోవడానికి హెల్ప్‌ అవుతున్నాయి. అను ఎమాన్యుయేల్‌ అందంగానే వుంది కానీ పర్‌ఫార్మెన్స్‌పై అస్సలు దృష్టి పెట్టడం లేదు. నవ్వడం, నంగిగా చూడడం మినహా ఆమె ఇందులో చేసిందేమీ లేదు. అర్బాజ్‌ ఖాన్‌ విలనీ ఎఫెక్టివ్‌గా లేదు. పృధ్వీ ఈ చిత్రానికి ప్రధానాకర్షణ. అన్ని సినిమాల్లో అతడితో ఇమిటేషన్లు చేయిస్తూ ఎంత మంచి కమెడియన్‌ని వేస్ట్‌ చేస్తున్నారో ఇది చూస్తే తెలుస్తుంది. ప్రవీణ్‌, రఘుబాబు కూడా తమ వంతు చేయాల్సింది చేసారు. 

ఓవరాల్‌గా కిట్టు ఉన్నాడు జాగ్రత్త కాలక్షేపానికి పనికొస్తుంది. ఒక మంచి క్రైమ్‌ కామెడీగా గుర్తుండిపోయే లక్షణాలున్నప్పటికీ ద్వితీయార్థంలో ట్రాక్‌ తప్పడం వల్ల ఒక సగటు సినిమాగా మిగిలిపోయింది. సరదాగా కాసేపు నవ్వుకోవడం కోసమైతే నిక్షేపంగా చూసి రావచ్చు. అంతకుమించి ఎక్కువ ఆశించవద్దు.

బాటమ్‌ లైన్‌: పృధ్వీ ఉన్నాడు ఫర్లేదు!

గణేష్‌ రావూరి

రమ్యకృష్ణ గారికి వయస్సు ఏమిటి?

హను రాఘవపూడి చాలా కష్ట పెడతాడు