Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: లవర్‌

సినిమా రివ్యూ: లవర్‌

రివ్యూ: లవర్‌
రేటింగ్‌: 2/5
బ్యానర్‌: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌
తారాగణం: రాజ్‌ తరుణ్‌, రిద్ధి కుమార్‌, రాజీవ్‌ కనకాల, అజయ్‌, సచిన్‌ ఖేడెకర్‌, సుబ్బరాజు, ప్రవీణ్‌, సత్య రోహిణి తదితరులు
సంగీతం: అంకిత్‌ తివారి, ఆర్కో, రిషి రిచ్‌ - అజయ్‌ వాస్‌, సాయి కార్తీక్‌, తనిష్క్‌ బాగ్చి
నేపథ్య సంగీతం: జెబి
కూర్పు: ప్రవీణ్‌ పూడి
ఛాయాగ్రహణం: సమీర్‌ రెడ్డి
నిర్మాత: హర్షిత్‌ రెడ్డి
రచన, దర్శకత్వం: అనీష్‌ కృష్ణ
విడుదల తేదీ: జులై 20, 2018

దిల్‌ రాజు నిర్మాణంలో ఇటీవల వచ్చిన చిత్రాల్లో ఫిదా మినహా అన్నీ కమర్షియల్‌ సూత్రాలని నమ్ముకుని వచ్చినవే. కనుక లవర్‌ నుంచి కొత్తదనం ఆశించకపోయినా, కాలక్షేపం అయితే ఎక్స్‌పెక్ట్‌ చేస్తారు. ఆద్యంతం రొటీన్‌గా, ఎలాంటి ఫ్రెష్‌నెస్‌ లేకుండా తెరకెక్కిన లవర్‌ మొదలైన కాసేపటికే విసిగిస్తాడు. కస్టమైజ్డ్‌ బైక్స్‌ తయారు చేస్తాడనే భిన్నమైన నేపథ్యం మినహా కథానాయకుడు (రాజ్‌ తరుణ్‌) పరమ రొటీన్‌ అనిపిస్తాడు. హాస్పిటల్‌లో నర్స్‌ని చూసి ప్రేమలో పడి, ప్రేమించమని ఆమె వెంట పడుతూ చేసేదాంట్లో ఎంటర్‌టైన్‌మెంట్‌ దొరకదు.

అతడిని అంతవరకు అవాయిడ్‌ చేస్తూ పోయిన కథానాయిక (రిద్ధి కుమార్‌) ఎవరో పరిచయం లేని వ్యక్తి ప్రాణం కాపాడ్డానికి ష్యూరిటీ సంతకం పెట్టగానే ప్రేమలో పడిపోతుంది. ఏ సన్నివేశంలోను కాస్తయినా ఫ్రెష్‌గా అనిపించని ఈ ప్రేమకథకి యాక్షన్‌ యాంగిల్‌ జోడిస్తూ... లివర్‌ వ్యాధితో బాధ పడుతోన్న ప్రతినాయకుడు (సచిన్‌) అరుదైన బ్లడ్‌ గ్రూప్‌కి చెందిన వ్యక్తి లివర్‌ కోసం గాలిస్తుంటాడు. సదరు బ్లడ్‌ గ్రూప్‌కి చెందిన బాలిక మన కథానాయిక సంరక్షణలో వుంటుంది. లివర్‌ కోసం తన లవర్‌ వెంట పడుతోన్న వారి నుంచి కథానాయకుడు ఆమెని ఎలా కాపాడుకుంటాడనేది కథ.

ఫోర్‌ గ్రౌండ్‌లో వున్న ఆర్టిస్టులు చేసేదీ, మాట్లాడేదీ ఆసక్తికరంగా అనిపించకపోతే బ్యాక్‌గ్రౌండ్‌ చూసుకుంటారన్నట్టు కనువిందైన లొకేషన్లలో చిత్రీకరించారు. సన్నివేశాలు బోర్‌ కొట్టించేస్తే రిలీఫ్‌ ఇవ్వడానికి మంచి పాటలుంటే బాగుంటుందని అయిదుగురు సంగీత దర్శకులతో వివిధ పాటలు చేయించారు. సీన్‌ మధ్యలో పాజ్‌ తీసుకుని సినిమాటోగ్రాఫర్‌ అపుడపుడూ మంచి సీనరీస్‌ని కవర్‌ చేసి టికెట్‌ కొన్నవారికి ఏదో రకంగా గిట్టుబాటు చేసే ప్రయత్నం చేసాడు.

దిల్‌ రాజు నిర్మాణంలో వచ్చే సినిమాలకి తగ్గట్టే క్వాలిటీ, మంచి మేకింగ్‌ వేల్యూస్‌ అయితే వున్నాయి కానీ ఆయన సినిమాల్లో వుండే 'మినిమం గ్యారెంటీ' లక్షణాలు మాత్రం కొరవడ్డాయి. ప్రథమార్ధం వరకు రొటీన్‌ స్టఫ్‌ అయినా ఏదో భరించవచ్చు కానీ ద్వితియార్ధమయితే కేరళ లొకేషన్లు చూసి సంతృప్తి పడిపోండన్నట్టు అసలు కంటెంటే లేకుండా విసిగిస్తుంది. ఇంటర్వెల్‌ ముందు వరకు కామెడీ కోసం ప్రయత్నమైనా జరుగుతుంది. ఆ తర్వాత మాత్రం లిటరల్‌గా సినిమా ఎప్పుడవుతుందా అని ఎదురు చూసేలా చేస్తుంది.

తర్వాత ఏమి జరుగుతుందనే దానిపై కాస్తయినా ఉత్కంఠ లేనపుడు చివర్లో పాథాస్‌ సాంగ్‌ పెట్టి మరీ పొడిగించడం తెలివైన పని కానే కాదు. రొటీన్‌గా ఫైట్‌ సీన్‌ పెట్టకుండా, హీరో తాలూకు కస్టమైజ్డ్‌ బైక్స్‌ నేపథ్యం నుంచి కాస్త భిన్నమైన క్లయిమాక్స్‌ తీసిన దర్శకుడు ఆ సీన్‌ వరకు జనం వుండాలని కోరుకున్నపుడు అక్కడ ఆ సాంగ్‌, ఆ ల్యాగ్‌ అనవసరమని గుర్తించలేకపోయాడు. 'అలా ఎలా' చిత్రంలో పెద్దగా వనరులు లేకుండానే ఆకట్టుకునే వినోదాన్ని పండించి మెప్పించిన దర్శకుడు అనీష్‌ కృష్ణ ఈసారి ఇన్ని ఫెసిలిటీస్‌ ఇచ్చి, ఇంత బడ్జెట్‌ ఇచ్చినా 'ఇలా ఎలా' తీసాడనే అనిపిస్తాడు.

రాజ్‌ తరుణ్‌ లుక్‌ పరంగా ఛేంజ్‌ కోసం పోనీ టెయిల్‌ వేసుకున్నాడు. గుర్తొచ్చినపుడల్లా రాయలసీమ మాండలికంలో మాట్లాడుతూ తన తరఫున ఏదో వెరైటీ ఇవ్వాలనే చూసాడు. నటుడిగా అతడి ప్రతిభ చూపించుకునే అవకాశాన్ని అయితే దర్శకుడు అస్సలివ్వలేదు. రిద్ధి కుమార్‌ క్యూట్‌గా వుంది. రాజీవ్‌ కనకాలకి చాలా కాలం తర్వాత ప్రధాన పాత్ర పోషించే అవకాశం వచ్చినా అవసరాన్ని మించిన గాంభీర్యం ప్రదర్శించి ఆకట్టుకోలేకపోయాడు. అజయ్‌ ఎప్పుడూ చేసే రొటీన్‌ అభినయంతో విసిగించగా, స్నేహితుల పాత్రల్లో ప్రవీణ్‌, సత్య, రాజేష్‌ హాస్యంతో కాస్త రిలీఫ్‌ ఇస్తారు.

ముందే చెప్పినట్టుగా ఈ చిత్రంలో కొన్ని పాటలు వినసొంపుగా వున్నాయి. ముఖ్యంగా 'నాలో చిలిపి కల' పాట గుర్తుండిపోతుంది. 'అద్భుతం' పాటలో కేరళ అందాలు కనువిందు చేస్తాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. వీనుల విందయిన పాటలు, కనువిందైన దృశ్యాలు కూడా లేకపోతే ఈ లవర్‌ ఇంకెంత విసిగించేదో మరి. హీరో మార్కెట్‌కి అనుగుణంగా లెక్కలు వేసుకోకుండా తన సంస్థ స్థాయికి తగ్గ మేకింగ్‌ వేల్యూస్‌తో దిల్‌ రాజు తన వంతు బాధ్యత నిర్వర్తించినా కానీ ఈ కథని ఓకే చేయడం మాత్రం ఆయన జడ్జిమెంట్‌ని శంకించేట్టు చేస్తుంది.

రొటీన్‌ సినిమాలు చూసేందుకు అంతగా కంప్లయింట్‌ చేయని ప్రేక్షకుల చేత కూడా 'రొటీన్‌గా వుంది' అనిపించేంత అతి సాధారణంగా, కాస్త టైమ్‌పాస్‌ అయిపోయినా పైసా వసూల్‌ అనుకునే వారి చేత కూడా 'నాసిరకం' అనిపించుకునేంత పేలవంగా వున్న ఈ 'లవర్‌' కష్టాల్లో వున్న రాజ్‌ తరుణ్‌ని గట్టెక్కించడం అయితే కష్టమేనని చెప్పాలి. సాధారణ సినిమాలని కూడా సక్సెస్‌ఫుల్‌గా బాక్సాఫీస్‌ దాటించేసే సత్తా వున్న దిల్‌ రాజుకిది గట్టి సవాలే అనాలి.

బాటమ్‌ లైన్‌: రొటీన్‌ లవరే మచ్చా!
- గణేష్‌ రావూరి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?