cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: మజిలీ

సినిమా రివ్యూ: మజిలీ

రివ్యూ: మజిలీ
రేటింగ్‌: 2.75/5
బ్యానర్‌: షైన్‌ స్క్రీన్స్‌
తారాగణం: నాగచైతన్య, సమంత, దివ్యాంశ కౌశిక్‌, రావురమేష్‌, సుహాస్‌, సుబ్బరాజు, పోసాని కృష్ణమురళి తదితరులు
సంగీతం: గోపి సుందర్‌
నేపథ్య సంగీతం: తమన్‌
కూర్పు: ప్రవీణ్‌ పూడి
ఛాయాగ్రహణం: విష్ణుశర్మ
నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్‌ పెద్ది
కథ, కథనం, మాటలు, దర్శకత్వం: శివ నిర్వాణ
విడుదల తేదీ: ఏప్రిల్‌ 5, 2019

ప్రేమించిన అమ్మాయిని మరచిపోలేక, ఆమెకి పెళ్లయినా కానీ ఇంకా తనపై ఇష్టం తగ్గక... ఎలాగైనా ఆమెని దక్కించుకోవాలనే ప్రేమికుడి తపనని 'నిన్ను కోరి'లో చూపించిన దర్శకుడు శివ నిర్వాణ ఈసారి కూడా అదే తరహా ప్రేమకథని ఎంచుకున్నాడు. అయితే ఈసారి ప్రేమించిన అమ్మాయి దూరమైన వ్యక్తి మరో యువతిని పెళ్లాడి ఆమెతో కలిసుండలేక, తన ప్రేయసిని మరచిపోలేక మదన పడుతుంటాడు. ప్రేయసి దూరమైన క్షణం నుంచి ముందుకి కదలలేక అక్కడే ఆగిపోయి బాధ పడుతోన్న వ్యక్తి దానిని అధిగమించి తన మజిలీ ఎలా చేరుకున్నాడనేది ఇతివృత్తం.

'దేర్‌ ఈజ్‌ లవ్‌... దేర్‌ ఈజ్‌ పెయిన్‌' అంటూ ప్రేమలోని పెయిన్‌ని తన స్టోరీకి డ్రైవింగ్‌ ఫోర్స్‌గా మరోసారి ఎంచుకున్న శివ పెయిన్‌ని బాగానే చూపించగలిగాడు కానీ అంత పెయిన్‌ అనుభవించేంత లవ్‌ని ఎస్టాబ్లిష్‌ చేయలేకపోయాడు. కెరీర్‌, ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌ ఏమీ పట్టకుండా, తన లోకంలో తాను బ్రతికేట్టు, పెళ్లయినా తన భార్యని పట్టించుకోకుండా, తన గురించి ప్రపంచం ఏమనుకుంటున్నా లెక్క చేయకుండా వుండేంతగా గతంలో ఇరుక్కుపోవాలంటే సదరు ప్రేమకథ చాలా గొప్పగా అనిపించాలి. కానీ పూర్ణ (చైతన్య) తొలి ప్రేమ అయిన అన్షు (దివ్యాంశ) అలా అతనికి గుర్తుండిపోయేంతగా, లేదా ఆమె దూరమయితే ఆ బాధ మనకి గుచ్చుకునేంతగా అయితే ఎక్కడా వుండదు.

శివ నిర్వాణ ఈ కథని 'సాగర సంగమం' స్ఫూర్తితో రాసుకున్నాడనిపిస్తుంది... కథానాయకుడు తన మజిలీ చేరుకునేందుకు సహకరించే చివరి ఘట్టంతో సహా. ఈ రెండు సినిమాలకీ మధ్య చాలా పోలికలున్నాయి. కాకపోతే ఇక్కడ పెళ్లయినా భార్యతో ఇమడలేకపోతాడంతే. సాగరసంగమం స్ఫూర్తి అయినపుడు... కథానాయకుడు తన ప్రేయసిని మరచిపోలేనంతగా ఆమె ప్రేమలో మునిగిపోవడానికి, ఇక గమ్యం పట్టకుండా తిరగడానికి, లక్ష్యాన్ని కూడా వదిలేసుకోవడానికి తగిన కారణముండాలని గ్రహిస్తే బాగుండేది. క్రికెటర్‌ కావాలనే తన లక్ష్యాన్ని వదిలేసాడంటే... కనీసం ఆ క్రికెట్‌లో అతను కొన్ని విజయాలు సాధించడానికి అయినా ఆమె స్ఫూర్తినిచ్చినట్టు చూపించాల్సింది. సంఘటనలతో కదిలించడం కాకుండా సన్నివేశాలతో పెయిన్‌ ఎస్టాబ్లిష్‌ చేసి, సంభాషణలతో మెప్పించే ప్రయత్నం చేయడం వల్ల మజిలీ ఎమోషనల్‌గా అంతగా కనక్ట్‌ కాలేకపోతుంది.

పూర్ణ క్యారెక్టర్‌ ఆర్క్‌ కంటే... శ్రావణి (సమంత) క్యారెక్టర్‌ పరిపూర్ణంగా, ఎక్కువ కనక్ట్‌ అయ్యేలావుంది. పూర్ణని ఆమె మౌనంగా ఎలా ప్రేమించిందీ, అతను వేరే అమ్మాయితో ప్రేమలో పడ్డప్పుడు ఆ బాధని ఎలా భరించిందీ, అతను ఎటూ కాకుండా పోతున్నపుడు అతని తోడుగా మారడానికి ఏ విధంగా త్యాగం చేసి అతని జీవితంలోకి వచ్చింది, అతను తనని నిర్లక్ష్యం చేస్తున్నా ప్రేమగా ఎలా భరించిందీ... ఇలా సమంత ప్రేమ, పెయిన్‌ పవిత్రంగా, గాఢంగా, ఎఫెక్టివ్‌గా అనిపిస్తాయి. మొత్తం కథని నడిపించడానికి ఉత్ప్రేరకంగా పని చేయాల్సిన ఎపిసోడ్‌ని అంత ఉదాసీనంగా తీసేయడం తగదనిపిస్తుంది.

పూర్ణ అనుభవిస్తోన్న పెయిన్‌ కంటే అతని వల్ల ఎఫెక్ట్‌ అవుతోన్న అతని తండ్రి (రావు రమేష్‌), భార్య పాత్రల ఎమోషన్స్‌ ఎక్కువ కనక్ట్‌ అవుతాయి. దీనికి సదరు నటీనటుల అభినయం కూడా అదనపు కారణం ని చెప్పాలి. ప్రథమార్ధం ముగుస్తుందనగా కథలోకి ప్రవేశించే సమంత అక్కడ్నుంచీ ఈ చిత్రాన్ని తన అభినయంతో ముందుకి తీసుకెళుతుంది. అలాగే కొడుకు జీవితం ఎటూ కాకుండా పోతోందని క్షోభ పడే పాత్రలో రావు రమేష్‌ నటన అత్యంత సహజంగా వుంది. హీరో స్నేహితుడిగా నటించిన సుహాస్‌, ఇష్టం లేకపోయినా కూతుర్ని ఇచ్చిన పోసాని, హీరోని బాధ పెడుతూ అందులో ఆనందాన్ని ఆస్వాదించే సుబ్బరాజు తదితర పాత్రలు చక్కగా కుదిరాయి. వీరిలో సుహాస్‌ నటన చాలా బాగుంది.

నాగచైతన్యకి ఇంతటి పరిపూర్ణమైన క్యారెక్టర్‌ ఇంతకుముందు దక్కలేదు. జీవితంలో వివిధ దశలు చూపించే ఈ పాత్రలో చైతన్య తన శక్తి మేర నటించాడు. ముఖ్యంగా చివరి సన్నివేశంలో చక్కని నటనతో మెప్పించాడు. నటుడిగా ఇది నాగచైతన్యకి ప్లస్‌ అయ్యే క్యారెక్టరు. తనకి తాను ఈ చిత్రంతో ఒక బార్‌ సెట్‌ చేసుకోగలిగాడు. మజిలీలోని భావోద్వేగాలకి తమన్‌ నేపథ్య సంగీతంతో ప్రాణం పోసాడు. పాటలు స్వరపరిచిన గోపి సుందర్‌ 'ప్రియతమా' పాటలో తన ప్రత్యేకత చాటుకున్నాడు. ఎమోషనల్‌ సన్నివేశాలని ఛాయాగ్రాహకుడు మరింత కదిలించేలా స్క్రీన్‌పైకి తీసుకొచ్చాడు.

దర్శకుడు శివ నిర్వాణ 'ఎమోషన్స్‌' తన ఫోర్టే అని మళ్లీ నిరూపించుకున్నాడు. అయితే ఆ భావోద్వేగాల దిశగా వెళ్లేందుకు తగిన బేస్‌ మాత్రం వేసుకోలేదు. ప్రథమార్ధంలో అనవసర విషయాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టిన భావన కలుగుతుంది. దానికంటే పూర్ణకి అన్షు ఎంత అవసరమో, ఆమె అతడిపై ఎంత ప్రభావం చూపించిందో లాంటివి ఎస్టాబ్లిష్‌ చేసినట్టయితే ఈ కథకి సార్ధకత వచ్చి వుండేది. కొన్ని సన్నివేశాలని దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడు. భార్యని డబ్బులు అడగడానికి ఇబ్బంది పడుతోన్న భర్త ఆంతర్యం అర్థం చేసుకుని ఆమె అతనికి డబ్బులిచ్చే సన్నివేశం లాంటివి శివ నైపుణ్యానికి అద్దం పడుతుంది. సంభాషణల పరంగాను శివ మరోసారి తన ప్రతిభ చాటుకున్నాడు.

ఇక ఈ కథని మజిలీ చేర్చడానికి ఎంచుకున్న 'సాగర సంగమం'లోని చివరి ఘట్టంని పోలిన ట్విస్టు ఫోర్స్‌డ్‌గా అనిపిస్తుంది. దాని తర్వాత జరిగేదంతా కూడా చాలా సినిమాటిక్‌గా, ఓవర్‌ డ్రమెటిక్‌గా తోస్తుంది. దాని కోసమని అప్పటికప్పుడు నాగచైతన్య వయసు పైబడిన భావన కలిగించడానికి గడ్డంలో కాసిని తెల్ల వెంట్రుకలు చూపించడం లాంటివి కూడా గ్లేరింగ్‌గా అనిపిస్తాయి. ఈ సన్నివేశాల్లోని నాటకీయత సంగతి అటుంచితే, సమంత అద్భుతమైన అభినయంతో ఈ సన్నివేశాలని చాలా వరకు కన్విన్సింగ్‌గా మార్చేసింది.

నిజ జీవితంలో భార్యాభర్తలయిన చైతన్య, సమంత ఇందులో భార్యాభర్తలుగా నటించడం 'మజిలీ'కి అతి పెద్ద ప్లస్‌ పాయింట్‌. మజిలీలో మెచ్చుకునే అంశాలు వున్నప్పటికీ ఆ మజిలీ చేరుకునే మార్గంలో ఒడిదుడుకులని ఫీలవకుండా వుండలేం. ద్వితియార్ధంలో ఎమోషన్స్‌ కొంతవరకు మెప్పించినా కానీ కథలో అతి కీలకాంశమయిన తొలిప్రేమ ఎపిసోడ్‌ చాలా సాధారణంగా అనిపించిన వెలితిని పూడ్చేంత శక్తివంతంగా లేవవి. మొత్తంగా ఈ ప్రేమకథ యువతరం కంటే కాస్త మెచ్యూర్డ్‌ సెక్షన్‌కి అప్పీల్‌ అవుతుంది.

బాటమ్‌ లైన్‌: ఒడిదుడుకుల మజిలీ!
- గణేష్‌ రావూరి