సినిమా రివ్యూ: మేడ మీద అబ్బాయి

రివ్యూ: మేడ మీద అబ్బాయి రేటింగ్‌: 2/5 బ్యానర్‌: జాహ్నవి ఫిలింస్‌                                తారాగణం:…

రివ్యూ: మేడ మీద అబ్బాయి
రేటింగ్‌: 2/5
బ్యానర్‌:
జాహ్నవి ఫిలింస్‌                               
తారాగణం: అల్లరి నరేష్‌, నిఖిలా విమల్‌, హైపర్‌ ఆది, శ్రీనివాస్‌ అవసరాల, జయప్రకాష్‌, సత్యం రాజేష్‌, తులసి తదితరులు
కథ: వినీత్‌ శ్రీనివాసన్‌
కూర్పు: నందమూరి హరి
సంగీతం: షాన్‌ రెహమాన్‌
ఛాయాగ్రహణం: కున్‌జున్ని ఎస్‌. కుమార్‌
నిర్మాత: బొప్పన చంద్రశేఖర్‌
దర్శకత్వం: ప్రజిత్‌ .జి
విడుదల తేదీ: సెప్టెంబర్‌ 8, 2017

కొన్నేళ్లుగా విజయాలు లేక డీలా పడ్డ అల్లరి నరేష్‌ ఈసారి ఒక మలయాళ రీమేక్‌ కథని నమ్ముకున్నాడు. మలయాళంలో 'ప్రేమమ్‌' ఫేమ్‌ నివిన్‌ పాలీ నటించిన 'ఒరువడక్కన్‌ సెల్ఫీ' చిత్రాన్ని అదే దర్శకుడితో 'మేడ మీద అబ్బాయి'గా రీమేక్‌ చేసారు. టైటిల్‌, కాస్టింగ్‌ని బట్టి ఇదొక హాస్యరస చిత్రమనే అంచనాలు ఏర్పడతాయి.

ప్రథమార్ధం అందుకు తగ్గట్టుగానే కామెడీ టోన్‌లో సాగినప్పటికీ ద్వితియార్ధంలో అనుకోని మలుపులు తిరిగి 'మేడ మీద అబ్బాయి' దారి తప్పుతుంది. సోషల్‌ మీడియాలో ఫేక్‌ ఐడెంటిటీతో జరిగే మోసాలు, దాని వల్ల కొందరు పడే ఎమోషనల్‌ టార్చర్‌ గురించిన ఎలిమెంట్స్‌తో ఈ చిత్రంలో ఒక సందేశం వుంది. అయితే ఆ మెసేజ్‌ని లాస్ట్‌ యాక్ట్‌కి పరిమితం చేయడంతో, సెకండ్‌ యాక్ట్‌ ఏమో ఆరంభంలో వున్న సెటప్‌కి, మూడ్‌కి పూర్తి విరుద్ధంగా వుండడంతో ఇంటర్వెల్‌ అనంతరం సినిమా పూర్తిగా ట్రాక్‌ తప్పిపోతుంది. 

కథలోకి వెళితే… శ్రీను (అల్లరి నరేష్‌) సినిమా డైరెక్టర్‌ కావాలని కలలు కంటుంటాడు. హైదరాబాద్‌ వెళ్లి రాజమౌళి దగ్గర అసిస్టెంట్‌గా జాయిన్‌ అవుదామని అనుకుంటాడు. కానీ అక్కడ కొన్ని రోజులుండేసరికి సినిమా ఇండస్ట్రీకి తాను కరక్ట్‌ కాదని తెలుసుకుని తిరిగొచ్చేస్తాడు. ఊరికి వచ్చిన తనని అందరూ అదోలా చూస్తుంటారు. తన ఎదురింట్లో అమ్మాయి సింధుని (నిఖిల) లేవదీసుకుని వెళ్లిపోయాడని ఊరంతా అనుకుంటూ వుంటారు. తాను హైదరాబాద్‌ వెళుతున్న టైమ్‌లో సింధుకి తెలియకుండా తనతో కలిసి ఒక సెల్ఫీ దిగి దానిని తన స్నేహితుడికి (ఆది) పంపిస్తాడు. అతడేమో వాళ్లిద్దరూ ప్రేమించుకుని పారిపోయారని ఊళ్లో వాళ్లకి చెబుతాడు.

దాంతో ఆమెని తీసుకొచ్చి ఊరంతటికీ నిజం చెప్పడం కోసం స్నేహితుడితో కలిసి హైదరాబాద్‌ వెళతాడు. ఆమెని వెతికే ప్రయత్నంలో తమకి ఓ ప్రైవేట్‌ డిటెక్టివ్‌ ధనుంజయ్‌ (అవసరాల శ్రీనివాస్‌) పరిచయం అవుతాడు. సింధు కనిపిస్తుంది కానీ ఆమె వేరొకరితో ప్రేమలో వుందని, అతడిని కలుసుకుని తప్ప తిరిగి రాదని అతడిని వెతుక్కుంటూ వెళతారు. అక్కడ వారు తెలుసుకునేదేంటి? ఆమె ప్రియుడు ఎవరు? 

ఫస్ట్‌ హాఫ్‌లో వున్న హ్యూమర్‌ మొత్తం పోయి ద్వితియార్థం ఒక మిస్టరీ డ్రామాగా మారుతుంది. క్లయిమాక్స్‌లో ఆసక్తికర అంశాలు వున్నప్పటికీ ద్వితియార్ధం సాగే తీరు ఆసక్తిని పూర్తిగా హరించేస్తుంది. ముఖ్యంగా సింధు ప్రియుడిని వెతుకుతూ వెళ్లే ప్రయాణం వినోదాత్మకంగా వుండకపోగా, సుదీర్ఘంగా సాగి విసిగిస్తుంది. అంతకుముందు సింధు ఆచూకీ కోసం శ్రీను, ధనుంజయ్‌ చేసే ప్రయత్నాలు కూడా వినోదానికి స్కోప్‌ తగ్గించేస్తాయి. సింధు ప్రేమని ఎంత సీరియస్‌గా తీసుకుంటారనే దానిపై పతాక సన్నివేశాల్లోని ఎమోషన్‌ అంత వర్కవుట్‌ అవుతుంది. కానీ ఆమె లవ్‌స్టోరీలో డెప్త్‌ లేకపోవడంతో తనని, తన ఎమోషన్స్‌ని సీరియస్‌గా తీసుకునే అవకాశం లేదు. దీంతో క్లయిమాక్స్‌లో ఇంపాక్ట్‌ తగ్గిపోతుంది. 

నరేష్‌ తనవంతుగా సిన్సియర్‌గానే చేసాడు కానీ మరోసారి రాంగ్‌ సబ్జెక్ట్‌ని ఎంచుకున్నాడు. తన ప్రధాన బలమైన కామెడీకి ఎక్కువ స్కోప్‌ ఇవ్వని సబ్జెక్ట్‌ నరేష్‌ని కొన్ని సందర్భాల్లో లిటరల్‌గా కట్టి పడేసింది. తన ఎనర్జీ లెవల్స్‌ని చూపించే అవకాశాన్ని సైతం ఈ కథ, క్యారెక్టర్‌ ఇవ్వలేదు. అతని స్నేహితుడి పాత్రలో హైపర్‌ ఆది తన మార్కు పంచ్‌లతో నవ్వించాడు. ఈ చిత్రానికి ప్లస్‌ పాయింట్‌ అంటూ వుంటే అది ఆది కామెడీ పంచ్‌లే. శ్రీనివాస్‌ అవసరాల క్యారెక్టర్‌కి సూట్‌ అయ్యాడు కానీ ఆ పాత్ర తీర్చిదిద్దిన వైనం ఆకట్టుకోదు. కథానాయిక నిఖిల మేకప్‌ కంటే గ్లిజరిన్‌ ఎక్కువ వాడాల్సి వచ్చింది. 

లో బడ్జెట్‌లో రూపొందిన ఈ చిత్రంలో సాంకేతికంగా మెప్పించిన అంశాలు ఏమీ లేవు. మేకింగ్‌ పరంగా క్వాలిటీ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్‌ కూడా ఆకట్టుకోలేదు. ముందుగా విలేజ్‌ సెటప్‌లో, ఆహ్లాదకరమైన పాత్రలతో మొదలైన చిత్రం మరో విధంగా షేప్‌ తీసుకోవడం వల్ల వేరే సినిమా చూస్తోన్న భావన కలుగుతుంది. హ్యూమర్‌ డోస్‌ బాగా తగ్గిపోయేసరికి రిలీఫ్‌ లేకుండా పోతుంది.

అవసరాల శ్రీనివాస్‌ పాత్ర కూడా సినిమాటిక్‌గా వుండడంతో అతను చెప్పే ఏ విషయాన్ని సీరియస్‌గా తీసుకునే అవకాశముండదు. ప్రధానంగా దీనిని కామెడీ చిత్రంగా మార్కెట్‌ చేయడం కాకుండా కథకి కట్టుబడి ప్రచారం చేసి వుండాల్సింది. అల్లరి నరేష్‌ హీరో అనేసరికి స్టాండర్డ్‌ ఎక్స్‌పెక్టేషన్స్‌ ఏర్పడతాయి. దానికి తోడు సినిమా ప్యాకేజింగ్‌, మార్కెటింగ్‌ కూడా కామెడీ చిత్రం తరహాలోనే జరగడం వల్ల సెకండ్‌ హాఫ్‌ సర్‌ప్రైజ్‌లా కాకుండా డిజప్పాయింట్‌మెంట్‌లా తయారైంది. 

మలయాళ ఒరిజినల్‌లో నేటివిటీకి అద్దం పట్టిన తీరు, సహజత్వాన్ని ప్రతిబింబించే పాత్రలు కథకి బాగా దోహదపడ్డాయి. ఈ చిత్రాన్ని అక్కడ సక్సెస్‌ చేసిన డైరెక్టర్‌ ప్రజిత్‌ అదే తరహా నేటివిటీని తెలుగు వెర్షన్‌లో తీసుకురాలేకపోయాడు. పాత్రలు కూడా ఆర్టిఫిషియల్‌గా తయారవడం, నివిన్‌ పాలీకి అక్కడ వున్న ఇమేజ్‌కి పూర్తి భిన్నమైన ఇమేజ్‌ అల్లరి నరేష్‌కి వుండడం… ఇలా ఎన్నో విషయాలు ఈ అబ్బాయిని మేడ మీద నిలబడనివ్వలేదు. 

బాటమ్‌ లైన్‌: మేడ మీంచి పడ్డాడు!

-గణేష్‌ రావూరి